విద్యుత్ ఉద్యోగులపై రూ.3,410 కోట్ల పింఛను భారం
ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్‌కు మారాలంటే భరించక తప్పదు
ఒక్కో ఉద్యోగిపై పడే ఆర్థిక భారం ఎంతనేది లెక్కిస్తున్న యాజమాన్యాలు
ఒకటి, రెండు రోజుల్లో ఉద్యోగులందరికీ వేర్వేరుగా డిమాండ్ నోటీసులు
ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి
జీఓ నెం.53ని తమకూ వర్తింపజేయాలని డిమాండ్
ప్రతిపాదనలు, అభిప్రాయాల సమర్పణకు ఈనెల 25 వరకు గడువు
సాక్షి, అమరావతి: మహా భారతంలో దృతరాష్ట్రుడు తన బిడ్డలను ఒకలా, సోదరుని పిల్లలను మరోలా చూసే వాడని మనం పురాణాల్లో చదువుకున్నాం. కానీ అదే పక్షపాత విధానాలను ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనలో చూస్తున్నామని విద్యుత్ సంస్థల ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను, విద్యుత్ సంస్థల ఉద్యోగులనూ సమానంగా చూడాల్సిన పాలకులు, వివక్షతో వ్యవహరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. విద్యుత్ ఉద్యోగులను ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్ (పాత పింఛను విధానం)లోకి మార్చే విషయంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో వారు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ ప్రక్రియలో ఉద్యోగులపై రూ.3,410 కోట్ల పింఛను భారం వేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేయడంపై ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
రూ.3,410 కోట్ల గత బకాయిల భారం
యాజమాన్యం వెల్లడించిన అంచనా నివేదిక ప్రకారం.. 2026 మార్చి 31 నాటికి పాత పింఛను విధానంలోకి మార్పునకు సంబంధించిన గత ఆర్థిక బాధ్యత సుమారు రూ.3,410.88 కోట్లుగా తేలింది. ఉద్యోగులు, యాజమాన్యం ఇప్పటివరకు ఈపీఎఫ్ ఖాతాల్లో జమ చేసిన మొత్తం సుమారు రూ.2,300 కోట్ల వరకు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రతి ఉద్యోగికి సంబంధించిన వ్యక్తిగత ఆర్థిక బాధ్యత(భారం) వివరాలను ఒకటి, రెండు రోజుల్లో అందజేస్తామని యాజమాన్యం ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ)తో తాజాగా జరిగిన సమావేశంలో తెలిపింది.
జీఓ నెం.53ని అమలు చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన 53వ ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు కల్పించిన పాత పింఛను విధానాన్ని విద్యుత్ ఉద్యోగులకు కూడా వర్తింపజేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అయితే, 2026 మార్చి 31 తర్వాత ఏర్పడే భవిష్యత్తు ఆర్థిక బాధ్యతలను మాత్రమే విద్యుత్ సంస్థల యాజమాన్యం భరిస్తుందని అధికారుల కమిటీ స్పష్టం చేసింది. 1999 ఫిబ్రవరి 1 నుంచి 2004 ఆగస్టు 31 మధ్య ఉద్యోగాల్లో చేరిన సిబ్బంది మాత్రం గత ఆర్థిక బాధ్యతలను చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.
25 వరకు గడువు పొడిగింపు
ఈ అంశంపై ఆర్థిక, చట్టపరమైన సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఉద్యోగ సంఘాలు తమ అభిప్రాయాలను లిఖితపూర్వకంగా అందించాలని యాజమాన్యం కోరింది. వాటిని పరిశీలించి కమిటీ నివేదికలో పొందుపరిచి ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపింది. సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు ఈ నెల 25 వరకు గడువు ఇవ్వాలని జేఏసీ కోరగా యాజమాన్యం అంగీకరించింది. వేలాది విద్యుత్ ఉద్యోగుల భవిష్యత్తు, ఆర్థిక భద్రత, పదవీ విరమణ ప్రయోజనాలతో ముడిపడిన ఈ అంశంపై ఉద్యోగులందరూ తమ సూచనలు, అభిప్రాయాలు అందించాలని ఏపీ విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ కేంద్ర కార్యవర్గం విజ్ఞప్తి చేసింది. ఈ భారీ భారాన్ని ఉద్యోగులపై వేయకుండా ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని కోరినట్లు జేఏసీ వెల్లడించింది.


