భారత్‌- శ్రీలంక బంధం: నమల్‌ రాజపక్స కీలక వ్యాఖ్యలు!

Sri Lanka PM Son Comments On PM Modi Approach On Foreign Policy - Sakshi

న్యూఢిల్లీ : భారత ప్రధాని నరేంద్ర మోదీ పొరుగు దేశాలతో దౌత్య సంబంధాలు మెరుగుపరచుకోవడంలో ప్రత్యేక చొరవ చూపిస్తారని శ్రీలంక ప్రధాని మహిందా రాజపక్స తనయుడు, ఎంపీ నమల్‌ రాజపక్స అన్నారు. సరిహద్దు దేశాలతో సఖ్యతగా మెలిగేందుకు ఏమాత్రం వెనుకాడబోరన్న విషయం అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించారు. శ్రీలంక తాజా అధ్యక్ష ఎన్నికల్లో గోటబయ రాజపక్స గెలుపొందిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో తన సోదరుడు మహిందా రాజపక్సను ప్రధానిగా ఆయన ఎంపిక చేశారు. 2005 నుంచి 2015 వరకు ప్రధానిగా ఉన్న మహిందాకు చైనాతో సత్సంబంధాలే ఉన్నాయి. ఆయన హయాంలో రక్షణ మంత్రిగా పనిచేసిన ప్రస్తుత అధ్యక్షుడు గోటబయ... ఎల్టీటీఈ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేయడం, భారత్‌కు కనీసం సమాచారం ఇవ్వకుండానే చైనాకు చెందిన జలాంతర్గాముల్ని హిందూ సముద్ర జలాల్లోకి అనుమతినివ్వడం వంటి నిర్ణయాలు తీసుకున్నారు. 

ఈ నేపథ్యంలో గోటబయ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్న అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అంతేగాక ఇటీవలి ఎన్నికల్లో శ్రీలంకలో మైనార్టీలుగా ఉన్న తమిళులు, ముస్లింలు అధికంగా ఉండే శ్రీలంక ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో గోటబయకు పెద్దగా ఓట్లు రాకపోవడంతో భారత్‌- లంక బంధంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఎన్డీటీవీతో మాట్లాడిన రాజపక్స వంశీయుడు నమల్‌ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ భారత్‌- శ్రీలంక- చైనా దేశాల మధ్య ఉన్న సంబంధాల గురించి కొంతమంది తప్పుగా అన్వయిస్తున్నారు. నాయకుల్లో కూడా దీనిపై కొన్ని అపోహలు ఉన్నాయి. అయితే భారత ప్రధాని నరేంద్ర మోదీ సరిహద్దు దేశాలతో బంధం మెరుగుపరచుకోవడంలో ఎల్లప్పుడూ ముందుంటారు. ఆయన పొరుగు దేశాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు’ అని పేర్కొన్నారు. 

అదే విధంగా శ్రీలంక రాజకీయ పరిణామాలపై తమిళనాడు నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను నమల్‌ ఖండించారు. శ్రీలంక తమిళుల కోసం, వారి జీవనోపాధికై వారే ఏం చేశారని ప్రశ్నించారు. ‘ శ్రీలంక ఇప్పుడు సంక్షోభంలో ఉంది. 30 ఏళ్లుగా ఇక్కడ పాశవిక యుద్ధాలు జరిగాయి. ఎల్టీటీఈ ఈ యుద్ధాలను సింహళీయులు, తమిళుల మధ్య శత్రుత్వంగా చిత్రీకరించింది. ఇది దారుణమైన విషయం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా గోటబయ రాజపక్సను భారత్‌ పర్యటనకు రావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఇందుకు అంగీకరించిన గోటబయ .. ‘ శ్రీలంకలో సుస్థిర ప్రభుత్వం భారత్‌కు కూడా ఎంతో ముఖ్యం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిని బట్టి ఆయన తీసుకునే నిర్ణయాలు రక్షణ పరంగా భారత్‌కు ఎలాంటి సవాళ్లు విసురుతాయనేది చర్చనీయాంశంగా మారింది.

చైనా వ్యవహారశైలి.. అంతర్జాతీయ సమాజంలో అలజడి!
మహేంద్ర రాజపక్స అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చైనా నుంచి భారీగా రుణాలు తీసుకున్నారు.  మౌలిక సదుపాయాల కల్పన, రేవులు, ఎయిర్‌పోర్టుల నిర్మాణం కోసం 700 కోట్ల డాలర్లకు పైగా రుణాలను తీసుకోవడంతో ఇప్పుడు చైనాతో సత్సంబంధాలు కొనసాగించక తప్పని పరిస్థితి. మౌలిక సదుపాయాల కల్పన పేరుతో రుణాలు ఇచ్చి, వాటిని చెల్లించకపోతే విమానాశ్రయాలు, ఓడరేవుల్ని చైనా లీజుకి తీసుకోవడం అంతర్జాతీయ సమాజంలో ఆందోళన పుట్టిస్తోంది. యూరప్, ఆసియా మధ్య వాణిజ్య బంధాలకు ప్రతీకగా నిలిచిన  దక్షిణ శ్రీలంకలో హమ్‌బటన్‌టోటా పోర్ట్‌ నిర్మాణానికి రుణాలు చెల్లించలేక 2017లో లంక ప్రభుత్వం 99 ఏళ్ల పాటు చైనాకు లీజుకి ఇవ్వాల్సి వచ్చింది. హిందూ మహాసముద్రంలో భౌగోళికంగా శ్రీలంకకి ఉన్న అరుదైన పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చైనా చేస్తోంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top