ఆగస్టు 26... మహిళా సమానత్వ దినోత్సవం. ఓటు హక్కు కోసం మొదలైన పోరాటం నేడు అంతరిక్షం వరకు సాగింది. కానీ ప్రశ్న మిగిలే ఉంది.నిజంగానే ఆమెకు సమాన గుర్తింపు, భద్రత, స్వేచ్ఛ దక్కాయా? జవాబు... ఇంకా లేదు. ఒకవైపు ఆమె ముందుకు దూసుకెళుతోంది. మరోవైపు సామాజిక ఆంక్షలు, గృహహింస, వివక్ష ఆమె రెక్కలను కత్తిరిస్తూనే ఉన్నాయి.
సమానత్వం అంటే ‘పురుషులతో పోటీ కాదు’... ‘పురుషులతో సమానంగా బతికే హక్కు’. ఆఫీస్‌లో సమాన అవకాశం, ఇంట్లో సమాన గౌరవం దక్కినప్పుడే ‘విమెన్స్ ఈక్వాలిటీ డే’కు అర్థం. ఆమెను కేవలం బాధ్యతగల గృహిణిగా, సమర్థురాలైన ఉద్యోగిగా మాత్రమే కాదు.. ఒక మనిషిగా, నిర్ణయాలు తీసుకునే వ్యక్తిత్వంగా గౌరవించినప్పుడే అది సిసలైన సమానత్వం. అందుకై మార్పు అనివార్యం.
మహిళల ఆర్థిక స్వాతంత్య్రానికి, సాధికారతకు, సమానత్వానికి.. ఉద్యోగం అనేది అత్యంత కీలకం. ఎంతోమంది ప్రతిభావంతులైన మహిళలు,ఎన్నో అద్భుతాలు చేస్తారని ఆశలు పెట్టుకున్న వాళ్లు, ఒకే ఒక మాటతో ఉసూరుమనిపిస్తారు. ‘ఉద్యోగం చేస్తూ పిల్లలను చూసుకోవడం, ఇంటిపనులు చేసుకోవడం కష్టంగా ఉంది. అందుకే ఉద్యోగం మానేశాను’ గ్లోబల్ ఆన్‌లైన్ ఎంప్లాయిమెంట్ వెబ్‌సైట్ అండ్ సెర్చ్ ఇంజిన్ ఇండీడ్ నిర్వహించిన సర్వే ప్రకారం.. భారతదేశంలో ప్రతి పదిమంది మహిళల్లో ఎనిమిది మందికి పైగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడం లేదు. ఇంటి సంరక్షణ బాధ్యతలతో పాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడం కష్టం అని భావించడం వల్ల చాలామంది మహిళలు ఉద్యోగాలకు దరఖాస్తు చేయడం లేదు....
మహిళలు తమ కెరీర్‌ను ఎంచుకునే విధానాన్ని కుటుంబ బా«ధ్యతలు ప్రభావితం చేస్తున్నాయని, కెరీర్‌ను ఎంచుకోవడంలో సౌలభ్యం అనేది కీలక విషయంగా మారిందని చెబుతోంది ఇండీడ్ సర్వే. మరి కొన్ని విషయాలు...
⇒ ఉద్యోగాన్ని ఎంచుకునేటప్పుడు సౌకర్యవంతమైన పనిగంటలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
⇒ 48 శాతం మంది హైబ్రిడ్ లేదా రిమోట్ ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
⇒ కుటుంబ జీవితం–వృత్తి జీవితాన్ని సమన్వయం చేసుకోవడం కోసం పది మందిలో ఎనిమిది మంది తక్కువ జీతానికైనా సరే ఉద్యోగాల్లో చేరుతున్నారు.
⇒ ఆఫీసుకు హాజరు కావాల్సిన నిబంధనల కారణంగా 51 శాతం మంది ఉద్యోగ ఇంటర్వ్యూలకు హాజరు కావడం లేదు.
⇒ పూర్తి సమయం ఆఫీసులో ఉండాలనే నిబంధనను 37 శాతం మంది ప్రతికూల అంశంగా భావిస్తున్నారు. ఉద్యోగ విధులలో సౌలభ్యం లేకపోవడాన్ని 34 శాతం మంది ప్రతికూల అంశంగా భావిస్తున్నారు. ఉద్యోగం చేసే తల్లులు హైబ్రిడ్, రిమోట్ వర్క్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఈ సర్వే ఫలితాలు చెబుతున్నాయి.
‘ఉద్యోగాలకు సంబంధించి మహిళలకు కలలు ఉన్నప్పటికీ, గృహ సంరక్షణ బాధ్యతలకే చాలామంది మహిళలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు’ అంటున్నారు ఇండీడ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శశి కుమార్.
ఉద్యోగం డబ్బుల కోసం మాత్రమే కాదు...
‘ఉద్యోగం అనేది కేవలం డబ్బు సం పాదించే మార్గం మాత్రమే కాదు. ఆర్థికంగానే కాదు మాససికంగా కూడా ఉపయోగపడుతుంది. వృత్తి జీవితమే వ్యక్తిగత జీవితంలో సంతృప్తిని, స్ఫూర్తిని ఇస్తుంది. పని– వ్యక్తిగత జీవితం మధ్య సమన్వయం సాధించాలి. దీని వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఉద్యోగ జీవితానికి ప్రాధాన్యత ఇస్తూనే వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదించాలి’ అంటున్నారు లైఫ్‌స్టైల్ అండ్ ఫర్నీచర్ బ్రాండ్ ‘బెంట్‌చైర్’ సీఈవో, కో–ఫౌండర్ నటషా జైన్.
ఆ లక్ష్యాలనే ఎంచుకుంటాను
‘వ్యా పారవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా మహిళలు రాణిస్తున్న ఈరోజుల్లో ఎంతోమంది మహిళలు తమ వృత్తి, వ్యక్తిగత జీవితాలను చక్కగా సమన్వయం చేసుకుంటున్నారు. నా విషయానికి వస్తే...అసాధారణమైన లక్ష్యాలను ఏర్పాటు చేసుకోకపోవడమే పని–జీవిత సమతుల్యతకు ఒక మార్గం. నా మానసిక ప్రశాంతతకు భంగం కలగకుండా సాధించగలిగే లక్ష్యాలనే నా వృత్తి లేదా వ్యక్తిగత జీవితంలో ఎంచుకుంటాను. నేను ఉత్తమ తల్లి లేదా ఉత్తమ ఉద్యోగి అని నిరూపించుకోవడానికి నన్ను నేను అతిగా ఒత్తిడికి గురిచేసుకోను’ అంటుంది దీక్ష చాబ్ర ఫిట్‌నెస్ కన్సల్టేషన్ ఫౌండర్ దీక్ష చాబ్ర.
లక్ష్యాల దిశగా...
‘ఇంట్లో బిడ్డను చూసుకోవాల్సిన బా«ధ్యతల వల్ల మొదట్లో నా వ్యా పారప్రయాణం భారంగా అనిపించింది. పని–జీవిత సమతుల్యతను కా పాడుకోవడానికి ప్రతి ఒక్కరికీ మార్గం ఉంటుంది. లక్ష్యాల దిశగా ప్రణాళిక వేసుకోవడానికి, విశ్లేషించుకోవడానికి రోజులో కొంత సమయాన్ని నా కోసం కేటాయించుకుంటాను’ అంటున్నారు గిఫ్టింగ్ కంపెనీ జిఫ్టర్ కో–ఫౌండర్ పూజా పుంజ్.
పనిని ఆస్వాదించండి
‘మొదటగా మీ ప్రాధాన్యతలపై దృష్టి పెట్టండి. చేసే పనిని ఆస్వాదించండి. వర్క్–లైఫ్ బ్యాలెన్స్‌పై కృషి చేయండి. వర్క్–లైఫ్ బ్యాలెన్స్‌కు ఒక మార్గం కనుగొన్న తరువాత ఉద్యోగ జీవితంలో లభించే సంతృప్తి, ఆనందం సాటిలేనివి. కెరీర్‌లో మీరు ఎదిగే కొద్ది పని–వ్యక్తిగత జీవిత సమతుల్యత గురించి మార్గాలు మరిన్ని కనబడతాయని గుర్తుంచుకోవాలి. ఒక్కమాటలో చె΄్పాలంటే సమతుల్యత అనేది ఎక్కడో ఉండదు. అది మనం సృష్టించుకోవాలి’ అంటున్నారు ప్రమేయ హెల్త్ ఫౌండర్ డాక్టర్ సంధ్యా రవి.
నిరాసక్తత ఎందుకంటే..?
ఉద్యోగాల కొరత, పని ప్రదేశంలో కార్మిక చట్టాలు వర్తించకపోవడం, సరైన మౌలిక సౌకర్యాలు లేకపోవడం వంటి కారణాల వల్లే మహిళలు ఉద్యోగాలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదని సెంటర్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ ప్రోగ్రెస్ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ఇందుకు అనేక రకాల కారణాలు ఉన్నాయి. భారతీయ మహిళలు మిగిలిన వారి కంటే భిన్నంగా ఉండడం, కుటుంబ వ్యవస్థకు ప్రాధాన్యం ఇవ్వడం, ఆత్మ విశ్వాసం తక్కువగా ఉండడం కుటుంబ నేపధ్యం ఇందుకు ప్రధాన కారణాలు.
n భారతదేశంలో పని చేసే వయసు ఉండి ఉద్యోగం చేస్తున్న మహిళల శాతం కేవలం 35 మాత్రమే.
భారత్ కూడా ఉన్నత ఆదాయ దేశాల స్థాయికి చేరాలంటే మరో 9 కోట్ల మంది మహిళలను శ్రామిక శక్తిలోకి తీసుకురావాల్సి ఉంటుంది. దీనివల్ల భారత ఆర్థిక వ్యవస్థకు సుమారుగా రూ. 116 లక్షల కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని అంచనా. వస్త్ర పరిశ్రమ ద్వారా బంగ్లాదేశ్ మహిళలకు భారీగా ఉ పాధి కల్పించింది. భారత్ కూడా అదే స్థాయిలో శ్రామిక ఆధారిత రంగాలను ప్రోత్సహిస్తే, మూడు రెట్లు వేగంగా మహిళా ఉ పాధి పెరుగుతుందని గణాంకాలు చెబుతున్నాయి.
ఇంకా అక్కడే..
మహిళా సాధికారతను కొన్నేళ్లుగా విద్య, ఉద్యోగం, బ్యాంకు ఖాతాలు, మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ సదు పాయాల ఆధారంగానే కొలుస్తూ వస్తున్నారు. ఈ ప్రాథమిక ప్రమాణాలన్నింటిలోనూ భారతదేశం గణనీయమైన ప్రగతిని సాధించినప్పటికీ ఎన్‌ఎఫ్‌హెచ్ సర్వే–6 (జాతీయ, కుటుంబ, ఆరోగ్య సర్వే) ఫలితాలు కనిపించని కోణాన్ని మన ముందుకు తెచ్చాయి.
⇒ 22.3 శాతం మంది 18 నుంచి 49 సంవత్సరాల మధ్య వయసున్న వివాహితలు తమ భర్త నుంచి భౌతిక, లైంగిక వేధింపులకు గురవుతున్నారు. గతంలో చేసిన ఎన్‌ఎఫ్‌హెచ్ –5 (2019–21) సర్వేలోని 29.2 శాతంతో పోలిస్తే ఈ సంఖ్య కొంత తగ్గినప్పటికీ, ఇప్పటికీ ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరు ఈ తరహా వైవాహిక హింసను ఎదుర్కొంటున్నారనేది ఆందోళన కలిగించే అంశం.
⇒ కేరళలో 87 శాతం మంది బాలికలు పదో తరగతి కంటే ఎక్కువ చదువుకున్నారని ఎన్‌ఎఫ్‌హెచ్–6 చెబుతోంది. అయినప్పటికీ, భర్త చేతిలో వేధింపులకు గురవుతున్న వివాహితల శాతం 9.8 నుంచి ఏకంగా 17.7 శాతానికి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. విద్య, వికాసాలు ఉన్నచోట కూడా గృహహింస తీవ్ర రూపంలోనే ఉందనడానికి ఈ గణాంకాలు నిదర్శనం.
⇒ మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ముందే వారి జీవితాలను దెబ్బతీస్తున్న మరో ప్రధాన సమస్య బాల్య వివాహాలు. ఆంధ్రప్రదేశ్ (25%), జార్ఖండ్ (28.1%), బీహార్ (34.6%), పశ్చిమ బెంగాల్ (36.4%) లతో బాల్య వివాహాలు ఇప్పటికీ పెద్ద సమస్యగా ఉన్నాయి. చిన్న వయసులోనే వివాహాలు కావడం వల్ల మహిళలు మానసిక, ఆర్థిక, సామాజిక సాధికారతను సాధించలేకపోతున్నారు. విద్య, ఉద్యోగ అవకాశాలు, ముఖ్య విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకబడిపోతున్నారు.
వర్క్–లైఫ్ బాలెన్స్ కోసం...
వర్క్–లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవడంలో భాగంగా ప్రతి ఉదయం మెంటల్ నోట్ క్రియేట్ చేసుకుంటాను. మెంటల్ నోట్ ద్వారా ఆరోజు నేను పూర్తి చేయాల్సిన ముఖ్యమైన పనులను దృష్టిలో పెట్టుకుంటాను. నా పని ముగించేలోపు వాటిని పూర్తి చేయడంపై దృష్టి పెడతాను. మీరు తీరికలేని జీవితాన్ని గడిపే ఉద్యోగి అయితే మీ కోరికల జాబితాలోని ప్రతిదాన్ని సాధించడం కష్టం. దీని వల్ల మనం పూర్తిగా అలసిపోతాం. వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించలేకపోతాం. వృత్తి–కుటుంబ జీవితాన్ని సమన్వయం చేసుకోవడానికి మన ఆరోగ్యం, లైఫ్‌స్టైల్‌పై దృష్టి పెట్టాలి. ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా మనం చాలా ఒత్తిడితో కూడిన జీవితాన్ని గడుపుతాం. అది అనారోగ్యానికి, డిప్రెషన్‌కు దారి తీయవచ్చు. పని నుండి పూర్తిగా విరామం తీసుకోవడానికి ప్రతి మూడు నెలలకు ఒకసారి రెండు, మూడు రోజులు సెలవు తీసుకుంటాను.
– రాశీ జైన్, ఆన్‌కో.కామ్ సీయివో, కో–ఫాండర్


