బరితెగించి 'విధ్వంసం' | Attacks and threats continue in TDP local body elections | Sakshi
Sakshi News home page

బరితెగించి 'విధ్వంసం'

Nov 20 2026 5:22 AM | Updated on Nov 20 2026 5:22 AM

Attacks and threats continue in TDP local body elections

వైఎస్సార్‌ కడప జిల్లా అగడూరు నామినేషన్‌ కేంద్రం వద్ద కర్రలు, రాడ్లతో టీడీపీ గూండాలు.. వేంపల్లె నామినేషన్‌ కేంద్రంలో సామగ్రిని ధ్వంసం చేసిన టీడీపీ రౌడీలు

పల్లెపోరులో ప్రజాస్వామ్యానికి పాతర.. పచ్చ మూకల స్వైరవిహారం!

వైఎస్సార్‌సీపీ మద్దతిచ్చిన అభ్యర్థులకు అడుగడుగునా అడ్డంకులు

హైకోర్టు ఆదేశాలనూ ఖాతరు చేయని పోలీసులు

నామినేషన్‌ పత్రాల చించివేత, బెదిరింపులు, భౌతిక దాడులు

వేంపల్లి కేంద్రంలో విధ్వంసం.. కంప్యూటర్లు, ప్రింటర్లు ధ్వంసం

అగడూరులో పెట్రో బాంబులు, రాడ్లతో దాడులు

సత్తెనపల్లిలో రుద్రవరం అభ్యర్థి పత్రాలు లాక్కెళ్లిన దుండగులు

పలుదేవర్లపాడులో నామినేషన్ల ఉపసంహరణకు ఒత్తిళ్లు

బొబ్బిలి నుంచి బనగానపల్లె వరకు అభ్యర్థులకు బెదిరింపులు

శింగనమలలో ఎంపీటీసీలపై దాడులు.. మహిళలకూ తప్పని వేధింపులు

సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో పచ్చ మూకలు బరితెగించి మరీ విధ్వంసం కొనసాగిస్తున్నా­యి. నామినేషన్ల దాఖలు నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధుల ప్రమాణ స్వీకారం వరకు వైఎస్సార్‌సీపీ మద్ద­తుదారులకు అడుగడుగునా కూటమి రౌడీల నుంచి అడ్డంకులు ఎదురవుతున్నాయి. నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, పత్రాలు లాక్కుని చించివేయడం, దాడులు చేయడం, బెదిరింపులకు దిగడం వంటి ఘటనలు రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో గురువారం చోటుచేసుకున్నాయి. హైకోర్టు ఆదేశాలు బేఖాతరయ్యాయి. 

వేంపల్లి కేంద్రంలో విధ్వంసం 
వైఎస్సార్‌ కడప జిల్లా వేంపల్లి నామినేషన్‌ కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ వర్గీయులు కేంద్రంలోకి చొరబడి అధికారులను బెదిరించడంతోపాటు వైఎస్సార్‌సీపీ మద్దతు సర్పంచ్‌ అభ్యర్థి షబ్బీర్‌ నామినేషన్‌ పత్రాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. కార్యాలయంలోని కంప్యూటర్లు, ప్రింటర్లు, టేబుళ్లు, కుర్చీలను ధ్వంసం చేశారు. బీటెక్‌ రవి చిన్నాన్న రఘునాథరెడ్డి నేతృత్వంలో ఈ హంగామా జరిగింది.  

వెలమవారిపల్లెలో రాళ్లదాడి.. రెండు గంటలు నిలిచిన ప్రక్రియ 
వేంపల్లి మండలం టి.వెలమవారిపల్లెలో నామినేషన్‌ దాఖలు చేసేందుకు వెళ్తున్న వైఎస్సార్‌సీపీ మద్దతు ఇస్తున్న అభ్యర్థులు, ఆ పార్టీ శ్రేణులపై టీడీపీ వర్గీయులు రాళ్లు రువ్వారు. ఈ దాడితో గ్రామంలో భయాందోళనలు నెలకొనగా, నామినేషన్ల ప్రక్రియ సుమారు రెండు గంటలపాటు నిలిచిపోయింది. చక్రాయపేట మండలం నాగులగుట్టపల్లిలోనూ వరుసగా రెండో రోజు టీడీపీ వర్గీయులు రౌడీలను మోహరించి నామినేషన్లను అడ్డుకున్నారు. 

అగడూరులో పెట్రో బాంబులు.. సీసీ కెమెరాలు ఆఫ్‌ చేసి పత్రాల చించివేత 
పులివెందుల నియోజకవర్గం తొండూరు మండలం అగడూరులో నామినేషన్ల సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సంతకొవ్వూరు, ఊడవగండ్ల, గోటూరు, అగడూరు గ్రామాల అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు వెళ్తుండగా యాదవారిపల్లె క్రాస్‌ రోడ్డు వద్ద ముళ్లపొదల్లో మాటువేసిన టీడీపీ వర్గీయులు పెట్రో బాంబులు, రాడ్లు, కర్రలతో దాడి చేశారు. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి అభ్యర్థులను నామినేషన్‌ కేంద్రానికి తీసుకెళ్లారు. అయినా అక్కడ కూడా దౌర్జన్యాలు ఆగలేదు. కేంద్రంలోకి చొరబడిన కొందరు సీసీ కెమెరాలను ఆఫ్‌ చేసి, ఆర్వో నుంచి నామినేషన్‌ పత్రాలను బలవంతంగా లాక్కుని చించివేశారు. ఈ ఘటనలో బీటెక్‌ రవి, టీడీపీ నేతలు అక్కులగారి విజయ్‌కుమార్‌రెడ్డి, దేవిరెడ్డి సంజీవరెడ్డి, కిరికిరి బాషాలు కీలక పాత్ర పోషించారు. 

              అన్నమయ్య జిల్లా శెట్టిపేట వద్ద రోడ్డుపై దౌర్జన్యం చేస్తున్న టీడీపీ నేతలు 

సింహాద్రిపురంలో మహిళా అభ్యర్థుల పత్రాల చించివేత 
సింహాద్రిపురం మండలంలోని 20 పంచాయతీలకు సంబంధించి తొలి రోజు నామినేషన్ల సందర్భంగా బలపనూరు క్లస్టర్‌లో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులను బెదిరించడంతో ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదు. దీనిపై ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడంతో చవ్వారిపల్లె, హిమకుంట్ల, వై.కొత్తపల్లె అభ్యర్థులకు పోలీసు రక్షణ కల్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. అయినా గురువారం అభ్యర్థులు హేమావతి, స్వర్ణలత, గంగులమ్మలను పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి, అనంతరం నామినేషన్‌ కేంద్రం బయట వదిలేశారు. అక్కడ కాపుకాసిన టీడీపీ నాయకులు వారి చేతుల్లోని నామినేషన్‌ పత్రాలను లాక్కుని చించివేశారు. పోలీసుల సమక్షంలోనే ఈ ఘటన జరిగినా అడ్డుకోలేదని బాధితులు విమర్శించారు. 

సత్తెనపల్లిలోనూ అడ్డంకులు..  
పెదకూరపాడు నియోజకవర్గంలో పరిషత్‌ ఎన్నికల సమయంలో చోటుచేసుకున్న అడ్డంకులు రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కొనసాగాయి. తొలిరోజు గ్రామాల్లో నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడంతో కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు గురువారం సత్తెనపల్లి ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్లు వేసేందుకు వచ్చినా అక్కడా వారికి ఇబ్బందులు తప్పలేదు. ఆర్డీవో కార్యాలయం పరిసరాల్లో టీడీపీ శ్రేణులు గుమిగూడి వైఎస్సార్‌సీపీ మద్దతుదారులను అడ్డుకున్నారు. వ్యవసాయ మార్కెట్‌ యార్డు, ఆర్డీవో కార్యాలయానికి వెళ్లే మార్గం, వైఎస్సార్‌సీపీ కార్యాలయం సమీపంలోని బైపాస్‌ రోడ్డులోనూ గుంపులుగా తిరుగుతూ భయాందోళనలు సృష్టించారు. 

           పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో దౌర్జన్యం చేస్తున్న టీడీపీ మూకలు  

రక్షణ కల్పించని పోలీసులు 
అచ్చంపేట మండలం రుద్రవరం గ్రామంలో నామినేషన్‌ వేసేందుకు వచ్చిన వైఎస్సార్‌సీపీ మద్దతుదారులను టీడీపీ మూకలు అడ్డుకున్నాయి. పోలీసులు, ఎన్నికల అధికారులు తగిన రక్షణ కల్పించకపోవడంతో పలువురు అభ్యర్థులు వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ కార్యాలయానికి చేరుకుని అక్కడే వేచి ఉండాల్సి వచ్చింది. 

మహిళా అభ్యర్థుల ఆవేదన పట్టించుకోలేదు 
బెల్లంకొండ మండలం మాచాయపాలెంకు చెందిన ఇద్దరు మహిళలు నామినేషన్‌ వేసేందుకు సత్తెనపల్లి ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ బందోబస్తులో ఉన్న సీఐ బ్రహ్మయ్యను కలిసి తమకు నామినేషన్‌ వేసే అవకాశం కల్పించాలని వేడుకున్నా లోపలికి అనుమతించలేదు.

వెంకటాయపాలెం అభ్యర్థులను అడ్డగింత 
బెల్లంకొండ మండలం వెంకటాయపాలెం గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు సర్పంచ్‌ అభ్యర్థి కారుమూరి తిరుపతిరావుతో కలిసి మన్నెసుల్తాన్‌పాలెం నామినేషన్‌ కేంద్రానికి బయలుదేరారు. గ్రామ పొలిమేర వద్దకు చేరుకోగానే అక్కడున్న టీడీపీ నాయకులు, వారి అనుచరులు అడ్డుకుని నామినేషన్‌ వేయడానికి వీల్లేదంటూ దౌర్జన్యానికి దిగారు. దీంతో వారు నామినేషన్‌ వేయకుండానే వెనుదిరిగారు. 

పలుదేవర్లపాడులో పది మందిని అదుపులోకి తీసుకుని 
పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం పలుదేవర్లపాడులో సర్పంచ్‌ ఎన్నిక వివాదాస్పదమైంది. గ్రామంలోని ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వారంతా ఐక్యంగా సర్పంచ్‌ స్థానానికి నామినేషన్లు దాఖలు చేయగా, వారిపై ఒత్తిళ్లు తెస్తున్నారని స్థానికులు ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ నాయకులతోపాటు బుధవారం నామినేషన్లు వేసిన టీడీపీ రెబల్‌ అభ్యర్థులను కలిపి మొత్తం పది మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. నామినేషన్లు ఉపసంహరించుకోవాలంటూ ఒత్తిడి చేస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. 

బొబ్బిలిలో చంపేస్తామంటూ బెదిరింపులు 
విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం చింతాడలో వైఎస్సార్‌సీపీ మద్దతుతో సర్పంచ్‌ అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్న యమ్మల సన్యాసిరావును టీడీపీ నాయకులు బెదిరించారు. గ్రామంలో అడుగుపెడితే చంపి పాతిపెడతామని మాజీ సర్పంచ్‌ చింతాడ జయప్రదీప్‌కుమార్‌ హెచ్చరించారు. నామినేషన్‌కు అవసరమైన కుల ధ్రువీకరణ పత్రం కోసం సచివాలయంలో దరఖాస్తు చేసుకోగా, అధికారులపై ఒత్తిడి తెచ్చి సర్టిఫికెట్‌ రాకుండా అడ్డుకున్నారు. బెదిరింపుల నేపథ్యంలో ఆయన విశాఖపట్నంలో తలదాచుకోవాల్సి వచ్చిందని వైఎస్సార్‌సీపీ నేతలు తెలిపారు. 

నార్పలలో మహిళా అభ్యర్థి పత్రాలు లాక్కుని 
అనంతపురం జిల్లా నార్పల మండలం బొందలవాడలో వైఎస్సార్‌సీపీ మద్దతు ఇస్తున్న సర్పంచ్‌ అభ్యర్థి భావన నామినేషన్‌ పత్రాలను టీడీపీ నేతలు చించివేశారు. వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడి చేసి పత్రాలను లాక్కెళ్లారు. మహిళా అభ్యర్థి పోటీలో నిలవకుండా అడ్డుకున్నారు. 

సోమలలో అభ్యర్థులపై దాడులు 
అన్నమయ్య జిల్లా సోమల మండలంలోని కందూరు, వల్లిగట్ల, కామిరెడ్డిగారిపల్లె పంచాయతీల్లో నామినేషన్లు వేయడానికి వెళ్లిన వైఎస్సార్‌సీపీ మద్దతుదారులపై టీడీపీ వర్గీయులు దాడికి దిగారు. సర్పంచ్‌ అభ్యర్థులు శ్రీకాంత్, బాలు చేతుల్లోని నామినేషన్‌ పత్రాలను లాక్కుని చించివేయడంతోపాటు వారిపై భౌతిక దాడి చేశారు. తమిళనాడు నుంచి కిరాయి గూండాలను తీసుకొచ్చి దాడులు చేయించారని బాధితులు ఆరోపించారు. ఈ ఘటనలో గాయపడిన బాలుని ఆస్పత్రికి తరలించారు. 

తిరుపతి జిల్లా కమ్మకండ్రిగలో జరిగిన దారుణాలను చెవిరెడ్డికి వివరిస్తున్న సర్పంచ్‌ అభ్యర్థులు 

శెట్టిపేటలో పోలీసు వాహనం ధ్వంసం 
అన్నమయ్య జిల్లా చౌడేపల్లె మండలం శెట్టిపేట, పుదిపట్ల నామినేషన్‌ కేంద్రాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. హైకోర్టు ఆదేశాల మేరకు వైఎస్సార్‌సీపీ మద్దతు ఇస్తున్న సర్పంచ్‌ అభ్యర్థులను పోలీసు వాహనంలో శెట్టిపేట కేంద్రానికి తీసుకెళ్తుండగా టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. వాహనం ముందు రోడ్డుపై బైఠాయించి, రాళ్లు, కట్టెలతో దాడి చేసి అద్దాలను పగులగొట్టారు. పోలీసులు లాఠీచార్జి చేశారు. అనంతరం కోర్టు ఉత్తర్వుల మేరకు పటిష్ట భద్రత మధ్య అభ్యర్థులతో నామినేషన్లు దాఖలు చేయించారు. ఏలూరు జిల్లా చింతలపూడి 19వ వార్డులో వైఎస్సార్‌సీపీ సభ్యుడు ఎండీ హాజీని కుల, మత పెద్దల ద్వారా ఒత్తిడికి గురిచేసి నామినేషన్‌ ఉపసంహరించుకునేలా చేశారు.  పుంగనూరు నియోజకవర్గంలోని రొంపిచెర్ల, పులిచెర్ల మండలాల్లో వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థులు, కుటుంబ సభ్యులపైనా బైండోవర్‌ కేసులు నమోదు చేశారు.  

             అన్నమయ్య జిల్లా శెట్టిపేట నామినేషన్‌ కేంద్రం వద్ద లాఠీచార్జి చేస్తున్న పోలీసులు 

బనగానపల్లెలో ఎంపీటీసీపై దాడి 
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం బెలుం గ్రామంలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ దూదేకుల దస్తగిరిపై టీడీపీ నాయకులు దాడి చేశారు. దస్తగిరి దుస్తులు చించివేసి, ఆయన కారును ధ్వంసం చేశారు. మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అండతోనే టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరోపించారు.

కమ్మకండ్రిగలో రెండు గంటల కాలయాపన
తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం కమ్మకండ్రిగలో వైఎస్సార్‌సీపీ మద్దతు సర్పంచ్‌ అభ్యర్థులు కాకర్ల రాజేంద్రనాయుడు, గుర్రాల శేఖర్‌ సాయంత్రం 3.30 గంటలకే నామినేషన్‌ కేంద్రానికి చేరుకుని టోకెన్లు తీసుకున్నారు. అయినా రిటర్నింగ్‌ అధికారి నామినేషన్లు స్వీకరించకుండా రెండు గంటలపాటు కాలయాపన చేశారని బాధితులు ఆరోపించారు. సమయం మించిపోయిందంటూ ఎస్‌ఐ పోలీసుల సాయంతో తమను బలవంతంగా బయటకు పంపించారని తెలిపారు. నామినేషన్‌ వేస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులను మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి  పరామర్శించి న్యాయపోరాటానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 

రౌతుసూరమాలలో అభ్యర్థి తలకు గాయం
తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం రౌతుసూరమాలలో సర్పంచ్‌ అభ్యర్థి నాగరాజుపై నామినేషన్‌ వేయడానికి వెళ్తున్న సమయంలో దాడి జరిగింది. దాడిలో ఆయన నామినేషన్‌ పత్రాలను చించివేయడంతోపాటు తల పగలగొట్టారు. జిల్లా అధ్యక్షుడు భూమన అభినయ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ఎంపీ మద్దిల గురుమూర్తి బాధితుడిని గురువారం పరామర్శించారు. ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. 

నంద్యాలలో మాజీ ఎమ్మెల్యే అడ్డగింత.. బైరెడ్డి గృహనిర్బంధం
నంద్యాల జిల్లాలో సున్నిపెంట పంచాయతీ నామినేషన్ల ప్రక్రియ కోసం వస్తున్న మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డిని శ్రీశైలంలోకి రానివ్వకుండా శిఖరేశ్వరం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఆత్మకూరు డీఎస్పీ రామాంజనేయులు, పోలీసులు ఆయనను బలవంతంగా కారులోకి ఎక్కించి నంద్యాలకు తరలించారు. దీంతో నామినేషన్లు వేయలేక అభ్యర్థులు ప్రక్రియను బహిష్కరించారు. కోవెలకుంట్ల మండలం భీముడుపాడు పంచాయతీ నామినేషన్‌ కేంద్రం వద్ద కొమ్మమల్ల ఒకటో వార్డు స్థానానికి నామినేషన్‌ వేయడానికి వచ్చిన హసన్‌ ఉసేన్‌పై దాడి జరిగింది. పాములపాడులో టీడీపీ నాయకులు కవ్వింపు చర్యలకు దిగారు. మరోవైపు నందికొట్కూరులో వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్‌ అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement