అనధికార ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు తేల్చిచెప్పిన కృష్ణా బోర్డు
పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుపై తెలంగాణ ఫిర్యాదుపై స్పందన
అనుమతి లేని ప్రాజెక్టులపై బోర్డు జోక్యానికి పరిమితులున్నట్టు పునరుద్ఘాటన
బోర్డు అధికార పరిధిని సుప్రీంకోర్టులో సవాల్ చేసిన తెలంగాణ
మళ్లీ బోర్డు జోక్యం కోరుకోవడం పరస్పర విరుద్ధ చర్యే
తెలంగాణ సర్కార్ ధోరణిని తప్పుబట్టిన కృష్ణా బోర్డు
బోర్డుకి అధికారాలు లేక నిర్ణయాలు తీసుకోలేకపోతోంది.. కేంద్రం సైతం జోక్యం చేసుకునే అవకాశం లేదని స్పష్టీకరణ
ఇరు రాష్ట్రాలకు ఘాటుగా లేఖ రాసిన కృష్ణా బోర్డు
సాక్షి, అమరావతి: ఎవరికీ కేటాయించని జలాలు.. మిగులు జలాలు అందుబాటులో ఉన్నాయనే ఊహతో ప్రాజెక్టులు చేపట్టినా.. నిర్మాణం పూర్తయినా ఆ ప్రాజెక్టుల ద్వారా నీటి వినియోగానికి ఎలాంటి చట్టబద్ధ హక్కులు సంక్రమించవని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) తేల్చి చెప్పింది. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులను ట్రిబ్యునల్ ఖరారు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. పునర్విభజన చట్టం–2014లోని 11వ షెడ్యూల్‌లో పొందుపరిచిన 7వ నిబంధన ప్రకారం కొత్త ప్రాజెక్టులకు తప్పనిసరిగా కృష్ణా బోర్డు నుంచి ముందస్తు మదింపు, సాంకేతిక అనుమతులు తీసుకుని.. ఆ తర్వాత అపెక్స్ కౌన్సిల్ ఆమోదం పొందాల్సి ఉంటుందని గుర్తు చేసింది.
నాగార్జున సాగర్ నుంచి జలాలను తరలించడానికి ఏపీ ప్రభుత్వం చేపట్టిన పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును అడ్డుకోవాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి స్పందిస్తూ గురువారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కృష్ణా బోర్డు ఘాటుగా లేఖ రాసింది. కృష్ణా జలాల వివాదాలు, అనుమతి లేని ప్రాజెక్టుల నిర్మాణాలను అడ్డుకోవాలంటూ రెండు రాష్ట్రాలు పరస్పరం చేసుకుంటున్న ఫిర్యాదులపై చర్యలు తీసుకునే విషయంలో తనకున్న పరిమితులను కృష్ణా బోర్డు మరోసారి గుర్తు చేసింది. ఇరు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీపై కృష్ణా ట్రిబ్యునల్–2 తీర్పు రావాల్సి ఉండటంతోపాటు కృష్ణా బోర్డు అధికార పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలుపై సుప్రీంకోర్టులో కేసు అపరిష్కృతంగా ఉండటంతో వివాదాస్పద అంశాలపై జోక్యం చేసుకోవడం, ఆదేశాలు జారీ చేయడంలో ఇబ్బందులు ఉన్నాయని తేల్చి చెప్పింది.
కేసు మీరే వేసి మళ్లీ మీరే చర్యలు తీసుకోమంటే ఎలా?
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కృష్ణా బేసిన్ పరిధిలోని ప్రాజెక్టులపై కృష్ణా బోర్డుకు అధికార పరిధిని కల్పిస్తూ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ 2021 జూలై 15న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిందని కృష్ణా బోర్డు గుర్తు చేసింది. రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్‌లో పొందుపరిచిన రాష్ట్ర జాబితాలో ఉన్న 17వ అంశానికి ఈ నోటిఫికేషన్ విరుద్ధంగా ఉందని ఆరోపిస్తూ నోటిఫికేషన్‌ను పూర్తిగా కొట్టివేయాలని తెలంగాణ కోరిన విషయాన్ని ప్రస్తావించింది.
కృష్ణా బోర్డు విధులు, అధికార పరిధితోపాటు ప్రాజెక్టుల మదింపుకి సంబంధించి అధికారాలకు సంబంధించి పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 85(8)లో పొందుపరిచిన నిబంధనల అమలు ఈ నోటిఫికేషన్‌పైనే ఆధారపడి ఉన్నాయని స్పష్టం చేసింది. బోర్డుకి అధికార పరిధిని కల్పించే నోటిఫికేషన్‌నే సవాల్ చేస్తూ, మళ్లీ బోర్డు జోక్యాన్ని కోరడం పరస్పర విరుద్ధంగా ఉందని పేర్కొంటూ తెలంగాణ వైఖరిని బోర్డు తప్పుబట్టింది.
కేంద్రం కూడా ఏమీ చేయడానికి లేదు
‘బోర్డు సమావేశ నిబంధనల క్లాజ్ 6(3) ప్రకారం సాధారణంగా నిర్ణయాలు ఏకాభిప్రాయంతో తీసుకుంటారు. ఏకాభిప్రాయం లేని వివాదాస్పద అంశాలపై క్లాజ్ 6(2) కింద ప్రత్యేకంగా వాయిదా వేసినట్టు నమోదు చేయకపోతే అవి అసంపూర్తిగా మిగిలిపోతాయి. సుప్రీంకోర్టులో అధికార పరిధిపై కేసు ఉండటంతో పాటు ఏకాభిప్రాయంపై ఉన్న ఈ నిబంధన కారణంగా వివాదాస్పద అంశాలపై నిర్ణయం తీసుకోవడంలో బోర్డుకు పరిమితులున్నాయి.
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని 11వ షెడ్యూల్‌లో ఉన్న 9వ నిబంధన ప్రకారం బోర్డు నిర్ణయాన్ని అమలు చేయడంలో విఫలమైనప్పుడు కేంద్ర ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే, ఇందుకు అధికార పరిధి పరంగా ఎలాంటి అడ్డంకులు లేని బోర్డు నిర్ణయం ఉండాల్సి ఉంటుంది’ అని కృష్ణా బోర్డు తెలిపింది. బోర్డుకి ప్రస్తుతం అధికార పరిధి కొరవడటంతో నిర్ణయాలు తీసుకోలేకపోతోందని, దీంతో ఈ విషయంలో కేంద్రం సైతం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం లేదని పరోక్షంగా గుర్తు చేసింది.


