మల్టీస్టారర్ మూవీస్ చేస్తున్న స్టార్ హీరోలు
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ కనిపిస్తుంటుంది. ఇటీవల పాన్ ఇండియా ట్రెండ్ కనిపించింది. పాన్ వరల్డ్ (భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లోనూ సినిమా రిలీజ్ కావడం) ట్రెండ్ కూడా ఊపందుకుంది. ఇప్పుడు మల్టీస్టారర్ మూవీ ట్రెండ్ మరోసారి ఊపందుకుంది. ఇలా ఏ కథ ఏయే స్టార్స్‌ని కలిపింది? ఆ సినిమాల
విశేషాలపై ఓ లుక్ వేయండి...
కాకాజీతో మోహన్‌లాల్
మల్టీస్టారర్ మూవీస్ చేయడానికి చిరంజీవి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో చిరంజీవి హీరోగా నటించగా, ఇందులో రవితేజ కీలక పాత్రలో నటించారు. బాబీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ ఏడాది చిరంజీవి హీరోగా నటించిన ‘మన శంకరవరప్రసాద్‌గారు’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇందులో వెంకటేశ్ ఓ కీ రోల్ చేశారు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన సినిమా ఇది. ఇలా కథలో స్కోప్ ఉంటే చిరంజీవి సినిమాలో మరో స్టార్ హీరో కూడా నటిస్తున్నారు. మరోసారి ఈ అవకాశం ఉన్నట్లుగా తెలిసింది.
‘వాల్తేరు వీరయ్య’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబోలో ఓ సినిమా రానుంది. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్‌గా రానున్న ఈ సినిమాలో కథ రీత్యా మరో హీరోకు చాన్స్ ఉందని తెలిసింది. ఈ రోల్‌లో తొలుత ఓ తెలుగు హీరోను అనుకున్నప్పటికీ ఫైనల్‌గా మలయాళ నటుడు మోహన్‌లాల్ ఫైనలైజ్ అయ్యారని ఫిల్మ్‌నగర్ సమాచారం. తండ్రీకూతుళ్ల ఎమోషనల్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాలో చిరంజీవి భార్య పాత్రలో ప్రియమణి, చిరంజీవి కుమార్తెగా అనస్వరా రాజన్ కనిపిస్తారని తెలిసింది. ఇక మోహన్‌లాల్ పోలీస్ ఆఫీసర్ రోల్‌లో నటిస్తారని టాక్.
చిరంజీవి వంటి స్టార్ హీరో, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన మోహన్‌లాల్ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఆడియన్స్ కచ్చితంగా ఆ సినిమాను ఎంజాయ్ చేస్తారని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా చిత్రీకరణను ఈ ఏడాది మార్చిలోనే స్టార్ట్ చేయాలనుకున్నారు. కానీ ఇటీవల చిరంజీవి భుజానికి చిన్న సర్జరీ జరిగిన నేపథ్యంలో సినిమా చిత్రీకరణను ఈ నెల ఆరంభించడంలేదట.
ఏప్రిల్‌లోనే ఈ సినిమా చిత్రీకరణను స్టార్ట్ చేసి, వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ ΄్లాన్ చేస్తున్నారని తెలిసింది. కెవీఎన్ ప్రోడక్షన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా తొలుత ఏఆర్ రెహమాన్ పేరు వినిపించినప్పటికీ ఇటీవల తమన్ పేరు తెరపైకి వచ్చింది. అలాగే ఈ సినిమాకు ‘కాకా, కాకాజీ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని టాక్. అయితే ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సంక్రాంతి సోగ్గాళ్ళు
‘మనం’ సినిమాలో నాగార్జున, నాగచైతన్య కలిసి నటించారు. ఈ చిత్రం క్లైమాక్స్‌లో అఖిల్ కూడా కనిపించారు. అలా ఒకే ఫ్రేమ్‌లో నాగార్జున, నాగచైతన్య, అఖిల్ కనిపించగానే అక్కినేని అభిమానులు ఫుల్ హ్యాపీ ఫీలయ్యారు. అలాంటిది ఒకే సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్స్‌లో నాగార్జున, నాగచైతన్య, అఖిల్ కలిసి నటిస్తే అక్కినేని ఫ్యాన్స్‌కు అంతకుమించిన ఆనందం ఏముంటుంది. ఇదంతా సాధ్యమయ్యే సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ఫ్రాంచైజీ నుంచి మూడో భాగం రానుందని తెలిసింది.
తొలి భాగంలో నాగార్జున హీరోగా నటించగా, మలి భాగంలో నాగార్జున–నాగచైతన్య కలిసి నటించారు. లేటెస్ట్ మూవీలో నాగార్జున–నాగచైతన్య–అఖిల్ కలిసి హీరోలుగా నటించనున్నారని తెలిసింది. ‘వాసివాడి తస్సాదియ్యా.. వచ్చే 15 జనవరి 2027 సంక్రాంతికి సోగ్గాళ్ళు వస్తే పండగ ఇంకా కలర్‌ఫుల్‌గా ఉంటాది కదా... డేట్ మార్క్ చేసుకోండి’’ అని ఫిబ్రవరి 9న అన్నపూర్ణ స్టూడియో సంస్థ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. ఇది... ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా ఫ్రాంచైజీలోని థర్డ్ పార్ట్ మూవీకి సంబంధించినదే అని, ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ అవుతుందనే ప్రచారం తెరపైకి వచ్చింది. అంతేకాదు... ఈ చిత్రంలో నాగార్జున–నాగచైతన్య–అఖిల్ కలిసి నటించనున్నారనే టాక్ కూడా తెరపైకి వచ్చింది.
ప్రస్తుతం ఆర్‌కే కార్తీక్ డైరెక్షన్‌లో ‘కింగ్ 100’ అనే సినిమా చేస్తున్నారు నాగార్జున. ఇది నాగార్జున కెరీర్‌లోని వందో సినిమా. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిన తర్వాత ‘సోగ్గాడే చిన్నినాయనా’ ఫ్రాంచైజీలోని కొత్త సినిమా షూటింగ్‌లో నాగార్జున పాల్గొంటారని ఊహించవచ్చు. మరోవైపు ఇటీవల కాలంలో మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు నాగార్జున ఆసక్తి చూపిస్తున్నారు.
రణ్‌బీర్ కపూర్ ‘బ్రహ్మాస్త్ర’, ధనుష్ ‘కుబేర’ చిత్రాల్లో నాగార్జున లీడ్ రోల్స్ చేశారు. అలాగే నాగార్జున మెయిన్ హీరోగా, అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ ఇతర ప్రధాన పాత్రధారులుగా ‘నా సామి రంగ’ సినిమా వచ్చింది. ఇలా కథ నచ్చితే, మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు నాగార్జున సుముఖంగా ఉన్నట్లే తెలుస్తోంది. ఇక గతంలో వెంకటేశ్‌తో కలిసి ‘వెంకీ మామ’ చిత్రం చేశారు నాగచైతన్య. అలాగే ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ మూవీలో నాగచైతన్య ఓ కీ రోల్ చేసిన సంగతి గుర్తుంటే ఉంటుంది.

బామ్మర్ది బాల్‌రెడ్డి
టాలీవుడ్‌లో మల్టీస్టారర్ సినిమాలు చేయడంలో ముందు వరుసలో ఉంటారు హీరో వెంకటేశ్. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (వెంకటేశ్–మహేశ్‌బాబు), ‘మసాల’ (వెంకటేశ్–రామ్), ‘గోపాల గోపాల’ (వెంకటేశ్–పవన్‌కల్యాణ్), ‘ఎఫ్ 2, ఎఫ్ 3’ (వెంకటేశ్–వరుణ్ తేజ్) వంటి చిత్రాలే ఇందుకు నిదర్శనం. ఇటీవల చిరంజీవి హీరోగా నటించిన ‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్రంలో వెంకటేశ్ ఓ రోల్‌లో నటించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో మల్టీస్టారర్ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు వెంకటేశ్. ‘ఎఫ్ 2, ఎఫ్ 3, సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల తర్వాత హీరో వెంకటేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో మరో సినిమా రానుంది. ఈ చిత్రంలో కల్యాణ్‌రామ్ మరో హీరోగా నటించనున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. స్క్రిప్ట్ ప్రిపరేషన్‌లో బిజీగా ఉన్నారు అనిల్ రావిపూడి. జూలైలో ఈ సినిమా షూట్‌ను స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లుగా ఆల్రెడీ మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమాను ఎవరు నిర్మించబోతున్నారనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. డి. సురేష్‌బాబు, సాహు గారపాటి వంటి నిర్మాతల పేర్లు తెరపైకి వచ్చాయి. అలాగే ఈ సినిమా బావా బామ్మర్దిల మధ్య నడిచే కథ అని, రాయలసీమ నేపథ్యంలో కథనం సాగుతుందని, ఈ చిత్రానికి ‘బామ్మర్ది బాల్‌రెడ్డి’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. అంతేకాదు... ఈ సినిమాలో వెంకటేశ్ సరసన కీర్తీ సురేష్ హీరోయిన్‌గా నటిస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఏకే 47లో...
వెంకటేశ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెంబరు 47 – ఏకే47’. వెంకటేశ్ కెరీర్‌లోని ఈ 77వ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. కాగా, ఈ చిత్రంలోని మరో కీలక పాత్రలో నారా రోహిత్ నటించనున్నారని సమాచారం. ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదే థియేటర్స్‌లో రిలీజ్ కానుంది.
ఎవరు హీరో?
సూపర్ స్టార్ హీరోలు రజనీకాంత్, కమల్‌హాసన్ వారి కెరీర్ స్టార్టింగ్‌లో ‘ఆపూర్వ రాగంగళ్, మూండ్రు ముడిచ్చు, 16 వయదినిలే, నినైత్తాలే ఇనిక్కుమ్’ వంటి చిత్రాల్లో కలిసి నటించారు. వీరి కాంబినేషన్‌లో దాదాపు ఇరవై సినిమాలొచ్చాయి. కానీ ‘అలావుద్దీనుమ్ అద్భుత విళక్కుమ్’ చిత్రం తర్వాత రజనీకాంత్, కమల్‌హాసన్ కాంబోలో మరో సినిమా రాలేదు. ఆ సమయం ఇప్పుడు వచ్చింది. 47 సంవత్సరాల తర్వాత రజనీకాంత్, కమల్‌హాసన్ కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేయనున్నారు. రజనీకాంత్ దర్శకుడిగా ‘జైలర్’ సినిమా తీసి, సూపర్ హిట్ సాధించి, మళ్లీ రజనీకాంత్‌తోనే ‘జైలర్ 2’ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్న నెల్సన్ దిలీప్‌కుమార్ ఈ మల్టీస్టారర్ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.
ఇటీవల ఈ సినిమా ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ప్రోమోలో కమల్‌హాసన్, రజనీ కాంత్ ‘ఈ సినిమాలో ఎవరు హీరో’ అని దర్శకుడు నెల్సన్‌ను అడగటం, నెల్సన్ సైలెంట్‌గా ఉండటంతో ప్రోమో కంప్లీట్ కావడం చూశాం. అయితే రజనీకాంత్–కమల్‌హాసన్ లేటెస్ట్ కాంబో మూవీలో ఎవరు మెయిన్ హీరోగా నటిస్తారనే చర్చ కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఈ సినిమా గురించి ఇద్దరి హీరోల ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ నిర్మించనుంది. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది.
వచ్చే ఏడాది వేసవి తర్వాత ఈ మూవీ రిలీజ్ కావొచ్చు. మరోవైపు రజనీకాంత్ కెరీర్‌లోని 173వ సినిమాను కమల్‌హాసన్ నిర్మిస్తున్నారు. సిబి చక్రవర్తి ఈ సినిమాకు దర్శకుడు. రజనీకాంత్ హీరోగా నటించనున్న ఈ చిత్రంలో కమల్‌హాసన్ ఓ గెస్ట్ రోల్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే... రజనీకాంత్–కమల్‌హాసన్ ఒకే ఫ్రేమ్‌లో ఉన్న సినిమాలు బ్యాక్ టు బ్యాక్ స్క్రీన్‌పైకి వస్తాయని ఊహించవచ్చు.
పేట్రియాట్
1980, 1990లలో మలయాళ స్టార్ హీరోలు మోహన్‌లాల్, మమ్ముట్టి కలిసి దాదాపు 50 సినిమాలు చేశారు. కానీ 2008లో వచ్చిన ‘ట్వంటీ:20’ చిత్రం తర్వాత మోహన్‌లాల్–మమ్ముట్టి కాంబినేషన్‌లో మరో సినిమా రావడానికి, వారి అభిమానులు 18 సంవత్సరాలు ఎదురుచూడాల్సి వచ్చింది. ‘ట్వంటీ:20’ మూవీ తర్వాత మోహన్‌లాల్, మమ్ముట్టి కలిసి ‘పేట్రియాట్’ అనే సినిమా చేస్తున్నారు. అలాగే ఈ చిత్రంలోనే ఫాహద్ ఫాజిల్, కుంచాకో బోబన్, నయనతార, రేవతి వంటి స్టార్ యాక్టర్స్ కూడా నటిస్తున్నారు.
దేశభక్తి ప్రధానాంశంగా రూపొందుతున్న ఈ సినిమాలో మోహన్‌లాల్ మిలటరీ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా, మమ్ముట్టి మిస్టరీ రోల్‌లో నటిస్తున్నట్లుగా టీజర్ స్పష్టం చేస్తోంది. మహేశ్ నారాయణన్ దర్శకత్వంలో ఈ సినిమాను ఆంటో జోసెఫ్, కేజీ అనిల్‌కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది ఏప్రిల్ 23న రిలీజ్ కానుంది. మరోవైపు ‘లూసీఫర్, లూసీఫర్ 2, బ్రో డాడీ’ వంటి సూపర్‌హిట్ చిత్రాల్లో మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు స్టార్ యాక్టర్స్ మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు.
పృథ్వీరాజ్ సుకుమారన్ మెయిన్ లీడ్ రోల్ చేస్తున్న ‘ఖలీఫా’ చిత్రంలో మోహన్‌లాల్ ఓ కీలక పాత్ర పోషించనున్నారు. ఈ విషయం గురించి ఆల్రెడీ అధికారిక ప్రకటన వచ్చింది. కృతీ శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ యువ హీరో టోవినో థామస్ మరో లీడ్ రోల్ చేస్తున్నారని మాలీవుడ్ సమాచారం.
అరసన్ శింబు, విజయ్ సేతుపతి కలిసి నటిస్తున్న తమిళ సినిమా ‘అరసన్’. వెట్రిమారన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా కలైపులి ఎస్. థాను నిర్మిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. శింబు, విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కూడా జరిగిందట. శింబు–విజయ్ సేతుపతిల కాంబోలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. నార్త్ చెన్నై బ్యాక్‌డ్రాప్‌లో సాగే పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ మూవీ ఇది. వచ్చే ఏడాది ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
ఒకే ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు కలిసి మల్టీస్టారర్ మూవీస్ చేస్తున్న సినిమాలు కొన్ని ఉన్నాయి. అయితే పాన్ ఇండియా ట్రెండ్ వచ్చిన తర్వాత వివిధ ఫిల్మ్ ఇండస్ట్రీలకు చెందిన స్టార్ హీరోలు ఒకే సినిమాలో నటించే ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభాస్ మెయిన్ హీరోగా చేస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ ఫ్రాంచైజీలో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, కోలీవుడ్ యాక్టర్ కమల్‌హాసన్ ఇతర మెయిన్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. తెలుగు దర్శకుడు ప్రశాంత్ వర్మ నేతృత్వంలో ‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’లోని లేటెస్ట్ మూవీ ‘జై హనుమాన్’.
ఇందులో ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి హీరోగా నటిస్తున్నారు. కాగా ఈ మూవీలో టాలీవుడ్ హీరోలు ‘హను–మాన్’ ఫేమ్ యువ హీరో తేజ సజ్జా, రానా కీలక పాత్రల్లో నటిస్తున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. టి సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం ఇటీవల హంపీలో జరిగిన తెలిసిందే. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కానుంది. ఈ తరహాలో క్రాస్ ఓవర్ మల్టీస్టారర్ సినిమాలు మరికొన్ని ఉన్నాయి.
ఇంకా నిర్మాణంలో ఉన్న మల్టీస్టారర్ మూవీస్ మరికొన్ని ఉన్నాయి. – ముసిమి శివాంజనేయులు


