అల్తూరుపాడులో..అలా ‘రెట్టింపు’ దోపిడీ! | Irrigation experts left stunned by the cost of works at Alturupadu | Sakshi
Sakshi News home page

అల్తూరుపాడులో..అలా ‘రెట్టింపు’ దోపిడీ!

Nov 20 2026 4:53 AM | Updated on Nov 20 2026 4:55 AM

Irrigation experts left stunned by the cost of works at Alturupadu

0.93 టీఎంసీ రిజర్వాయర్‌ నిర్మాణానికి రూ.571.67 కోట్లా?

ఒక టీఎంసీ రిజర్వాయర్‌ నిర్మాణ వ్యయమే గరిష్టంగా రూ.250 కోట్లు దాటదు 

అల్తూరుపాడు పనుల వ్యయంపై నివ్వెరపోతున్న సాగునీటి రంగ నిపుణులు 

అటవీ అనుమతులు రాకపోవడంతో సోమశిల–స్వర్ణముఖి లింక్‌ కెనాల్‌ డిజైన్‌ మార్పు 

సత్యసాయిగంగ కెనాల్‌ నుంచి 2.356 టీఎంసీలు ఎత్తిపోసేలా అల్తూరుపాడు ఎత్తిపోతల 

అలా ఎత్తిపోసిన నీటి నిల్వ కోసం అల్తూరుపాడు వద్ద రిజర్వాయర్‌ నిర్మాణం 

రూ.457.58 కోట్ల అంచనాతో జలవనరుల శాఖ టెండర్‌ నోటిఫికేషన్‌ 

రూ.478.59 కోట్లకు జీవీఆర్‌ ఇన్‌ఫ్రాకు కట్టబెట్టడంతో ఖజానాపై రూ.21.01 కోట్ల భారం.. పన్నుల రూపంలో రూ.93.08 కోట్లు రీయింబర్స్‌ చేయనున్న సర్కార్‌ 

దాంతో రూ.571.67 కోట్లకు చేరిన కాంట్రాక్టు విలువ 

ఈ వ్యవహారంలో భారీగా ముడుపులు చేతులు మారాయంటూ ఆరోపణలు  

సాక్షి, అమరావతి: ఒక్క టీఎంసీ కంటే తక్కువ సామర్థ్యం ఉన్న ఓ రిజర్వాయర్‌ పనులను రెట్టింపు ధరకు అప్పగించడం ద్వారా కుమ్మక్కు దోపిడీకి చంద్రబాబు సర్కార్‌ పచ్చజెండా ఊపినట్లు ఇంజనీరింగ్‌ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున ముడుపులు చేతులు మారాయంటూ ఆరోపణలు  వ్యక్తమవుతున్నాయి. తిరుపతి జిల్లా అల్తూరుపాడు రిజర్వాయర్‌ నిర్మాణ పనుల టెం­డర్లలో గోల్‌మాల్‌ జరిగినట్లు స్పష్టం చేస్తున్నారు. అంచనా వ్య­యా­న్ని పెంచేయడం.. కోరినంత కమీషన్‌ ముట్టజెప్పే సంస్థకు పనులు అప్పగించడం దీనికి నిదర్శనమని చెబుతున్నారు.  

ఖజానాకు గండి..  
జలవనరుల శాఖ అధికారుల లెక్కల ప్రకారం ఒక టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్‌ నిర్మాణానికి గరిష్ఠంగా రూ.250 కోట్లకు మించి వ్యయం కాదు. అలాంటిది కేవలం 0.93 టీఎంసీ సామర్థ్యం కూడా లేని అల్తూరుపాడు రిజర్వాయర్‌ నిర్మాణ పనులను రూ.571.67 కోట్లు (జీఎస్టీ, సీనరేజీ లాంటి పన్నులతో కలిపి) కాంట్రాక్టు సంస్థకు అప్పగించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేయడంలో ఆంతర్యమేమిటని సాగునీటి నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.  భారీగా ముడుపులు చేతులు మారడం వల్లే రిజర్వాయర్‌ నిర్మాణ పనులను రెట్టింపు వ్యయంతో కట్టబెడుతున్నారని ఆరోపిస్తున్నారు. 

తిరుపతి జిల్లా డక్కిలి మండలం అల్తూరుపాడు వద్ద 0.93 టీఎంసీ సామర్థ్యంతో బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ పనులకు రూ.457.58 కోట్ల అంచనా వ్యయంతో రెండేళ్లలోగా పూర్తి చేయాలనే షరతుతో ఈనెల 3న జలవనరుల శాఖ టెండర్లు పిలిచింది. నాలుగు సంస్థలు బిడ్‌లు దాఖలు చేయగా 4.59 శాతం అధిక ధర అంటే రూ.478.59 కోట్లకు కోట్‌ చేసి ఎల్‌–1గా నిలిచిన జీవీఆర్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్టŠస్‌  సంస్థకు పనులు అప్పగించడానికి అనుమతి ఇవ్వాలంటూ ఎస్‌ఎల్‌టీసీ (రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ)కి సోమశిల–స్వర్ణముఖి లింక్‌ కెనాల్‌ ఎస్‌ఈ ప్రతిపాదనలు పంపారు. దీనికి ఎస్‌ఎల్‌టీసీ ఆమోద ముద్ర వేయడం.. జీవీఆర్‌ సంస్థకు పనులు అప్పగించడం లాంఛనమే. అధిక ధరలకు పనులు అప్పగించడం వల్ల ఖజానాకు రూ.21.01 కోట్ల గండి పడుతుండగా ఆ మేరకు కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూరుతోంది.  

అటవీ అనుమతులు తేలేక చేతులెత్తేసి.. 
ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 1.10 లక్షల ఎకరాలకు సాగునీరు, 4.45 లక్షల మంది తాగునీరు అందించే లక్ష్యంతో 2006లో రూ.399 కోట్ల వ్యయంతో సోమశిల–స్వర్ణముఖి లింక్‌ కెనాల్‌ పనులను చేపట్టారు. సోమశిల కండలేరు వరద కాలువ (ఎస్‌కేఎఫ్‌సీ)లో 12.52 కి.మీ. వద్ద నుంచి 2,500 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో సోమశిల–స్వర్ణముఖి లింక్‌ కెనాల్‌ను 100.425 కిమీ పొడవున తవ్వి.. ఆ కెనాల్‌ ద్వారా 4.5 టీఎంసీలను తరలించి.. ఆయకట్టుకు నీళ్లందించేలా ఈ ప్రాజెక్టును రూపొందించారు. 2009 నాటికే 44.682 కి.మీ. పొడవున లింక్‌ కెనాల్‌ తవ్వకం పనులు పూర్తి కాగా ఆ తర్వాత ప్రభుత్వాలు అటవీ అనుమతులు తేలేక చేతులెత్తేసి సోమశిల–స్వర్ణముఖి లింక్‌ కెనాల్‌ పనులను ఆపేశాయి. 

2018లో చంద్రబాబు సర్కార్‌ ఆ కెనాల్‌ స్వరూపాన్ని సమూలంగా మార్చేసింది. డక్కిలి మండలం అల్తూరుపాడు వద్ద సత్యసాయిగంగ కెనాల్‌లో 34.10 కి.మీ. వద్ద నుంచి రోజుకు 600 క్యూసెక్కుల చొప్పున 60 రోజుల్లో 2.356 టీఎంసీలు అల్తూరుపాడు వద్ద నిర్మించే బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసి.. సోమశిల–స్వర్ణముఖి లింక్‌ కెనాల్‌లో 56.25 కి.మీ.ల ఎగువన 14 వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించాలని నిర్ణయించింది. అల్తూరుపాడు ఎత్తిపోతల, రిజర్వాయర్‌ పనులను చేపట్టేందుకు 2018లో రూ.434.15 కోట్లతో అనుమతి ఇచ్చింది. అల్తూరుపాడు రిజర్వాయర్‌ను 6.6 కి.మీ.ల పొడవున పైభాగంలో 6 మీటర్ల వెడల్పుతో గరిష్ఠంగా 24.462 మీటర్ల ఎత్తున మట్టికట్ట నిర్మించాలి. 

మూడు చోట్ల ఓటీ (ఆఫ్‌ టేక్‌) స్లూయిజ్‌లు, రెండు చోట్ల ఇన్‌లెట్స్, ఒక సర్‌ప్లస్‌ వియర్‌ (మత్తడి) నిర్మించాలి. మట్టికట్ట నిర్మాణానికి 17.15 లక్షల క్యూబిక్‌ మీటర్ల నల్లరేగడి మట్టి, 32.70 లక్షల క్యూబిక్‌ మీటర్ల గ్రావెల్‌ (ఎర్రమట్టి) అవసరం. అల్తూరుపాడు ఎత్తిపోతల పనులను రూ.110.88 కోట్లకు మేఘాకు అప్పగించగా... 0.93 టీఎంసీ సామర్థ్యంతో నిర్మించే అల్తూరుపాడు రిజర్వాయర్‌ పనులను రూ.256.27 కోట్లకు హెచ్‌ఈఎస్‌ ఇన్‌ఫ్రాకు కట్టబెట్టింది. అంచనా వ్యయాన్ని పెంచేసి.. అధిక ధరకు కాంట్రాక్టర్లకు అప్పగించి.. కమీషన్‌లు తీసుకున్నారనే ఆరోపణలు అప్పట్లోనే బలంగా వ్యక్తమయ్యాయి. 

రివర్స్‌ టెండరింగ్‌తో అక్రమాలు బట్టబయలు.. 
అల్తూరుపాడు రిజర్వాయర్‌లో 2019 ఆగస్టు 25 నాటికి రూ.2.67 కోట్ల విలువైన పనులను హెచ్‌ఈఎస్‌ ఇన్‌ఫ్రా చేసింది. నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు ఆ కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేసి.. రూ.253.77 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించింది. 26.72 శాతం తక్కువ ధరకు అంటే రూ.185.96 కోట్లకే పనులు చేయడానికి బీవీఎస్సార్‌ కన్‌స్ట్రక్షన్స్‌ ముందుకొచ్చింది. దాంతో అదే సంస్థకు పనులు అప్పగించింది. తద్వారా ఖజానాకు రూ.67.81 కోట్లు ఆదా అయ్యాయి. దీంతో చంద్రబాబు సర్కార్‌ అక్రమాలు బట్టబయలయ్యాయి. 

బీవీఎస్సార్‌ సంస్థ రూ.4.72 కోట్ల విలువైన పనులు పూర్తి చేసింది. అయితే రిజర్వాయర్‌ మట్టికట్ట నిర్మాణానికి అవసరమైన మట్టిని చెరువుల్లో పూడికతీత ద్వారా సమీప కొండల నుంచి కాంట్రాక్టర్‌ తరలించడాన్ని అప్పటి విపక్ష నేతలు అడ్డుకున్నారు. టీడీపీ సానుభూతిపరులైన కొందరిని రైతుల ముసుగులో ముందుపెట్టి రాజకీయ డ్రామాకు తెరతీయడం ద్వారా కాంట్రాక్టర్‌ పనులు చేయలేని పరిస్థితిని కల్పించారు.

టెండర్లు రద్దు చేసి అంచనాల్లో వంచన..
టీడీపీ కూటమి సర్కార్‌ అధికారంలోకి రాగానే అల్తూరుపాడు రిజర్వాయర్‌ టెండర్లను రద్దు చేసింది. ఆ రిజర్వాయర్‌ అంచనా వ్యయాన్ని రూ.310.39 కోట్ల నుంచి రూ.679.20 కోట్లకు పెంచేస్తూ ఏప్రిల్‌ 16న ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో రిజర్వాయర్‌ నిర్మాణ పనులను రూ.571.67 కోట్లకు కాంట్రాక్టర్‌కు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసింది. జలవనరుల శాఖ లెక్కల ప్రకారం ఒక టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్‌ నిర్మాణానికి గరిష్ఠంగా రూ.250 కోట్లకు మించి వ్యయం కాదని రిటైర్డ్‌ చీఫ్‌ ఇంజినీర్‌ ఒకరు స్పష్టం చేశారు. అలాంటిది ఒక టీఎంసీ కంటే తక్కువ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్‌ పనులను రెట్టింపు ధరకు అప్పగించడంపై ఇంజనీరింగ్‌ నిపుణులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయని ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement