గాల్లో ఉండగానే ‘హైడ్రాలిక్‌’ విఫలం  | Air India Phuket-Delhi flight lost hydraulic systems | Sakshi
Sakshi News home page

గాల్లో ఉండగానే ‘హైడ్రాలిక్‌’ విఫలం 

Sep 5 2026 5:21 AM | Updated on Sep 5 2026 5:21 AM

Air India Phuket-Delhi flight lost hydraulic systems

ఎయిరిండియా విమానంలో భారీ కుదుపులపై ఏఏఐబీ 

న్యూఢిల్లీ: థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌ నుంచి ఢిల్లీకి వస్తూ గాల్లో భారీ కుదుపులకు లోనైన ఎయిరిండియా విమానంలో ఉన్న మూడు హైడ్రాలిక్‌ వ్యవస్థలు విఫలమైనట్లు ఎయిర్‌క్రాఫ్ట్‌ ఆక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బోర్డ్‌ (ఏఏఐబీ) ప్రకటించింది. సుమారు 145 మందితో 36,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తూండగా ఈ ఎయిర్‌బస్‌ విమానంలోని హైడ్రాలిక్‌ వ్యవస్థలు విఫలమయ్యాయని, దీంతో ఆటోపైలట్‌తో అనుసంధానం లేకుండా పోవడమే కాకుండా.. అకస్మాత్తుగా విమానం కిందకు జారిపోవడం మొదలైన విషయం తెలిసిందే. 

ఆగస్టు నాలుగవ తేదీన జరిగిన ఈ ఘటనలో దాదాపు 24 మంది గాయపడ్డారు. ఆ తరువాత విమానం ఢిల్లీలో సురక్షితంగానే ల్యాండైనా మాదకద్రవ్య పరీక్షల్లో పైలట్‌ విఫలమయ్యాడు. దీంతో ఏఏఐబీ పైలట్‌పై చర్యకు సిఫారసు చేస్తూ ఏఏఐబీ ప్రాథమిక నివేదికను సిద్ధం చేసింది. అయితే పైలట్‌ మత్తుమందులు తీసుకోవడానికి, హైడ్రాలిక్‌ వ్యవస్థలు విఫలమయ్యేందుకు సంబంధం ఉన్నదీ లేనిది మాత్రం ఈ నివేదిక స్పష్టం చేయలేదు. విచారణ కొనసాగుతోందని మాత్రం తెలిపింది. ఘటన జరిగిన సమయంలో వాతావరణ పరిస్థితులు అంత ప్రతికూలంగా ఏమీ లేకపోవడంతో ఏఏఐబీ అధికారులు హైడ్రాలిక్‌ వ్యవస్థలు, ఇతర కారణాలపై దృష్టి పెట్టారు. 

సుమారు పది పేజీలున్న ప్రాథమిక నివేదిక ప్రకారం ఘటన జరిగిన సమయంలో విమానానికి సంబంధించిన పచ్చ, నీలి, పసుపు హైడ్రాలిక్‌ వ్యవస్థలు ఒకేసారి విఫలమయ్యాయి. ఆ తరువాత కొన్ని సెకన్లలోనే పనిచేయడం మొదలైనప్పటికీ తాత్కాలిక వైఫల్యం కారణంగా విమానం కేబిన్‌ లోపల భారీ నష్టం జరిగింది. సీలింగ్‌ ప్యానెళ్లలో పగుళ్లు ఏర్పడ్డాయి, సీట్లపైనున్న బిన్స్‌ చెల్లాచెదురయ్యాయి. అలాగే కురీ్చ ల హ్యాండ్‌ రెయిల్స్‌ ధ్వంసమయ్యాయి. కోపైలట్‌పై జరిపిన పరీక్షల్లో నెగటివ్‌ వచ్చిందని ఈ నివేదిక తెలిపింది. పైలట్‌ విషయంలో పరీక్షలు పాజిటివ్‌గా తేలినందున డీజీసీఏ తగిన చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది.  

పైలట్‌కు ఉద్వాసన 
ఫుకెట్‌ నుంచి ఢిల్లీకి వస్తున్న విమానం భారీ కుదుపులకు గురై 24 మంది గాయపడిన ఘటనలో ప్రధాన పైలట్‌కు ఎయిర్‌ ఇండియా శుక్రవారం ఉద్వాసన పలికింది. ప్రమాద ఘటన తరువాత న్యూఢిల్లీలో పైలట్‌పై జరిపిన మాదకద్రవ్యాల పరీక్షలు పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. భద్రత, ఫిట్‌నెస్, రెగ్యులేటరీ అంశాలకు సంబంధించిన ఎలాంటి ఉల్లంఘనలను సహించేది లేదని, అందువల్లనే పైలట్‌ను తక్షణం ఉద్యోగం నుంచి తొలగించామని ఎయిర్‌ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement