డిజిటల్‌ హింసపై దండెత్తాలి..! | Rising Threat of Online Violence Against Women | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ హింసపై దండెత్తాలి..!

Nov 25 2026 12:06 AM | Updated on Nov 25 2026 12:06 AM

Rising Threat of Online Violence Against Women

నేడు స్త్రీ హింస వ్యతిరేక దినోత్సవం

ఒక రూపం కాదు... మహిళలపై జరిగే హింసకు వేనవేల రూపాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది, ఆధునికమైనది... డిజిటల్‌ హింస. స్మార్ట్‌ఫోన్‌లు సాధారణమైన తరువాత డిజిటల్‌ హింసకు సింహద్వారాలు తెరుచుకున్నాయి. ‘నలుగురికీ తెలిస్తే పరువుపోతుంది’ అనే మన భయం డిజిటల్‌ హింసను అంతకంతకూ పెంచుకుంటూ పోతుంది. ‘మహిళలపై జరిగే భౌతిక హింసపై సీరియస్‌గా స్పందించే సమాజం డిజిటల్‌ హింసపై మాత్రం తగిన స్థాయిలో స్పందించడం లేదు’ అంటుంది సామాజిక కార్యకర్త, ఫొటోగ్రాఫర్‌ శబరిత ఎర్నవూర్‌...

తన మొబైల్‌ ఫోన్‌కు ఒక అబ్బాయి నుండి వచ్చిన అసభ్యకరమైన మెసేజ్‌ను చూసి షాక్‌ అయింది శబరిత ఎర్నవూర్‌. అప్పుడు ఆమె వయసు పదిహేను. ఆ జ్ఞాపకం తనను ఇప్పటికీ బాధిస్తూనే ఉంటుంది. శబరిత బాల్యంలోకి వెళితే... మరో పెద్ద షాక్‌. ఒకరి బ్లాక్‌మెయిల్‌ కారణంగా శబరిత తల్లి ఆత్మహత్య చేసుకుంది. ‘ఒక మనిషి మరొక మనిషికి ఎందుకు హాని చేయాలనుకుంటాడో నాకు ఎప్పటికీ అర్థం కాదు’ అంటుంది శబరిత. తన తల్లి జీవించి ఉన్న కాలంతో పోల్చితే టెక్నాలజీ ద్వారా మహిళలను బ్లాక్‌మెయిల్‌ చేయడం, హింస పెట్టడం ఇప్పుడు ఎక్కువైంది.

ఇన్‌ఫెక్టెడ్‌ నెట్‌
పిల్లలు, మహిళలపై పెరుగుతున్న డిజిటల్‌ హింసకు వ్యతిరేకంగా పోరాడాలనే ఆకాంక్షతో ‘ఇన్‌ఫెక్టెడ్‌ నెట్‌’ అనే పేరుతో ఫొటో సిరీస్‌కు శ్రీకారం చుట్టింది శబరిత. ఈ ఫొటో సిరీస్‌ ద్వారా సైబర్‌ హింస బాధితులైన మహిళల మానసిక ప్రపంచాన్ని కళ్లకు కట్టింది.

ఇది సాధారణ విషయమా?!
‘సాధారణంగా మహిళలపై జరిగే హింస గురించి మాట్లాడే సందర్భం లో డిజిటల్‌ హింస గురించి చివర గా మాట్లాడుతుంటారు. స్త్రీలపై జరిగే భౌతిక హింసపై ప్రధాన దృష్టి ఉన్నప్పటికీ, డిజిటల్‌ హింసపై కూడా దృష్టి కేంద్రీకరించాలి. సోషల్‌ మీడియాలో అసభ్యకరమైన సందేశాలు, ద్వేషపూరిత వ్యాఖ్యలు, సరదాగా మొదలై తీవ్రమైన వేధింపులుగా మారే పరిస్థితులు ఆన్‌లైన్‌ ప్రపంచంలో చాలా సాధారణ విషయాలుగా మారాయి. ఇలాంటి వేధింపులు సర్వసాధారణమనే భావన పాతుకుపోవడంతో చాలామంది మహిళలు ఫిర్యాదు చేయట్లేదు’ అంటుంది శబరిత.

ఇలా ఎందుకు చేస్తున్నారు?
రకరకాల కారణాల వల్ల కొందరు మహిళలు తమకు ఎదురవుతున్న డిజిటల్‌ వేధింపులపై మౌనంగా ఉంటున్నారు. ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసినా వారికి తగిన రీతిలో సహాయ సహకారాలు అందడం లేదు.

‘ఎవరైనా మహిళ ఫిర్యాదు చేయడానికి వెళితే, బా«ధిత  మహిళలకు అండగా నిలవడానికి బదులుగా టెన్షన్‌ ఎందుకు ఆ వ్యక్తిని బ్లాక్‌చేస్తే సరిపోతుంది అని ఉచిత సలహా ఇస్తారు. మీరు మీ పేజీలో ఎలాంటి పోస్ట్‌లు పెడు తున్నారో ఏమో... అంటూ బాధితులనే ప్రశ్నిస్తూ మరింత బాధ పెడుతుంటారు. నేరస్థులను పట్టుకోవడానికి బదులుగా బాధితులదే తప్పు అన్నట్లుగా మాట్లాడుతుంటారు’ అంటున్న శబరిత ‘మద్రాస్‌ స్కూల్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌’ పూర్వ విద్యార్థి. సామాజిక కార్యకర్తగా స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తోంది.

బాధితులతో మాట్లాడి...
ఎనిమిది నెలల ప్రాజెక్ట్‌ (ఇన్‌ఫెక్టెడ్‌ నెట్‌)లో భాగంగా ఎంతోమంది బాధిత మహిళలతో మాట్లాడి వారికి వచ్చే అసభ్య మెసేజ్‌లు, ఎదుర్కొన్న సమస్యల గురించి తెలుసుకుంది శబరిత. ‘అపరిచితుల నుంచి, నకిలీ ఐడీల నుంచి వచ్చే మెసేజ్‌లను, వాటి స్క్రీన్‌ షాట్‌లను మహిళలు వెంటనే తొలగిస్తుంటారు. పరువు పోతుందనే భయం, చట్టపరమైన విషయాలపై అవగాహన లేకపోవడం, కుటుంబం నుంచి మద్దతు లేకపోవడం... మొదలైన కారణాల వల్ల చాలామంది వీటిని బయటకు చెప్పరు. తమ వ్యక్తిగత లేదా సన్నిహిత ఫొటోలను బయటపెడతామని ఎవరైనా బెదిరిస్తే, ఆ బెదిరింపుల గురించి ఇతరులతో చెప్పుకోవడానికి వెనకాడుతుంటారు’ అంటుంది శబరిత.

ఇది చాలదు... ఇంకా ఉంది!
డిజిటల్‌ హింస గురించి చెప్పాల్సింది చాలా ఉంది అనే భావనతో తన ప్రాజెక్ట్‌ను దీర్ఘకాలిక ప్రాజెక్ట్‌గా మార్చాలనుకుంటుంది శబరిత. ‘సైబర్‌ హింస అనేది ఒక దేశానికి, ఒక ప్రాంతానికి, ఒక భాషకు పరిమితమైన విషయం కాదు. ఇతర రాష్ట్రాల మహిళలతో కూడా మాట్లాడి వారికి ఎదురైన చేదు అనుభవాలను రికార్డు చేయాలనుకుంటున్నాను.

పిల్లలపై ప్రధానంగా దృష్టి సారించాలనుకుంటున్నాను. హేతుబద్ధంగా ఆలోచించడం, లింగ వివక్ష లేకుండా అందరినీ సమానంగా చూడడం నేర్పించాలి. వారికి  మార్గదర్శకత్వం అందించే దిశగా కృషి చేయాలనుకుంటున్నాను. మహిళలకు సంబంధించిన సమస్యలపై మరిన్ని ఫొటోగ్రఫీ ప్రయోగాలు చేయాలని ఆలోచిస్తున్నాను’ అంటుంది శబరిత.
 

ఆమెకు అండగా..
⇒  మహిళలపై జరిగే డిజిటల్‌ హింస, గృహహింసను ఎదుర్కోవడానికి అవల్కొప్పం (ఆమెతో) అనే కార్యక్రమానికి కేరళ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మహిళలు, బాలికలపై హింస, లింగవివక్ష లేకుండా చేయడమే లక్ష్యంగా మహిళా, శిశు సంక్షేమశాఖ చేపట్టిన ‘ఆరంజ్‌ ది వరల్డ్‌’ ప్రచార కార్యక్రమంలో భాగంగా దీన్ని చేట్టారు. హింస బాధితులు భయం లేకుండా సహాయం పొందేలా చేయడం, నేరస్థులపై చట్టపరమైన చర్యలను బలోపేతం చేయడంపై ‘అవల్కొప్పం’ దృష్టి సారిస్తుంది. మహిళలపై జరిగే హింసకు సంబంధించిన ఫిర్యాదులపై దర్యాప్తు పురోగతిని పర్యవేక్షించడానికి రాష్ట్ర స్థాయి టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ ఏర్పాటు చేశారు.

⇒  ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం (యూఎన్‌ ఉమెన్‌) నివేదిక ప్రకారం యూరప్, మధ్య ఆసియాలలో డిజిటల్‌ సాంకేతికత ద్వారా ఎంతోమంది మహిళలు డిజిటల్‌ హింసను అనుభవిస్తున్నారు. అభ్యంతరకరమైన, అశ్లీలమైన మెసేజ్‌లను అందుకున్నవారు (40శాతం), ఎకౌంట్స్, వెబ్‌పేజెస్‌ హ్యాకింగ్‌ బాధితులు (25శాతం), సోషల్‌ నెట్‌వర్కింగ్‌లో అనుచితమైన లైంగిక వేధింపులు ఎదుర్కొన్నవారు (30 శాతం) ఉన్నారు. ప్రతి ఏడుగురు మహిళల్లో ఒకరు రోజూ లేదా వారానికి ఒకసారి డిజిటల్‌ వేధింపులకు గురువుతున్నారు.

⇒  పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన కేసుల్లో నేరస్థులను పట్టుకోడానికి కేరళ పోలీసులు ‘ట్రేస్‌ ఆన్‌ ఆబ్జెక్ట్‌’ 
‘టేక్‌ ఇట్‌ డౌన్‌’ అనే రెండు టూల్స్‌ను వాడుతున్నారు. ఈ సాంకేతిక సాధానాల ద్వారా ఎన్నో కేసులను ఛేదించారు.

– యాకూబ్‌ పాషా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement