వ్యాజ్యంలో రెవెన్యూ ముఖ్య కార్యదర్శి, కలెక్టర్లను ప్రతివాదులుగా చేర్చండి
పిటిషనర్లకు హైకోర్టు ఆదేశాలు
అర్హతలేని 1,500 మంది ఇలా ఉద్యోగాలు పొందారు
వారి సమీప కుటుంబ సభ్యులకు స్థిరాస్తులు ఉన్నాయి
రెవెన్యూ రికార్డులు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి
వారు అనర్హులని తేలితే ఆ ఉద్యోగాలు అర్హులకు వస్తాయి
పిటిషనర్ల తరఫున న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలు
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025లో దాదాపు 1,500 మంది తప్పుడు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లతో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోటా కింద ఉద్యోగాలు పొందారంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, కడప, కర్నూలు, నంద్యాల జిల్లా కలెక్టర్లను ప్రతివాదులుగా చేర్చాలని పిటిషనర్లను ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా ఈ వ్యవహారంలో ముందుగా రాష్ట్ర అధికారులను ఆశ్రయించకుండా నేరుగా సీబీఐ విచారణ కోరడాన్ని న్యాయమూర్తి తప్పుబట్టారు. ‘అనర్హులకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు జారీ చేశారనేందుకు ప్రాథమిక ఆధారాలుంటే, ముందుగా రాష్ట్ర అధికార యంత్రాంగాన్ని ఆశ్రయించాలి’అని ఈ సందర్భంగా ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై కర్నూలు, నంద్యాల, కడప జిల్లాలకు చెందిన పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వండి
పిటిషనర్ల తరఫు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ, ‘మేము కేవలం సీబీఐ దర్యాప్తును మాత్రమే కోరడం లేదు. మేమిచ్చిన ఆధారాలను పరిగణనలోకి తీసుకుని విచారణ జరిపేలా రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా కలెక్టర్లను ఆదేశించాలని కోరుతున్నాం. తప్పుడు సర్టిఫికెట్లతో పొందిన ఉద్యోగాలను రద్దు చేయాలని గతంలోనే జిల్లా విద్యాధికారి, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులకు ఫిర్యాదులు చేశాం. సంబంధిత అభ్యర్థుల సమీప కుటుంబ సభ్యులకు భూములు, స్థిరాస్తులు ఉన్నట్లు రెవెన్యూ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.
ఈ ఆధారాలన్నింటినీ తమ వ్యాజ్యంలో ఈ కోర్టు ముందుంచాము. అర్హత లేకపోయినా ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఉద్యోగాలు పొందిన వారు అనర్హులని తేలితే, ఆ ఉద్యోగాలు పిటిషనర్లకు దక్కుతాయి. తామిచ్చిన ఆధారాలను పరిగణనలోకి తీసుకుని విచారణ జరిపేలా రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా కలెక్టర్లను ఆదేశించాలి’ అని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ తాజాగా వాదనలు వినిపిస్తూ.. ఈ అంశంపై చర్యలు తీసుకోవాల్సింది రెవెన్యూ అధికారులేనని, వారిని ప్రతివాదులుగా చేర్చలేదని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, ఈ వ్యాజ్యంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిని, ఆయా జిల్లా కలెక్టర్లను ప్రతివాదులుగా చేర్చాలని ఆదేశించారు.


