హెల్త్
ఆస్బెస్టాస్.. ఒకప్పుడు నిర్మాణ రంగంలో విస్తృతంగా ఉపయోగించిన పదార్థం. అయితే దీని సూక్ష్మ నారకణాలను పీల్చడం ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు ఆస్బెస్టాస్ అంటే ఏమిటి? అది మన శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? తెలుసుకుందాం..
ఆస్బెస్టాస్ అనేది సహజంగా లభించే ఖనిజ సన్నని నారల సమూహం. ఇవి బలంగా ఉండటంతో పాటు వేడిని, మంటను తట్టుకోగలవు. అందుకే గతంలో సిమెంట్ షీట్లు, పైకప్పులు, సీలింగ్ టైల్స్, గోడలు, పైపులు, ఇన్సులేషన్ వంటి నిర్మాణాల్లో వీటిని విస్తృతంగా ఉపయోగించారు.
అయితే భవనాలు, కట్టడాలు నిర్మించే లేదా కూల్చివేసే సమయంలో ఆస్బెస్టాస్ పదార్థాలు పగిలినా, రాపిడికి గురైనా.. వాటిలోని సూక్ష్మ నారకణాలు గాలిలో కలిసే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో మనుషులు వాటిని పీల్చితే అవి ఊపిరితిత్తుల్లోకి చేరి అక్కడే ఉండిపోవచ్చు. దీంతో దీర్ఘకాలంలో ఆస్బెస్టోసిస్, ఊపిరితిత్తుల క్యాన్సర్, మెసోథెలియోమా వంటి తీవ్రమైన వ్యాధుల ముప్పు పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మెసోథెలియోమా అనేది ఆస్బెస్టాస్‌తో ముడిపడి ఉన్న అరుదైన క్యాన్సర్. ముఖ్యంగా ఊపిరితిత్తులను కప్పి ఉండే సన్నని పొరల్లో ఇది ఏర్పడుతుంది. దీని ప్రమాదం ఏమిటంటే.. ఒక వ్యక్తి ఆస్బెస్టాస్‌కు గురైన వెంటనే ఈ వ్యాధి లక్షణాలు బయటపడకపోవచ్చు. అయితే సంవత్సరాలు గడుస్తున్నాకొద్ది ఈ వ్యాధి తీవ్రత పెరిగి, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు వంటి సమస్యలు ఏర్పడవచ్చు. ఆస్బెస్టాస్‌ను గతంలో సిమెంట్ నిర్మాణ సామగ్రి, రూఫింగ్ షీట్లు వంటి వాటిలో విస్తృతంగా ఉపయోగించేవారు. ప్రస్తుతం అనేక దేశాల్లో దీని వినియోగంపై నిషేధాలు, కఠినమైన ఆంక్షలు ఉన్నాయి. అన్ని రకాల ఆస్బెస్టాస్‌లు క్యాన్సర్‌కు కారణమయ్యే పదార్థాలేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరిస్తోంది.
అయితే ఆస్బెస్టాస్ ఖనిజ సూక్ష్మకణాలు ఎక్కువగా పాత పాఠశాలలు, పాడుబడ్డ ఇళ్లు, కార్యాలయాలు, ఫ్యాక్టరీలు వంటి పాత నిర్మాణాల్లో ఉండే అవకాశం ఉంది. ఆస్బెస్టాస్ పదార్థాలు దెబ్బతినకుండా ఉన్నంతవరకు వెంటనే ప్రమాదం ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే పాడుబడ్డ పాత నిర్మాణాల్లోని అనుమానాస్పద పదార్థాలను స్వయంగా పగలగొట్టడం, డ్రిల్ చేయడం లేదా తొలగించడం చేయకూడదు.
ముఖ్యంగా ఆస్బెస్టాస్ ఉందని చూసి గుర్తించడం సాధ్యం కాకపోవచ్చు. అయితే అలాంటి పదార్థాలు కనిపిస్తే వాటిని తాకకుండా సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.


