దక్షిణ భారతదేశంలో ప్రోటీన్ లోటుకు ఆహార సరఫరా కొరత కంటే, దానిపై ఉన్న అవగాహన లోపమే ప్రధాన కారణమని పోషకాహార నిపుణురాలు డా. మానికా సింగ్ అభిప్రాయపడ్డారు. కండరాల పునరుద్ధరణ, కణజాలాల పెరుగుదల, రోగనిరోధక శక్తి నిర్వహణతో పాటు కీలక జీవక్రియలకు ప్రతిరోజూ ప్రోటీన్ అవసరమైనప్పటికీ, చాలామంది ఇది కేవలం జిమ్‌కు వెళ్లేవారికి లేదా సప్లిమెంట్లు తీసుకునేవారికి మాత్రమే పరిమితమని భావిస్తున్నారని ఆమె తెలిపారు. ప్రతి ఒక్కరికీ, ప్రతి వయస్సులోనూ ఇది ప్రాథమిక పోషకమని స్పష్టం చేశారు.
ఐసీఎంఆర్-ఎన్‌ఐఎన్ ఆహార మార్గదర్శకాల ప్రకారం, ఆరోగ్యవంతమైన భారతీయ పెద్దలకు శరీర బరువులో ప్రతి కిలోగ్రాముకు సుమారు 0.83 గ్రాముల ప్రోటీన్ అవసరం. దీని ప్రకారం 60 కిలోల బరువు ఉన్నవారికి దాదాపు 50 గ్రాములు, 70 కిలోల బరువున్నవారికి సుమారు 58 గ్రాముల ప్రోటీన్ అవసరమవుతుంది. ఎదిగే పిల్లలు, గర్భిణులు, బాలింతలు అలాగే కండరాల ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన వృద్ధులకు ఈ అవసరం మరింత ఎక్కువగా ఉంటుంది.
ప్రోటీన్ అందించే ఆహార పదార్థాల లభ్యత పరంగా దక్షిణ భారతదేశం మెరుగైన స్థితిలో ఉందని 2023-24 ప్రభుత్వ గణాంకాలు పేర్కొంటున్నాయి. జాతీయ సగటు 471 గ్రాముల పాల లభ్యతతో పోలిస్తే, ఆంధ్రప్రదేశ్‌లో తలసరి పాల లభ్యత 719 గ్రాములుగా, కర్ణాటకలో 543 గ్రాములుగా నమోదైంది. ఇది లభ్యత లోపం కాదని, ఆహార వినియోగంలో సరైన సమతుల్యత, అవగాహన లేకపోవడాన్నే సూచిస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
పాల ఉత్పత్తుల పోషక విలువలు
పాలు, పెరుగు, పనీర్ వంటి పాల ఉత్పత్తులలో శరీరం స్వయంగా తయారు చేసుకోలేని తొమ్మిది ముఖ్యమైన అమినో ఆమ్లాలు ఉంటాయి. ఇవి సులభంగా జీర్ణమై శరీరానికి సమర్థంగా అందుతాయి. 100 గ్రాముల పనీర్‌లో సుమారు 18-20 గ్రాముల ప్రోటీన్, ఒక గ్లాస్ పాలలో సుమారు 7-8 గ్రాముల ప్రోటీన్ లభిస్తాయి. పెరుగులో 3-4 గ్రాముల ప్రోటీన్‌తో పాటు జీర్ణక్రియకు మేలు చేసే ప్రోబయోటిక్స్ ఉంటాయి.
మధ్యాహ్న భోజనంలో పెరుగు, అల్పాహారంలో పాలు, కూరల్లో పనీర్, చిరుతిండిగా యోగర్ట్ వంటివి దక్షిణ భారత ఆహారంలో భాగమే అయినప్పటికీ, వీటిని అప్పుడప్పుడు కాకుండా రోజంతా సమతుల్యంగా విభజించి క్రమం తప్పకుండా తీసుకోవడం ముఖ్యమని నిపుణులు పేర్కొన్నారు.
బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాల్లో ఆరోగ్యంపై పెరుగుతున్న శ్రద్ధ కారణంగా ఉద్యోగులు, విద్యార్థులు, కుటుంబాలు, వృద్ధుల మధ్య ప్రోటీన్ వినియోగంపై చర్చ పెరుగుతోందని నివేదికలు చెబుతున్నాయి. ప్రతిరోజూ ప్రతి గ్రాము లెక్కించడం కంటే, దైనందిన భోజనంలో ప్రోటీన్ మూలాలను గుర్తించి క్రమం తప్పకుండా చేర్చడమే కీలకమని నిపుణులు సూచిస్తున్నారు.


