బుద్గామ్: భారత ఆర్మీ, సీఆర్పీఎఫ్- జమ్మూ కశ్మీర్ పోలీసులు కలిసి సంయుక్తంగా చేసిన ఆపరేషన్‌లో ఉగ్రవాదిని హతమయ్యాడు. బుద్గామ్ జిల్లా పరిధిలోని అష్‌దార్ గాలీలో ఉగ్రవాదులు ఉన్నారనే ఇంటెలిజెన్స్ సమాచారంతో అక్కడ సంయుక్త ఆపరేషన్ చేపట్టి ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టారు. ఈ విషయాన్ని ఇండియన్ ఆర్మీ తన ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది.
కచ్చితమైన సమాదారం ఆధారంగా అష్‌దార్ గాలీలో భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయని ఇండియన్ ఆర్మీ తెలిపింది. అప్రమత్తంగా ఉన్న సైనికులు.. అనుమానాస్పద కార్యకలాపాలను గమనించి నిలదీయడంతో ఉగ్రవాదులు కాల్పులు జరిపారని, ఈ క్రమంలోనే ప్రతి దాడులు చేశామని, ఇరువురి మధ్య భీకర కాల్పులు జరిగాయన్నారు.
ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమవ్వగా, ఒక ఏకే రైఫిల్ మరియు ఇతర యుద్ధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. హతమైన ఉగ్రవాది ఎవరు అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదని స్పష్టం చేసింది.


