జనసేన ‘కోట’లో పొలి‘కేకే’! | Scandal surrounds the state office of janasena | Sakshi
Sakshi News home page

జనసేన ‘కోట’లో పొలి‘కేకే’!

Nov 20 2026 5:00 AM | Updated on Nov 20 2026 5:01 AM

Scandal surrounds the state office of janasena

అధినాయకత్వంలో ప్రకంపనలు 

రాష్ట్ర కార్యాలయం చుట్టూ ముసురుకున్న కుంభకోణం  

తీగ లాగితే డొంక కదులుతుందని అంటున్న సొంత పార్టీ నేతలు  

జనసేన కార్యాలయంలో కట్టప్పలు ఉన్నారంటున్న కేకే  

తనను అన్యాయంగా ఇరికించారని దళిత మహిళ ధరణి కృష్ణ ఆవేదన  

పెద్దల ఆదేశాలతో హడావుడిగా సీఐడీ హల్‌చల్‌

సాక్షి ప్రతినిధి, గుంటూరు: నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని సుమారు రూ.7 కోట్లు వసూలు చేసి మోసగించిన కేసు ఇప్పుడు జనసేన రాష్ట్ర కార్యాలయంలో ప్రకంపనలు సృష్టిస్తోంది.  కార్యాలయం చుట్టూ కుంభకోణ వివాదాలు ముసరడంతో ఎవరి పేర్లు బయటకు వస్తాయోనని అధినాయకత్వం వెన్నులో వణుకుపుట్టినట్టు సమాచారం. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బాధితులు ఎవరూ ఫిర్యాదు చేయనప్పటికీ జనసేన పార్టీలో కీలకంగా ఉన్న కోట రుక్మిణి, కల్యాణం శివశ్రీనివాస్‌(కేకే)లు హడావుడిగా వెనువెంటనే ఫిర్యాదు చేయడం, ఆ వెంటనే కార్యాలయంలో పనిచేసే ధరణి కృష్ణను పోలీసులు తీసుకెళ్లి థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడం, దీనిపై ఆమె సెల్ఫీ వీడియోలు విడుదల చేయడం తీవ్ర సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. 

అసలు బాధితులు ఎవరూ బయటకు రాక ముందే తమ పేర్లు ఎక్కడ బయటపడతాయోననే భయంతోనే కార్యాలయంలోని నాయకులు ముందుగా ఫిర్యాదులుచేసి దళిత మహిళ ధరణి కృష్ణను బలిపశువును చేశారనే ఆరోపణలు వినవస్తున్నాయి. పోలీసులు ఆమెను అక్రమంగా నిర్బంధించి థర్డ్‌ డిగ్రీ ప్రయోగించి, ప్రైవేటు పార్ట్‌లపై హింసించారని ఆమె ఆవేదన వ్యక్తంచేయడం చూస్తుంటే ఈ మొత్తం వ్యవహారం వెనుక కూటమిలోని పెద్ద తలకాయలు ఉన్నారనేది స్పష్టమవుతోంది.  

అసంబద్ధంగా పోలీసు దర్యాప్తు  
జనసేనలోని కీలక నేతల ఫిర్యాదుతో కేసులు నమోదు చేసిన పోలీసుల దర్యాప్తు ఆదినుంచి అసంబద్ధంగా సాగడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. బాధితులెవరినీ విచారణ చేయకుండానే దళిత మహిళ ధరణి కృష్ణను నిర్బంధించి తప్పు ఒప్పుకోవాలని థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడం వెనుక కూటమి సర్కారులోని కీలక వ్యక్తుల ఒత్తిడి ఉందని స్పష్టమవుతోంది.  అసలు సూత్రధారులను తప్పించే కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతోందని, ఇదో పెద్ద గూడు పుఠాణి అనే వాదన వినిపిస్తోంది. ఇదిలా ఉంటే మంగళగిరి రూరల్‌ పోలీసులతోపాటు జనసేన ముఖ్య నేతలు కోట రుక్మిణి, కేకేల తీరుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈ కేసును హడావుడిగా సీఐడీకి అప్పగించడం వెనుక ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.  

బాధితుల్లేకుండానే హడావుడిగా అరెస్ట్‌లు  
ఈ కేసు బాధ్యతలు తీసకున్న సీఐడీ అధికారులు వెంటనే రంగంలోకి దిగి హల్‌చల్‌ చేస్తున్నారు. ఒక్కరోజులోనే హడావుడిగా కేసు నమోదు, అరెస్టులకు సిద్ధపడుతున్నారు. ఈ కేసులో బాధితులు ఎవరనేది గుర్తించకుండానే, వారి నుంచి ఫిర్యాదులు తీసుకోకుండానే, అసలు విచారణ చేయకుండానే నిందితులెవరనేది తేల్చేసి అరెస్టులకు యత్నించడం అందరినీ విస్మయపరుస్తోంది. కేవలం జనసేన కీలక నేతల ఫిర్యాదుల ఆధారంగానే ముందుకెళ్లడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. పెద్దస్థాయి వ్యక్తుల ఒత్తిడి లేకపోతే సీఐడీ ఇలా తొందరపాటు చర్యలకు ఎందుకు దిగుతుందన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దళిత మహిళ ధరణి కృష్ణనే బలిపశువును చేసి ఆమెను అరెస్టు చేసేందుకు యత్నిస్తుండడం.. అసలు సూత్రధారులను తప్పించే కుట్ర కోణాన్ని బట్టబయలు చేస్తోంది.

కేకే వ్యాఖ్యల దుమారం  
ఇదిలా ఉంటే బుధవారం హడావుడిగా మీడియా సమావేశం నిర్వహించిన జనసేన కీలక నేత కల్యాణం శివ శ్రీనివాస్‌ (కేకే) జనసేన కార్యాలయంలోనే కట్టప్పలు ఉన్నారంటూ వ్యాఖ్యానించడం తీవ్ర దుమారాన్ని రేపింది. జనసేన ప్రధాన కార్యాలయంలోనే లుకలుకలను, ఆధిపత్యపోరును బట్టబయలు చేసింది. ఈ నేపథ్యంలోనే రూ.ఏడుకోట్ల స్కాం జనసేన కార్యాలయం చుట్టూనే తిరుగుతోందనే వాదన వినిపిస్తోంది.   

ఆచూకీ తెలియజేయాలట..! 
ఆఖరికి ఈ కేసులో నిమ్మకాయల పెద్దిరాజు, బోడపాటి ధరణి కృష్ణ, మరి కొందరిపై సీఐడీ కేసు నమోదు చేసింది. పెద్దిరాజును అరెస్టు చేసినట్లు సీఐడీ గుంటూరు ప్రాంతీయ కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో విడుదల చేసింది. బోడపాటి ధరణికృష్ణ, కొందరు పరారీలో ఉన్నారని తెలిపింది. వారి ఆచూకీ కోసం సీఐడీ పోలీస్‌ అధికారులతో రెండు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement