‘యాటిట్యూడ్‌ స్టార్‌’ వీరంగం.. ‘నా బూట్లు నీతోనే కడిగిస్తా!’ | Greater Noida woman abuses gaurd | Sakshi
Sakshi News home page

‘యాటిట్యూడ్‌ స్టార్‌’ వీరంగం.. ‘నా బూట్లు నీతోనే కడిగిస్తా!’

Aug 27 2026 1:49 PM | Updated on Aug 27 2026 2:25 PM

Greater Noida woman abuses gaurd

ఢిల్లీ: ‘నా బూట్లు నీతోనే కడిగిస్తా.. నువ్వు ఎంతటివాడివైనా సరే’ అంటూ గ్రేటర్ నోయిడాలోని ఓ హై-ప్రొఫైల్ సొసైటీలో సెక్యూరిటీ గార్డులను ఉద్దేశించి ఓ మహిళ బెదిరింపులకు దిగింది. డెలివరీ బాయ్‌ని గేట్ వద్దే ఆపారన్న చిన్న కారణంతో ఆ మహిళ కోపంతో ఊగిపోయింది. 

విధి నిర్వహణలో ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని పరుష పదజాలంతో దూషిస్తూ ఆమె సృష్టించిన వీరంగం తాలూకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డబ్బుందనే అహంకారంతో సామాన్య సిబ్బందిపై ప్రదర్శిస్తున్న ఈ దౌర్జన్యానికి నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.

గ్రేటర్ నోయిడా వెస్ట్‌లోని బిస్రాక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ‘సెంచూరియన్ పార్క్ టెర్రస్ హోమ్స్’ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సదరు మహిళ ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ బుక్ చేసుకుంది. అయితే భద్రతా దృష్ట్యా నిబంధనల ప్రకారం విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బంది డెలివరీ బాయ్‌ను గేట్ వెలుపలే ఆపారు.

కొద్దిసేపటి తర్వాత ఆర్డర్ రాకపోవడంతో మహిళ గేటు వద్దకు వచ్చి పరిశీలించింది. డెలివరీ బాయ్‌ని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నట్లు గమనించి వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అది కాస్తా తీవ్ర వివాదంగా మారింది. వైరల్ అవుతున్న వీడియోలో ఆ మహిళ సెక్యూరిటీ సిబ్బందిని తీవ్రంగా దూషించడమే కాకుండా పోలీసులకు ఫోన్ చేస్తారా? చేసుకోండి అంటూ దురుసుగా వ్యవహరించింది.

బెదిరింపులు.. దాడి యత్నం
ఒకానొక సమయంలో కుర్చీలో కూర్చున్న సెక్యూరిటీ గార్డుపై దాడి చేసేందుకు యత్నించగా, మరో సిబ్బందిని వెనక్కి తోసేసింది. నాతో పోలిస్తే నీ స్థాయేంటో తెలుసా? నీతో నా షూస్‌ను క్లీన్ చేయించుకుంటా అంటూ బెదిరింపులకు దిగింది. గార్డుల ఆర్థిక పరిస్థితిని కించపరిచేలా ఆమె మాట్లాడిన మాటలు వీడియోలో స్పష్టంగా రికార్డయ్యాయి.

డెలివరీ బాయ్‌ని ఎందుకు ఆపారనే కచ్చితమైన కారణం, ఈ ఘర్షణకు దారితీసిన ఇతర పరిస్థితులపై అధికారులు విచారణ జరుపుతున్నారు. సెక్యూరిటీ సిబ్బంది పట్ల సదరు మహిళ ప్రవర్తించిన తీరుపై సోషల్ మీడియా వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement