న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో కురిసిన కుండపోత వర్షం నగరాన్ని తీవ్రంగా అస్తవ్యస్తం చేసింది. ఈ భారీ వర్షం కారణంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ప్రధాన రహదారులు, అండర్‌పాస్‌లలోకి వర్షపు నీరు చేరడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి భారీ ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది.
ఈ వర్షం ప్రభావం ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంపై తీవ్రంగా పడింది. ఎయిర్‌పోర్ట్ ప్రాంగణంతో పాటు అరైవల్ గేట్లు, పాసేజ్ ఏరియాల్లోకి మోకాళ్ల లోతు నీరు చేరింది. దీంతో ప్రయాణికులు తమ లగేజీ ట్రాలీలను నీళ్లలోనే తోసుకుంటూ నడవాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రవాహం తగ్గే వరకు ప్రయాణికులు గంటల తరబడి అక్కడే వేచి చూడాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈదురు గాలులతో కూడిన ప్రతికూల వాతావరణం కారణంగా విమానాల రాకపోకలకు తీవ్ర విఘాతం కలిగింది. ఢిల్లీకి రావలసిన పలు విమానాలను ముందస్తు జాగ్రత్తగా జైపూర్, లక్నో, అహ్మదాబాద్ వంటి సమీప నగరాలకు మళ్లించగా, వందలాది సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. రహదారులు, విమానాశ్రయంలో నిలిచిన నీటిని తొలగించేందుకు విమానాశ్రయ సిబ్బంది, మున్సిపల్ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. పంపింగ్ మిషన్ల సహాయంతో నీటిని బయటకు పంపే చర్యలను వేగవంతం చేశారు.


