మహిళల వ్యక్తిత్వ హననానికి వేదికగా సామాజిక మాధ్యమాలు
తప్పుడు ప్రచారాలు, రాజకీయ కక్షలకు వేదికగా డిజిటల్ మీడియా
2026 ఏప్రిల్ నాటికి ఏపీలో 1,549 సోషల్ మీడియా కేసులు
ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపిన 1,344 మంది అరెస్టు
సాక్షి, అమరావతి: సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో సామాజిక మాధ్యమాలు ప్రజల జీవితాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాయి. భావాలను వ్యక్తం చేయడానికి, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడానికి, సమస్యలను ప్రజల దృష్టికి తీసుకెళ్లడానికి ఇవి మంచి వేదికలుగా మారాయి. అయితే కొందరు ఈ వేదికలను వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి, మహిళల వ్యక్తిత్వ హననానికి, అసత్య ప్రచారాలకు ఉపయోగించుకుంటున్నారు. ముఖ్యంగా రాజకీయాలకు సంబంధించిన అంశాల్లో మహిళలను లక్ష్యంగా చేసుకుని అసభ్య వ్యాఖ్యలు, మార్ఫింగ్ చిత్రాలు, తప్పుడు కథనాలతో వేధించడం ఆందోళన కలిగిస్తోంది.
పెరుగుతున్న వేధింపులు
మహిళలపై ఆన్‌లైన్ వేధింపులు ఎంతగా పెరుగుతున్నాయో గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జాతీయ నేరగణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) వివరాల ప్రకారం.. దేశంలో మహిళలపై నమోదైన సైబర్ నేరాలు 2017లో 4,242 ఉండగా.. 2022 నాటికి 14,409కి చేరాయి. అంటే ఐదేళ్లలో 239 శాతం పెరుగుదల నమోదైంది. 2023లో దేశవ్యాప్తంగా 19,510 కేసులు నమోదయ్యాయి. 2025లో జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌కు మహిళలకు సంబంధించిన సైబర్ నేరాలపై 76,657 ఫిర్యాదులు అందాయి. వీటిలో అసభ్యకరమైన కంటెంట్, లైంగిక వేధింపులు, ఆన్‌లైన్ వేధింపులు, ఇతర అంశాలు ఉన్నాయి.
ప్రతిపక్షం వారిపైనే చర్యలు
ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలికి చెందిన గీతాంజలి ఉదంతం సోషల్ మీడియా వేధింపుల తీవ్రతకు నిదర్శనం. ప్రభుత్వ పథకం ద్వారా ఇంటిస్థలం పొందిన సందర్భంగా నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ ఆమె మాట్లాడిన వీడియో వైరల్ అయింది. అనంతరం కొందరు ఆమెను లక్ష్యంగా చేసుకుని అసభ్య వ్యాఖ్యలు, వ్యక్తిగత విమర్శలు చేశారు. తీవ్ర మానసిక వేదనకు గురైన ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో అనేకం జరుగుతున్నాయి.
ప్రభుత్వ తప్పులను ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెట్టడం పరిపాటిగా మారింది. 2024 నవంబర్ 6 నుంచి 12 మధ్య ఏపీలో ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలకు 680 నోటీసులు జారీచేసి, 147 కేసులు నమోదు చేసి, 49 మందిని అరెస్టు చేశారు. 2026 ఏప్రిల్‌లో డీజీపీ వెల్లడించిన వివరాల ప్రకారం.. సోషల్ మీడియా పర్యవేక్షణ విభాగం ఏర్పాటైన తర్వాత 1,549 కేసులు నమోదు చేసి, 1,344 మందిని అరెస్టు చేశారు. 4,529 అభ్యంతరకర కంటెంట్ అంశాలను తొలగించారు. అయితే ఇందులో ప్రతిపక్ష పార్టీల వారిపై తీసుకున్న చర్యలే ఎక్కువ.
కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే
ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడం, ప్రజాప్రతినిధులను విమర్శించడం ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ ఉన్న హక్కు. అయితే విమర్శ పేరుతో మహిళల వ్యక్తిత్వాన్ని కించపరచడం, మార్ఫింగ్ చిత్రాలు సృష్టించడం, అసత్య ప్రచారాలు చేయడం, బెదిరింపులకు దిగడం నేరం. అలాంటి తప్పుచేసిన ఎవరైనా ఒకే విధంగా చట్టాన్ని ప్రయోగించాలి. మహిళల గౌరవాన్ని కాపాడటంలో ప్రభుత్వాలు రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టాలి. ఫిర్యాదు అందిన వెంటనే విచారణ చేపట్టాలి. కేసుల నమోదు, అరెస్టుల విషయంలో పారదర్శకత ఉండాలి. బాధిత మహిళలకు భరోసా కల్పించాలి. లేకపోతే సోషల్ మీడియా వేధింపులు మరింత పెరిగి మహిళలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే.


