రజనీ టూరు: తమిళ నేతల అసలు రంగు బయటకు! | Sakshi
Sakshi News home page

రజనీ టూరు: తమిళ నేతల అసలు రంగు బయటకు!

Published Sun, Mar 26 2017 12:49 PM

రజనీ టూరు: తమిళ నేతల అసలు రంగు బయటకు! - Sakshi

చెన్నై: తమిళసంఘాల ఆగ్రహంతో సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ తన శ్రీలంక పర్యటనను రద్దు చేసుకోవడంపై ఆ దేశ రాజకీయ నాయకుడు నమాల్‌ రాజపక్సే అసంతృప్తి వ్యక్తం చేశారు. 'తమిళ రాజకీయ నాయకుల అసలు రంగు బయటపడింది. శ్రీలంకలోని తమిళులను ఆదుకునేందుకు రజనీకాంత్‌ సహా ఎవరినీ వారు ముందుకు రానివ్వరు' అంటూ ఆయన ట్వీట్‌ చేశారు. శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్సే తనయుడైన నమాల్‌ ప్రస్తుతం క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతున్నారు.

తమిళ సంఘాల ఆగ్రహం నేపథ్యంలో తన శ్రీలంక పర్యటనను రద్దు చేసుకున్న విషయాన్ని రజనీ ఒక ప్రకటనలో తెలిపిన సంగతి తెలిసిందే. వీసీకే చీఫ్ తిరుమావలవన్, ఎండీఎంకే చీఫ్ వైగో తదితరులు తనను శ్రీలంక వెళ్లొద్దని కోరారని, వాళ్లతో తనకున్న సంబంధాల దృష్ట్యా వారి కోరికను మన్నిస్తూ పర్యటనను రద్దు చేసుకున్నానని ఆయన తెలిపారు. విడుదతలై చిరుతైగల్ కచ్చి (వీసీకే), మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం (ఎండీఎంకే) తదితర సంఘాల నాయకులు రజనీకాంత్‌ను కలిసి.. శ్రీలంక పర్యటనకు వెళ్లొద్దని కోరారు.  వాస్తవానికి తాను తమిళుల నివాస ప్రాంతాలును చూసేందుకే శ్రీలంక వెళ్దామనుకున్నానని, అక్కడ శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనను కలిసి మత్స్యకారుల సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని అనుకున్నట్లు రజనీ తెలిపారు. తాను రాజకీయ నాయకుడిని కానని, కేవలం ఒక నటుడినేనని రజనీ అన్నారు.

జ్ఞానం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో శ్రీలంకలోని జప్నాలో తమిళ నిర్వాసితుల కోసం నిర్మించిన 150 కొత్త ఇళ్లను సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ లబ్ధిదారులకు అందజేసేందుకు ఏప్రిల్‌ 9న ఆ దేశానికి వెళ్లాలని ఇంతకుముందు రజనీ భావించిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement