నేడు గోపాల్‌పూర్ వద్ద తీరం దాటే అవకాశం
శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు
కృష్ణా, గుంటూరు, దక్షిణ కోస్తా, రాయలసీమలో తేలికపాటి జల్లులు
సాక్షి, అమరావతి: తీవ్ర తుపాను ఆక్వాన్ ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు దూసుకువస్తోంది. వాతావరణ శాఖ అంచనా మేరకు ఆక్వాన్ తీవ్ర తుపాను శుక్రవారం మధ్యాహ్నం ఒడిశాలోని గోపాల్‌పూర్ వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలావుండగా తుపాను శుక్రవారం తెల్లవారుజామునే శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు–ఒడిశాలోని ఉదయగిరి మధ్య తీరం దాటుతుందని ఆర్టీజీఎస్ తెలిపింది. కాగా.. గురువారం సాయంత్రానికి ఇది కళింగపటా్ననికి 270 కి.మీ, గోపాల్‌పూర్‌కు 350 కి.మీ. దూరంలో ఉంది.
గంటకు 13 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తీరం దాటిన తర్వాత తుపాను శుక్రవారం సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా, శనివారం ఉదయానికి అల్పపీడనంగా బలహీనపడుతుందని వాతావరణశాఖ తెలిపింది. తుపాను కేంద్ర వలయం సముద్రంపై శ్రీకాకుళానికి ఎదురుగా ప్రయాణిస్తుండటంతో ఈ ప్రాంతంలో కుండపోతకు అవకాశం ఉంది. శుక్రవారం విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాలు, యానాంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కోనసీమ, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
మిగిలిన దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులే పడతాయని పేర్కొంది. తొలుత కోస్తా అంతటా ప్రభావం ఉంటుందని అంచనా వేసినా తుపాను దిశ మార్చుకుని ఒడిశా వైపు వెళ్లడంతో దక్షిణ కోస్తా జిల్లాలు ముప్పు నుంచి తప్పించుకున్నాయి. తుపానుగా బలపడినప్పుడు నెల్లూరు–తుని మధ్య తీరం దాటుతుందని అంచనా వేశారు. తర్వాత అది మచిలీపట్నం–పూరి, ఇప్పుడు నరసాపురం–పూరి మధ్య తీరం దాటనుంది. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్న అంచనా కూడా వంద కిలోమీటర్లకు తగ్గింది.


