39 మండలాల్లో వైఎస్సార్‌సీపీకి ఎంపీపీ పదవులు | YSRCP secures MPP posts in 39 mandals | Sakshi
Sakshi News home page

39 మండలాల్లో వైఎస్సార్‌సీపీకి ఎంపీపీ పదవులు

Nov 20 2026 5:27 AM | Updated on Nov 20 2026 5:27 AM

YSRCP secures MPP posts in 39 mandals

పోలీసులు, అధికారుల దాడిలోతగిలిన గాయాలను చూపుతున్న మహిళా ఎంపీటీసీ

40 చోట్ల ఉపాధ్యక్ష పదవులు  అల్లూరి జిల్లాలో ఏడు.. నంద్యాల జిల్లాలో ఐదు   

34 మండలాల్లో ఎంపీపీ ఎన్నికలు.. 59 మండలాల్లో ఉపాధ్యక్ష ఎన్నికలు వాయిదా 

తలుపులలో నకిలీ సభ్యురాలిని హాజరు పరిచి ఎంపీపీ ఎన్నిక  

శింగనమలలో వైఎస్సార్‌సీపీ సభ్యులను గదిలో బంధించిన టీడీపీ నేతలు

సాక్షి, అమరావతి/ సాక్షి నెట్‌వర్క్‌ :  రాష్ట్ర వ్యాప్తంగా గురువారం జరిగిన మండలాధ్యక్ష ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 39 మండలాల్లో అధ్యక్ష పదవులను దక్కించుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం 625 మండలాల్లో మండలాధ్యక్ష ఎన్నికలు జరగగా, 34 చోట్ల వివిధ కారణాలతో వాయిదా పడ్డాయి. మండలాధ్యక్షుల ఎన్నిక జరగని 34 మండలాలతో పాటు మరో 25 చోట్ల కలిపి మొత్తం 59 చోట్ల ఉపాధ్యక్ష ఎన్నికలు వివిధ కారణాలతో ఆగిపోయాయి. ఆయా ప్రాంతాల్లో శుక్రవారం ఎన్నికల ప్రక్రియను చేపట్టనున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ గణాంకాల ప్రకారం.. ఎంపీపీ ఎన్నికలు జరిగిన 625 మండలాల్లో 39 చోట్ల, ఉపాధ్యక్ష ఎన్నికలు జరిగిన 600 మండలాల్లో 40 చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలిచారు. 

అల్లూరి సీతారామరాజు జిల్లాలో పది మండలాల్లో ఎన్నికలు జరిగితే, ఏడు చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఎంపీపీలుగా గెలుపొందారు. నంద్యాల జిల్లాలో ఐదు మండలాల్లో, అన్నమయ్య జిల్లాలో నాలుగు మండలాల్లో ఎంపీపీ పదవులను దక్కించుకుంది. టీడీపీ గూండాలు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం మొదలు కౌంటింగ్‌ సమయంలో రీ కౌంటింగ్‌ అక్రమాల వరకు ప్రతి దశలోనూ పోలీసుల అండతో టీడీపీ అరాచకం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా, 2021 స్థానిక ఎన్నికల సమయంలో అప్పుడు టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా 8 మండలాల్లోనే ఎంపీపీ పదవులు దక్కించుకోవడం గమనార్హం.  

టీడీపీ నేతలు, అధికారులు కుమ్మక్కు 
శ్రీసత్యసాయి జిల్లా తలుపుల ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నికల్లో అధికారులు, తెలుగుదేశం పార్టీ నేతలు కలసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. నకిలీ సభ్యురాలిని హాజరు పరిచి, టీడీపీకి మెజార్టీ ఉన్నట్లు చూపించి ఎన్నిక పూర్తి చేశారు. తలుపుల ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నిక నిర్వహించారు. మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలుండగా.. వీటిలో వైఎస్సార్‌సీపీ 6, తెలుగుదేశం 6 స్థానాలు గెలుపొందాయి. ఎంపీపీ ఎన్నిక ప్రక్రియకు వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యులు హాజరు కాలేదు. టీడీపీ సభ్యుల్లోనూ ఓబుళరెడ్డిపల్లి ఎంపీటీసీ బి.లక్ష్మి దేవి, పెద్దన్నవారిపల్లి ఎంపీటీసీ ఎం.రెడ్డెమ్మ ఎంపీపీ పదవి కావాలని పట్టుబట్టారు. 

రెడ్డమ్మ అభ్యర్థిత్వానికి టీడీపీ అధిష్టానం మద్దతు తెలపడంతో ఓబుళరెడ్డిపల్లి ఎంపీటీసీ బి.లక్ష్మిదేవి మనస్తాపం చెంది.. ఎంపీపీ ఎన్నికకు హాజరు కాలేదు. అయితే ఆమె స్థానంలో మరొక మహిళను లోపలికి పంపి.. ఆరుగురు ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారని హాజరు చూపించి ఎన్నిక పూర్తి చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో అధికారులు, పోలీసులు అధికార పార్టీకి అన్నివిధాలా సహకరించారు. విలేకరులనూ లోపలికి వెళ్లకుండా కదిరి రూరల్‌ సీఐ నాగేంద్ర అడ్డుకున్నారు. 

ఎంపీపీగా ఎం.రెడ్డెమ్మ, వైస్‌ ఎంపీపీగా బి.మంజుల ఎన్నికైనట్లు ప్రకటించారు. ఈ విషయంపై సంబంధిత అధికారులను అడగ్గా.. సరైన సమాధానం ఇవ్వలేదు. ఇదిలా ఉండగా, పల్నాడు జిల్లా నరసరావుపేటలో వైఎస్సార్‌సీపీకి చెందిన అభ్యర్థులు లేకుండానే వారి నామినేషన్లు ఉపసంహరిస్తున్నట్టు ప్రకటించారు. దీనిపై ఆ పార్టీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మున్సిపల్‌ కార్యాలయం ముందు బైఠాయించారు.  

గదిలో బంధించి.. దాడి చేసి.. 
అనంతపురం జిల్లా శింగనమల మండల పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలను టీడీపీ అన్యాయంగా, అప్రజాస్వామిక పద్ధతుల్లో దక్కించుకుంది. శింగనమల, మడకశిర టీడీపీ ఎమ్మెల్యేలు బండారు శ్రావణి, ఎంఎస్‌ రాజు దగ్గరుండి.. వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యులపై దౌర్జన్యం, దాడులు చేసి ఆ పార్టీకి పదవులు దక్కేలా చేశారు. వైఎస్సార్‌సీపీ, టీడీపీ చెరి సగం (చెరి 6 ఎంపీటీసీలు) గెలుపొందాయి. ఎంపీపీ అభ్యర్థిగా ప్రకటించలేదన్న కోపంతో టీడీపీకి చెందిన సోదనపల్లి ఎంపీటీసీ సభ్యురాలు తులసి ఎన్నికకు హాజరుకాలేదు. ఆ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీటీసీలు మాత్రమే హాజరయ్యారు. అదే సమయంలో వైఎస్సార్‌సీపీకి చెందిన ఆరుగురు సభ్యులూ వచ్చారు.

ఎన్నిక ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించి ఉంటే వైఎస్సార్‌సీపీకి ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ పదవులు రెండూ దక్కేవి. అయితే ఇద్దరు వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలను గదిలో బంధించి తాళం వేశారు. సమావేశ భవనంలోకి టీడీపీకి చెందిన ఐదుగురు, వైఎస్సార్‌సీపీకి చెందిన నలుగురిని మాత్రమే తీసుకెళ్లారు. మిగిలిన ఇద్దరు ఎక్కడని వైఎస్సార్‌సీపీ సభ్యులు నిలదీయగా..ఎమ్మెల్యే బండారు శ్రావణి దగ్గర ఉండి పోలీసులతో వారిపై దాడి చేయించారు. నలుగురు ఎంపీటీసీలకు చేతులకు, కాళ్లకు గాయాలు తగిలాయి. 

ఎంపీటీసీ సోమశేఖర్‌పై దాడి చేసి చొక్కా చింపివేశారు. ఎంపీడీఓ భాస్కర్‌ స్వయంగా మహిళా ఎంపీటీసీలపై చేయి చేసుకున్నారు. ఆర్‌ఓ లలితమ్మ ‘పచ్చ’పాతంతో వ్యవహరించారు. ఈ అన్యాయాన్ని నిలదీసేందుకు వస్తున్న వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్, పార్టీ నాయకులను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. దీంతో పోలీస్‌ స్టేషన్‌ ఎదుట వారు ధర్నా నిర్వహించారు. జై జగన్‌ అంటే ఎంపీపీ పదవి భిక్ష వేస్తామని శైలజానాథ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement