నేటి ఉరుకుల పరుగుల జీవనశైలి కారణంగా దంపతుల మధ్య ఆహారపు అలవాట్ల విషయంలో విభేదాలు తలెత్తుతున్నాయి. ఒకరు ఫిట్‌నెస్ డైట్ పాటిస్తుంటే, మరొకరు భోజన ప్రియులుగా ఉంటున్నారు. కొన్ని సందర్భాల్లో ఇద్దరి అభిరుచులు భిన్నంగా ఉండటం వల్ల కొత్తగా ‘ఫుడ్ డివోర్స్’ అనే విధానం తెరపైకి వచ్చింది. సొంతంగా సరుకులు కొనుగోలు చేయడం, తమకు నచ్చిన ఆహారాన్ని తామే వండుకుని తినడమే దీని ముఖ్య ఉద్దేశం.
ఏమిటీ ‘ఫుడ్ డివోర్స్’?
ఒకే ఇంట్లో కలిసి ఉంటూనే దంపతులు తమ అభిరుచులు, అవసరాలకు తగినట్లుగా వేర్వేరుగా ఆహారం తీసుకోవడాన్ని ‘ఫుడ్ డివోర్స్’ అంటారు. వేర్వేరు డైట్ ప్లాన్లు, భిన్నమైన అభిరుచులు, విభిన్న ఆఫీస్ వేళల వల్ల ఈ ధోరణి పెరుగుతోంది. దీనివల్ల దాంపత్య బంధం లేదా వివాహం రద్దయినట్లు కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఆహారం విషయంలో వివాదాలు ఎందుకు?
ఆహారం కేవలం ఆకలిని తీర్చడమే కాకుండా చిన్ననాటి అలవాట్లు, భావోద్వేగాలతో ముడిపడి ఉంటుంది. భాగస్వామి ఆహారపు అలవాట్లు వేరుగా ఉన్నప్పుడు చిన్నపాటి అంశాలు కూడా వాదనలకు దారితీయవచ్చు. ఒకరి అభిరుచులను మరొకరు నియంత్రిస్తున్నారనే భావన కలగడమే దీనికి ప్రధాన కారణం.
వేర్వేరుగా భోజనం చేయడం మంచిదేనా?
ఉద్యోగ సమయాలు, నిర్దిష్టమైన డైట్ అవసరాలు వేరైనప్పుడు విడిగా తినడం సులభమైన మార్గమే కావచ్చు. అయితే, దీనివల్ల దంపతుల మధ్య సంభాషణలు తగ్గిపోయి, కలిసి గడిపే సమయం క్షీణిస్తే సంబంధాలలో భావోద్వేగ దూరం పెరిగే ప్రమాదం ఉంది.
బంధాన్ని ఎలా కాపాడుకోవాలి?
ఆహారం వేరైనా ఉదయం వేళల్లో కలిసి టీ తాగడం, వారాంతాల్లో ఇద్దరూ కలిసి వంట చేయడం లేదా బయటకు వెళ్లి భోజనం చేయడం ద్వారా బంధాన్ని బలోపేతం చేసుకోవచ్చు. డిన్నర్ తర్వాత కలిసి నడవడం, ఒకరి ప్రాధాన్యతలను మరొకరు గౌరవించడం ద్వారా బంధం నిలబడుతుంది.
ఇది కూడా చదవండి: ‘అంతా చూపిస్తూ, కుక్కకు రాఖీనా?’.. కృతిపై ఫ్యాన్స్ ఆగ్రహం


