గ్రేటర్ నోయిడా: గ్రేటర్ నోయిడాలోని హల్దోని గ్రామంలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్యకు పాల్పడిన కేసులోని ప్రధాన నిందితుడు పోలీసుల ఎదురుకాల్పుల్లో హతమయ్యాడు. క్రైమ్ సీన్ పునర్నిర్మాణం (సీన్ రీ క్రియేషన్) చేపట్టిన సమయంలో ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. సదరు బాలిక శుక్రవారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయింది. ఈ క్రమంలో బాలిక కుటుంబసభ్యులు శుక్రవారం రాత్రి ఎకోటెక్-3 పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఐదు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు శనివారం ఉదయం గ్రామ చెరువు సమీపంలో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. దీంతో గ్రామ ప్రధాన రహదారిపై స్థానికులు నిరసనకు దిగారు.
సీసీటీవీ ఫుటేజ్, ఇతర ఆధారాల ఆధారంగా పోలీసులు 40 ఏళ్ల నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా, నేరానికి ఉపయోగించిన ఆయుధాన్ని డి పార్క్ పోలీస్ అవుట్‌పోస్ట్ సమీపంలోని పొదల్లో దాచినట్లు అతడు తెలిపాడు. పోలీసులు అతడిని అక్కడికి తీసుకెళ్లగా, దాచి ఉంచిన పిస్టల్‌తో పోలీసులపైకి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒక కానిస్టేబుల్ గాయపడగా, ఆత్మరక్షణార్థం పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో నిందితుడికి బుల్లెట్ గాయాలయ్యాయి.
ఇద్దరినీ వెంటనే ఆసుపత్రికి తరలించగా, నిందితుడు చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారని సెంట్రల్ నోయిడా డీసీపీ శైలేంద్ర కుమార్ సింగ్ తెలిపారు. మరో నిందితుడి ఇంట్లో బాలికపై అఘాయిత్యం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్న పోలీసులు, బాలిక బంధువు పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు బాలిక బాబాయ్ ఇంట్లో అద్దెకు ఉంటున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. ఈ ఘటనపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 65 (అత్యాచారం), 103 (హత్య) సహా పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఉజ్బెకిస్థాన్‌లో ప్రధాని మోదీ యోగా సందడి


