పరిషత్‌ కో–ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక విధానం మార్పు | Change in the election procedure for Parishad co opted members | Sakshi
Sakshi News home page

పరిషత్‌ కో–ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక విధానం మార్పు

Nov 20 2026 4:43 AM | Updated on Nov 20 2026 4:43 AM

Change in the election procedure for Parishad co opted members

ముందు ఎంపీపీ, జెడ్పీ చైర్‌పర్సన్ల ఎన్నికలు నిర్వహించాలి 

అనంతరం గడువులోగా కో–ఆప్షన్‌ సభ్యులను ఎన్నుకోవాలి 

మండలాల్లో కో–ఆప్షన్‌ సభ్యుల ఎన్నికలు జరుగుతున్న రోజే  సర్కారు ఆదేశాలు 

దీంతో చివరి నిమిషంలో ఆగిపోయిన ఎన్నికలు 

ఇప్పటివరకు కో–ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక తరువాతే ఎంపీపీ, జెడ్పీ చైర్‌పర్సన్ల ఎన్నికలు

సాక్షి, అమరావతి: మండల, జిల్లా పరిషత్‌లలో కో–ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక విధానంలో మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీచేసింది. ముందు మండలాధ్యక్ష, ఉపాధ్యక్ష, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్, వైస్‌ చైర్‌పర్సన్ల ఎన్నికలు నిర్వహించాలని, అనంతరం గడువులోగా కో–ఆప్షన్‌ సభ్యుల ఎన్నికలు నిర్వహించాలని నిర్దేశించింది. ఈ మేరకు ఏపీ పంచాయతీరాజ్‌ చట్టంలోని ఎన్నికల నిబంధనలను మారుస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్దిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్‌ దండే ఉత్తర్వులు జారీచేశారు. 

ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం.. మండల పరిషత్‌లో ముందు కో–ఆప్షన్‌ సభ్యుని ఎన్నిక నిర్వహించిన తర్వాత మండలాధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలను వరుస క్రమంలో చేపట్టాలి. జిల్లా పరిషత్‌లోను ముందు కో–ఆప్షన్‌ సభ్యుని ఎన్నిక నిర్వహించిన తర్వాతే జెడ్పీ చైర్‌పర్సన్, వైస్‌ చైర్‌పర్సన్ల ఎన్నికలు నిర్వహించాలి. ఎక్కడైనా ఏదైనా కారణంతో కో–ఆప్షన్‌ సభ్యుని ఎన్నిక వాయిదా పడితే.. తరువాత జరగాల్సిన ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ఆగిపోతుంది. 

ఇప్పుడు ప్రభుత్వం మార్చిన నిబంధనల ప్రకారం.. మండలాల్లో ముందు మండలాధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు నిర్వహించాలి. తరువాత గడువులోగా కో–ఆప్షన్‌ సభ్యులను ఎన్నుకోవాలి. జిల్లా పరిషత్‌లలో ముందు జెడ్పీ చైర్‌పర్సన్, వైస్‌ చైర్‌పర్సన్ల ఎన్నికలు నిర్వహించి, తరువాత గడువులోగా కో–ఆప్షన్‌ సభ్యులను ఎన్నుకోవాలి. మండల, జిల్లా పరిషత్‌లలో మైనార్టీ వర్గాలకు చెందిన క్రిస్టియన్లు, ముస్లింలు, బుద్ధులు, సిక్కులు, పార్శీలు తదితర వర్గాల నుంచి ఒకరిని కో–ఆప్షన్‌ సభ్యునిగా ఎన్నికోవాల్సి ఉంటుంది.

ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ ఇచ్చిన తరువాత ఈ ఉత్తర్వులా? 
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) అనిల్‌చంద్ర పునేఠ ఈ నెల 10వ తేదీ జారీచేసిన నోటిఫికేషన్‌ ప్రకారం గురువారం అన్ని మండల పరిషత్‌లలో ముందు కో–ఆప్షన్‌ సభ్యులకు, తరువాత మండలాధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు జరగాల్సి ఉంది. మండలాల్లో కో–ఆప్షన్‌ సభ్యుల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతున్న తరుణంలో ప్రభుత్వం నిబంధనలు మార్చడంతో ఆ ఎన్నికలు ఆగిపోయాయి. 

మండలాధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు జరిగాయి. శుక్రవారం జిల్లా పరిషత్‌లలో కూడా చైర్‌పర్సన్, వైస్‌ చైర్‌పర్సన్ల ఎన్నికలు నిర్వహిస్తారు. ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ జారీచేసిన తర్వాత ప్రభుత్వం ఇలా నిబంధనలు మార్చవచ్చా.. అన్నదానిపై అధికారులే భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తాజా ఉత్తర్వుల నేపథ్యంలో మండల, జిల్లా పరిషత్‌లలో కో–ఆప్షన్‌ సభ్యుల ఎన్నికలకు వేరుగా నోటిఫికేషన్‌ జారీచేయనున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అధికారులు వెల్లడించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement