ఇరాన్‌ పికాక్స్‌.. ట్రంప్‌కు ఎందుకంత పట్టుదల? | Pickaxe Mountain Next Trump Issues Fresh Warning to Iran | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ పికాక్స్‌.. ట్రంప్‌కు ఎందుకంత పట్టుదల?

Sep 5 2026 7:19 AM | Updated on Sep 5 2026 7:22 AM

Pickaxe Mountain Next Trump Issues Fresh Warning to Iran

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి సంచలన ప్రకటన చేశారు. ప్రపంచంలోనే అత్యంత పటిష్ఠమైన భూగర్భ అణు కేంద్రంగా భావిస్తున్న ‘పికాక్స్‌ మౌంటెన్‌’పై తమ నిఘా కొనసాగుతోందని.. త్వరలోనే దానిపై దాడి చేసే అవకాశం ఉందని ప్రకటించారు. తద్వారా ఇరాన్‌ను మరో తీవ్ర హెచ్చరిక జారీ చేశారాయన.  ఓవల్‌ ఆఫీసులో శుక్రవారం విలేకరులతో మాట్లాడిన ట్రంప్‌.. అక్కడ అణు కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే ఎంతకైనా వెనుకాడబోమని స్పష్టం చేశారాయన.

ఇరాన్‌ అణ్వాయుధాన్ని తయారు చేసుకోకుండా అడ్డుకోవడమే అమెరికా సైనిక చర్యల ప్రధాన లక్ష్యం. మేం ఐదు నెలలుగా చర్యలు తీసుకుంటున్నాం. ఈ సమయంలో ఇరాన్‌కు అణ్వాయుధం లేకుండా చేశాం. ఒకవేళ ఆ దేశం అణ్వాయుధాన్ని పొందితే పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా మారతాయి. అందుకే మా నిరంతర నిఘా కొనసాగుతుంది అని అన్నారాయన. 

పికాక్స్‌ మౌంటెన్‌పై నిఘా
నటాంజ్‌ యురేనియం శుద్ధి కేంద్రానికి సమీపంలో ఉన్న పికాక్స్‌ మౌంటెన్‌ అత్యంత లోతైన భూగర్భ నిర్మాణాలతో కూడిన ప్రాంతంగా భావిస్తున్నారు. అక్కడ రెండు లోతైన సొరంగ వ్యవస్థలు ఉన్నట్లు సమాచారం. ఇజ్రాయెల్‌ నిఘా వర్గాల అంచనా ప్రకారం.. ఇరాన్‌ వేలాది సెంట్రిఫ్యూజ్‌లను ఈ భూగర్భ కేంద్రానికి తరలించినట్లు గతంలో వార్తలు వచ్చాయి.

‘‘పికాక్స్‌లో ఏదైనా కార్యకలాపం జరుగుతున్నట్లు గుర్తిస్తే చాలా త్వరలోనే దాడి చేయవచ్చు. అక్కడి ప్రతీ కదలిక మాకు తెలుసు. ఇరాన్‌ అంతటా జరుగుతున్న కదలికలపై నిఘా ఉంది. ఏదైనా తప్పు జరిగితే తీవ్రంగా దాడి చేస్తాం’’ అని ట్రంప్‌ హెచ్చరించారు.

భూగర్భంలో అత్యంత లోతుగా నిర్మించిన ఈ కేంద్రం.. సాధారణ వైమానిక దాడులను తట్టుకునే సామర్థ్యం కలిగి ఉందన్న అంచనాలు ఉన్నాయి. అయితే అమెరికా ఇక్కడ దాడి చేస్తే ఇరాన్‌ అణు మౌలిక వసతులపై యుద్ధం మరింత తీవ్రతరం అయ్యే అవకాశముంది.

ట్రంప్‌ ఇలా అనడం ఇదే తొలిసారి కాదు. జులైలోనే పికాక్స్‌ మౌంటెన్‌ను అమెరికా టార్గెట్‌ చేసే అవకాశం ఉందని ఆయన బహిరంగంగా హెచ్చరించారు. అప్పట్లో ‘‘త్వరలోనే, భారీగా దాడి చేస్తాం’’ అంటూ వ్యాఖ్యానించారు. తాజాగా మరోసారి ఇదే స్థావరాన్ని ప్రస్తావించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరాన్‌ అణు కార్యకలాపాలకు పికాక్స్‌ భవిష్యత్తులో కీలక కేంద్రంగా మారే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలోనే ట్రంప్‌ దృష్టి దీనిపైనే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

ఎక్కడ ఉంది.. ఎందుకు కీలకం? 
ఇరాన్‌లోని జాగ్రోస్‌ పర్వత శ్రేణిలో ఉన్న పికాక్స్‌ మౌంటెన్‌.. దేశంలోని ప్రధాన యురేనియం శుద్ధి కేంద్రం నతాంజ్‌కు కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. పర్వతం లోపల వందల మీటర్ల లోతులో రెండు భారీ భూగర్భ టన్నెల్‌ సముదాయాలను నిర్మిస్తున్నారు. అత్యంత పటిష్ఠమైన ఈ నిర్మాణం వల్ల సాధారణ బంకర్‌-బస్టర్‌ బాంబులతోనూ దీనిని పూర్తిగా ధ్వంసం చేయడం కష్టమని నిపుణులు చెబుతున్నారు. ఇరాన్‌ తన అణు పరికరాలు, సెంట్రిఫ్యూజ్‌లు లేదా యురేనియం నిల్వలను ఇక్కడ భద్రపరిచే అవకాశం ఉండటంతో.. భవిష్యత్తులో అణు కార్యక్రమాలను తిరిగి కొనసాగించేందుకు ఇది కీలక స్థావరంగా మారొచ్చన్నదే అమెరికా ఆందోళన.

ఇజ్రాయెల్‌కు అండగా..
అమెరికా జోక్యం చేసుకోకపోతే ఇజ్రాయెల్‌, మొత్తం మిడిల్‌ఈస్ట్‌ మరింత తీవ్రమైన ముప్పును ఎదుర్కొనేవని ట్రంప్‌ పేర్కొన్నారు. ఇరాన్‌ అణ్వాయుధాన్ని అభివృద్ధి చేసుకునే పరిస్థితిని తాము అడ్డుకున్నామని చెప్పారు. ఇరాన్‌ నుంచి యూరప్‌, అమెరికా నగరాలపైనా భవిష్యత్తులో ముప్పు ఏర్పడే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉండగా.. అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ (CENTCOM) ఇటీవల ఇరాన్‌కు చెందిన పలు సైనిక స్థావరాలపై దాడులు చేసినట్లు ప్రకటించింది. ఇరాన్‌ ఇస్లామిక్‌ రెవల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (IRGC)కు చెందిన వైమానిక రక్షణ వ్యవస్థలు, రాడార్లు, సముద్ర కార్యకలాపాలకు సంబంధించిన ప్రాంతాలు, మైన్లు అమర్చే సామర్థ్యాలు, కమ్యూనికేషన్‌ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది.

రాడార్లను రెండుసార్లు ధ్వంసం చేశాం
ఇరాన్‌ రాడార్‌ వ్యవస్థలపై అమెరికా దాడులను కూడా ట్రంప్‌ ప్రస్తావించారు. అత్యాధునిక రాడార్‌ వ్యవస్థలను ఇరాన్‌ రెండుసార్లు ఏర్పాటు చేసినా.. వాటిని అమెరికా ధ్వంసం చేసిందన్నారు. ‘‘రాడార్‌ను మళ్లీ ఏర్పాటు చేసి మళ్లీ దాడికి గురికావడం వారికి విసుగొచ్చిందని అనుకుంటున్నా’’ అని వ్యాఖ్యానించారు.

అమెరికా తాజా దాడులను ఇరాన్‌ తీవ్రంగా ఖండించింది. తమ సార్వభౌమత్వాన్ని అమెరికా ఉల్లంఘించిందని ఆరోపించింది. పలు ప్రావిన్సుల్లో సైనికేతర మౌలిక వసతులు, పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నారని విమర్శించింది. అమెరికా దాడులకు ప్రతిగా పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలపై ‘తీవ్రమైన ప్రతిదాడులు’ చేపట్టినట్లు ఇరాన్‌ విదేశాంగ శాఖ ప్రకటించింది.

ఇదీ చదవండి: అబ్బే.. అదసలు విషయమే కాదు: ట్రంప్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement