ప్రమాదంలో సిక్కిం  | 16 glacial lakes that have been placed in the highest-risk category in Sikkim | Sakshi
Sakshi News home page

ప్రమాదంలో సిక్కిం 

Sep 5 2026 5:17 AM | Updated on Sep 5 2026 5:17 AM

16 glacial lakes that have been placed in the highest-risk category in  Sikkim

హిమనదీ సరస్సులు 

నలభై సరస్సుల గుర్తింపు 

పదహారింటి పరిస్థితి ఆందోళనకరం 

నష్ట నివారణ చర్యలకు ప్రణాళికలు

నేపాల్‌ను ముంచేసిన మెరుపు వరదలు ఈశాన్య భారత రాష్ట్రం సిక్కింకు మేలుకొలుపుగా మారింది. హిమాలయ పర్వత శిఖరాలపై ఉన్న హిమనీనదం (గ్లేషియర్‌) అకస్మాత్తుగా కుప్పకూలి 1200 అడుగుల దిగువకు జారిపడటంతో నేపాల్‌లోని త్రిశూలీ నదికి ఆకస్మిక వరద వచ్చిన విషయం తెలిసిందే. సిక్కింలోనూ హిమనీనదాల కారణంగా ఏర్పడ్డ సరస్సులు చాలా ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 

నేపాల్‌ తరహా పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండేందుక చర్యలు చేపట్టడం మొదలు పెట్టారు. రాష్ట్రంలోని కనీసం నలభై హిమనదీ సరస్సులు (గ్లేషియల్‌ లేక్స్‌)ల పరిస్థితి ఏమంత బాగాలేదని, 16 సరస్సులు నేపాల్‌లో మాదిరిగా కుప్పకూలిపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఉపగ్రహల ద్వారా వీటిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండేందుకు, ముందస్తు హెచ్చరికలు జారీ చేసేందుకు ఇప్పుడు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

ఆగస్టు 26న నేపాల్‌–టిబెట్‌ సరిహద్దుల్లో హిమనీనదం కుప్పకూలడంతో వచ్చిన మెరుపు వరదల్లో 1,200 మంది కంటే ఎక్కువమంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఇది హిమనదీ సరస్సు కారణంగా ఏర్పడ్డది కాదు. కాకపోతే హిమాలయ పర్వతశ్రేణి మొత్తమ్మీద ఇలాంటి ప్రమాదాలు జరిగేందుకు అవకాశముందని ప్రపంచానికి తెలియజేసింది. 

భూతాపోన్నతి కారణంగా హిమనీనదాలు కుంచించుకుపోతున్నాయన్న ఆందోళన చాలాకాలంగా వ్యక్తమవుతోంది. ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం వల్ల వీటి విస్తీర్ణం తగ్గిపోతూండటం, రాత్రి ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కారణంగా కరిగినంత స్థాయిలో నీరు మళ్లీ మంచుగా మారకపోవడాన్ని ఇప్పటికే శాస్త్రవేత్తలు గుర్తించారు. అలాగే.. హిమనీ నదాలు కుంచించుకుపోయినప్పుడు కొత్త కొత్త సరస్సులు ఏర్పడేందుకు, లేదా ఉన్న సరస్సుల్లో మరింత నీరు చేరేందుకూ అవకాశం ఉంటుంది. 

హిమనీనదాల పరిసరాల్లో లోతట్టుప్రాంతాల్లో ఇలా జరుగుతూంటుంది. దీనివల్ల ప్రమాదం ఏమిటంటే.. దిగువన ఉన్న మట్టి, రాళ్లు వదులుగా ఉంటే ఆ సరస్సు ఎప్పుడైనా ఆకస్మికంగా బద్ధలయ్యే అవకాశం ఉండటం. అంతేకాదు.. చిన్నపాటి భూకంపం కారణంగా ఈ సరస్సుల అడుగున కదలికలు వచ్చినా అంతే సంగతులు. సరస్సుల్లో అప్పటివరకూ చేరిన భారీ మొత్తం నీరు ఒక్కసారిగా కొండల నుంచి కిందకు జారితే జనావాసాల్లో మృత్యుఘంటికలు మోగడం తథ్యం. 

ముప్పు నీడన లక్షల మంది 
హిమాలయ పర్వత శ్రేణిలోనే ఉన్న సిక్కింలో కనీసం 40 హిమనదీ సరస్సులతో ముప్పు పొంచి ఉండగా.. పదహారింటి విషయంలో దీని తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఈ కారణంగానే వీటిని కేటగిరీ–ఏగా వర్గీకరించారు. ముప్పు కొంచెం తక్కువగా ఉన్న కేటగిరీ–బీ సరస్సులు రెండు ఉంటే, తొమ్మిది కేటగిరీ–సీలో ఉన్నాయి. మిగిలిన 14 హిమనదీ సరస్సులను వర్గీకరించలేదు. ఈ సరస్సుల పరిధిలో సుమారు 16 లక్షల మంది నివాసం ఉంటున్నట్లు అంచనా.

 2023లో మంగన్, గాంగ్‌టక్, పక్యాంగ్, నామ్చీ జిల్లాల్లో 2023లో హిమనదీ సరస్సు బద్దలైన కారణంగా కనీసం అరవై మంది ప్రాణాలు కోల్పోగా, మౌలిక సదుపాయాలకు భారీ నష్టం సంభవించింది. అంతేకాకుండా ఛుంగ్‌థాంగ్‌ డ్యామ్‌ దెబ్బతినడంతో భారీ జలవిద్యుత్తు ప్రా జెక్టు కూడా సమస్యలు ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు రాకుండా ఉండేందుకు ఉపగ్రహాలు, రిమోట్‌ సెన్సింగ్‌ టెక్నాలజీల సాయం తీసుకోనున్నట్లు రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శి సందీప్‌ తాంబే చెబుతున్నారు. దీంతోపాటు ప్రమాదాన్ని అంచనా వేసేందుకు, నివారించేందుకు రాష్ట్ర సైన్స్‌ అండ్‌ టెక్నా లజీ విభాగాన్ని నోడల్‌ కేంద్రంగా మార్చారు.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement