బోధనా పద్ధతులు మనకు లేవా? | Foreign Education Models Indian Education System | Sakshi
Sakshi News home page

బోధనా పద్ధతులు మనకు లేవా?

Aug 24 2026 2:26 PM | Updated on Aug 24 2026 2:28 PM

Foreign Education Models Indian Education System

ఇతర దేశాల్లో విద్యా విధానాలను అధ్యయనం చేసే లక్ష్యంతో ఫిన్లాండ్, సింగపూర్, జపాన్, జర్మనీ, వియత్నాం లాంటి దేశాలకు అధికారులు, ఉపాధ్యాయులు, అధ్యాపకుల బృందాల పర్యట నలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. 

‘జాయ్‌ అండ్‌ ప్లే’ పద్ధతిలో పూర్వ ప్రాథమిక, బాల్య విద్య, ఉపాధ్యాయుల వృత్తిపరమైన సామ ర్థ్యాలు పెంచడం, విద్యార్థి కేంద్రిత అభ్యసన, ఆనందదాయక బోధన, ఆటల ఆధారిత విద్య వంటి వినూత్న తరగతి గది బోధన పద్ధతులను అధ్యయనం చేసే విధంగా పర్యటనలను రూపొందించారు. అయితే ఉత్తమ బోధనా పద్ధతులు, నమూనాలు భారతదేశంలో లేవా? 80 ఏళ్ల స్వాతంత్రం తర్వాత కూడా ఇంకా విదేశీ నమూనాలను ఆదర్శంగా తీసుకుందామా?

రూసో, ప్లేటో లాంటి వారు విద్య అంటే కేవలం సమాచారాన్ని అందించడం కాదు, వ్యక్తి సర్వతోముఖ అభివృద్ధి అని నిరూపించారు. ఆధునిక ప్రయోగాత్మక విద్యకు పితామహుడైన జాన్‌ డ్యూయీ ‘చేయడం ద్వారా నేర్చుకోవడం’ అనే అనుభవపూర్వక అభ్యాసాన్ని ప్రవేశపెట్టారు. పిల్లల స్వయంప్రతిపత్తిని గౌరవిస్తూ మాంటి స్సోరి బోధనా పద్ధతిని మరియా మాంటిస్సోరి రూపొందించారు. అలాగే భారతీయ తత్వవేత్తల ఆలోచన ప్రాతిపదికన మన సమాజానికి అనువైన విద్యా విధానాన్ని రూపొందించడం జరగాలి.

భారతీయ విద్యా సిద్ధాంతాలు
స్వామి వివేకానంద ‘మనిషిని నిర్మించే విద్య’ సిద్ధాంతంతో విద్య అంటే సమాచారం నింపడం కాదు, మనిషిలో ఇప్పటికే ఉన్న శక్తిని బయటకు తీసుకు రావడం అని బోధించారు. రవీంద్రనాథ్‌ టాగూర్‌ పుస్తకాలకే పరిమితం కాకుండా, కళ, సంగీతం, ప్రకృతి ద్వారా విద్యను ప్రతిపాదించారు. మహాత్మా గాంధీ ‘బేసిక్‌ ఎడ్యు కేషన్‌’ లేదా ‘నయీ తాలీం’ పేరుతో విద్య, పని కలిపి ఉండాలని; చేతివృత్తుల ద్వారా నేర్చు కోవడం, మాతృభాషలో బోధన, స్వావలంబన నేర్పాలని ప్రతిపాదించారు. డా‘‘ సర్వేపల్లి రాధా కృష్ణన్‌ విలువలతో కూడిన విద్య సిద్ధాంతంతో ఆధ్యాత్మికత+ హేతుబద్ధత కలిపిన విద్యను ఆచ రించాలని సూచించారు. ‘భయం లేని విద్య’ ఉండాలని జిడ్డు కృష్ణమూర్తి ఆలోచించారు.

విద్యా విధానమంటే బోధన, పాఠ్యాంశాలు, పరీక్షలే కాదు. ఉత్తమ ఉపాధ్యాయులు తయా రయ్యే విద్యా శిక్షణా కళాశాలలు కూడా అందులో భాగమే. దేశ విద్యా విధానానికి దిక్సూచిగా ఉండే ఎన్‌సీఈఆర్‌టీ, సీబీఎస్‌ఈలో అధ్యాపక, అధ్యాపకేతర పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లోని ఎస్‌సీఈఆర్‌టీలలో కూడా పోస్టులు ఖాళీలే. బీఈడీ, డీఈడీ శిక్షణా కళాశాలల్లో నామమాత్రపు శిక్షణతో ఉపాధ్యాయ శిక్షణలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా భారతీయ సమాజానికి అనుగుణంగా ఆదర్శ అకడమిక్‌ వాతావరణంలో ఉత్తమ బోధనా పద్ధతులు అవలంబిస్తున్న పాఠశాలలు చాలా ఉన్నాయి. ఇటువంటి మంచి అనుభవాలను స్వీకరించి మన సమాజానికి అవసరమైన విద్యావిధానం రూపొందించాలి.

ప్రభుత్వాలు మారినప్పుడల్లా విద్యా విధా నాన్ని మార్చే పద్ధతులు సరికాదు. విద్యా తత్వ వేత్తల ఆలోచనల వెలుగులో ఆదర్శ బోధనా పద్ధ తులను అవలంబిస్తున్న అనుభవాలను స్వీకరించాలి. కొఠారి లాంటి విద్యావేత్తలు సూచించిన కామన్‌ స్కూల్‌ విధానం ఆచరణీయం. విద్యను వ్యాపారంగా మార్చకుండా ప్రభుత్వ వ్యయాన్ని పెంచడంతోనే భావి పునాదులు తరగతి గదుల్లోనే నిర్మాణం అవుతాయి.
– కె. వేణుగోపాల్‌, విద్యారంగ విశ్లేషకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement