4,246 పంచాయతీల్లో ఎన్నికలకు ఎస్‌ఈసీ నోటిఫికేషన్
రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ
డిసెంబర్ 2న పోలింగ్.. అదే రోజు ఓట్ల లెక్కింపు
సాక్షి, అమరావతి: చివరి విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్‌ఈసీ) అనిల్ చంద్రపునేఠ గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ విడతలో 212 మండలాల పరిధిలోని 4,246 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 21న ఆయా గ్రామ పంచాయతీల్లో సంబంధిత రిటర్నింగ్ అధికారులు ఎక్కడికక్కడ నోటిఫికేషన్ జారీ చేసి.. అదే రోజు ఉదయం 10.30 నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. డిసెంబర్ 2న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. ఫలితాలు ప్రకటించిన రోజే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా నిర్వహిస్తారు. ఏదైనా కారణంతో ఆ రోజు ఉప సర్పంచ్ ఎన్నిక సాధ్యం కాకపోతే.. మరుసటి రోజు నిర్వహిస్తారు.
మూడో విడత ఎన్నికల వివరాలు..
నామినేషన్ల స్వీకరణ – ఈనెల 21 నుంచి 23 వరకు
నామినేషన్ల పరిశీలన– 24వ తేదీ ఉదయం 8 గంటల నుంచి
అప్పీళ్ల స్వీకరణ – ఈనెల 25న
అప్పీళ్ల పరిష్కారం – 26న
నామినేషన్ల ఉపసంహరణ– 27వ తేదీ మధ్యాహ్నం 3 వరకు.. అనంతరం అభ్యర్థుల తుది జాబితా ప్రకటన
పోలింగ్, ఫలితాలు – డిసెంబర్ 2న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్.. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన, ఉప సర్పంచ్‌ల ఎన్నిక.


