రూ.7 కోట్లో.. రూ.70 కోట్లో!? | Dharani Krishna releases another selfie video | Sakshi
Sakshi News home page

రూ.7 కోట్లో.. రూ.70 కోట్లో!?

Nov 20 2026 5:06 AM | Updated on Nov 20 2026 5:06 AM

Dharani Krishna releases another selfie video

నన్ను ముందుపెట్టి ఎంత తీసుకున్నారో!? 

ఈ కేసులో నన్ను బలిపశువును చేస్తున్నారు 

నా దగ్గరున్న ఆధారాలు బయటపెడతా 

36 మంది బాధితులతో కేసులు ఎందుకు పెట్టించలేదు 

నన్ను చంపేసి మొత్తం నాపై నెట్టాలని చూస్తున్నారు ..నాకు ప్రాణహాని ఉంది

జనసేన కీలక నేతలపై ‘రూ.7 కోట్ల డబ్బు వసూలు’ కేసులో నిందితురాలు ధరణి కృష్ణ మరో సెల్ఫీ వీడియో

సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగాలిప్పిస్తామంటూ బాధితుల నుంచి రూ.ఏడు కోట్లు వసూలు కేసులో తనను బలిపశువును చేస్తున్నారంటూ ఆ కేసులో నిందితురాలిగా పేర్కొంటున్న ధరణి కృష్ణ గురువారం జనసేన కీలక నాయకులపై తీవ్ర ఆరోపణలు చేస్తూ మరో సెల్ఫీ వీడియో విడుదల చేశారు. జనసేన పార్టీ ప్రోగ్రాం కమిటీ చైర్మన్, రాష్ట్ర పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కల్యాణం శివ శ్రీనివాసరావు (కేకే) బుధవారం మీడియా ద్వారా తన మీద చేసిన ఆరోపణలపై ధరణి కృష్ణ స్పందిస్తూ విడుదల చేసిన సెల్ఫీ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. అందులో తన తల్లికీ కొంత వివరణ ఇస్తూ ఏమన్నారంటే.. 

అమ్మా.. నేను ఏడు కోట్ల రూపాయలు స్కాం చేశానని మాట్లాడుతున్నారు. ఎవరిచ్చారు? ఎవరికి ఇచ్చారు? పోనీ నా అకౌంట్‌లో వేశారా? నా చేతికిచ్చారా.. ఈ కేకే, పెద్దిరాజు మధ్యలో ఉన్న ఆర్థిక సంబంధాలు బయటకురాకుండా నన్ను బలిపశువును చేశారు. నన్ను ముందుపెట్టి నిజంగా రూ.ఏడు కోట్లు తీసుకున్నారో లేక రూ.70 కోట్లు తీసుకున్నారో ఎవరికి తెలుసు? అన్నీ బయటకు వచ్చాక మొత్తం నా మీదకు తోసేశారు. అమ్మా.. కేకే నన్ను బతకనీయడు. నిజంగా చెబుతున్నా.. చచ్చిపోయేలోపు నా దగ్గర ఉన్న ఆధారాలన్నీ బయటపెడతా. నన్ను చంపేసినా చంపేయండి.. కానీ, దయచేసి అర్థం చేసుకోండి. నన్ను బలిపశువును చేస్తున్న కేకే లాంటి వారు ఏం చేస్తారో ఏమో నాకు తెలీయడంలేదమ్మా. ఎందుకంటే.. మనం చిన్నవాళ్లం. వాళ్లు పెద్దవాళ్లు కదా. పోలీసు శాఖ మొత్తం అతని చేతిలో ఉందన్నాడు. అందుకే అతను ఏమన్నా చేయగలడు. 

నిజాలన్నీ బయటకొస్తాయనే బాధితులతో కేసు పెట్టించలేదు.. 
నిజంగా 36 మంది బాధితులతో కేసులు ఎందుకు పెట్టించలేదు? విషయాలన్నీ బయటకొస్తాయనే వాళ్లతో కేసు పెట్టించకుండా జనసేన పార్టీలో ఉండే ఓ లాయర్‌తో కేసు పెట్టించారు. డ్యాష్‌బోర్డు, సర్వీసు రిజిస్టర్‌ లాంటివి కేకే ఇవ్వకపోతే  పెద్దిరాజుకు ఎలా తెలిశాయి? కేకే అనే వ్యక్తి పెద్దిరాజుతో కలిసి స్కాం చేశాడు. పోలీసు శాఖ తన చేతిలో ఉందని కేకే మూడ్రోజులు నరకం చూపించి, నా ప్రైవేట్‌ పార్ట్స్‌పై కూడా కొట్టించారు. నేను బయటకొస్తే విషయాలన్నీ బయటకొస్తాయని నన్ను బయటకు రానీయొద్దని పోలీసులకు చెప్పారు. నన్ను చంపేసి, నేను సూసైడ్‌ చేసుకున్నానని కూడా చిత్రీకరించమన్నారు. 

దాన్ని చంపేయండి.. బయటకు రాకూడదన్నారు.. 
మమ్మీ.. నాకు కేకేవల్ల ప్రాణ హాని ఉంది. గుంటూరులో ఒక పాడుపడిన కార్వర్ట్స్‌లో పెట్టి, వాళ్ల (పోలీసుల)కు ఫోనుచేసి ‘దానిని చంపేయండి. అది బయటకు రాకూడద’న్నారు. కేకే అనే అతను పెద్దిరాజును కాపాడడం కోసం నన్ను ఇరికించేయమని చెప్పాడు. పోలీసుస్టేషన్‌లో వాళ్లు రాసుకోవడానికి అని చెప్పడంతో నేను వీడియో స్టేట్‌మెంట్‌ ఒకటి ఇచ్చా. కానీ, కేకే ఏం చెబితే అదే రాశారు. 

జనసేనకు స్థానిక ఎన్నికల యాప్‌ డిజైన్‌ చేసిందీ నేనే.. 
జనసేన స్థానిక సంస్థల ఎన్నికల యాప్‌ను డిజైన్‌ చేసి, దాని వర్కు మొత్తం నేనే చేశా. నాకు 2021 నుంచి జనసేన సభ్య­త్వం ఉంది. 2023 నుంచి జనసేనకు వలంటీరుగా పని చేశా.

హరిప్రసాదెవరో తెలియదు.. 
నాకు హరిప్రసాద్, పవన్‌బాలాజీ, సుధీర్‌ అంటే ఎవరో తెలీదు. వాళ్ల పేర్లు చెప్పు నిన్ను వదిలేస్తామని చెప్పి పోలీసుస్టేషన్‌లో నన్ను కొట్టారు. ఎవరో సంబంధంలేని అబ్బాయిని తెచ్చి నా భర్త అని మాట్లాడుతున్నారు. ఇలాంటివన్నీ చూపించి నన్ను మోసం చేసే వ్యక్తిగా ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. నాకు రూ.తొమ్మిది లక్షలు ఇస్తున్నట్లు కేకే చెప్పారు. కానీ, ఇచ్చిందెవరో ఆయన చెప్పకపోయినా నేను చెబుతా. 

జనసేన నుంచి అనంతపురం మేయర్‌ సీటు ఆశించిన నేత. సోషల్‌ మీడియా సేవలతో పాటు వాట్సాప్‌లో బల్క్‌ మెసేజ్‌లు పంపడానికి, పొలిటికల్‌ ఎనలిస్టు సర్వీసెస్‌ కోసం నాకిచ్చిన డబ్బులవి. ఇక నేను రూ.కోటిన్నర పెట్టి ప్లాట్‌ కొన్నానని కొన్ని ఛానల్స్‌  ప్రసారం చేశాయి. నా పేరు మీద ఏ ఆస్తి ఉన్నా అందరి ముందు నేను ఉరేసుకుని చనిపోతా. లేదా ప్రభుత్వం ఏ శిక్షవేస్తే ఆ శిక్షకు సరే అంటా. ఎందుకీ తెలిసీతెలీని మాటలు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement