ఏపీపీఎస్సీ లెక్కలేనితనం | APPSC is issuing notifications without even having an understanding of the revised syllabus | Sakshi
Sakshi News home page

ఏపీపీఎస్సీ లెక్కలేనితనం

Nov 20 2026 5:42 AM | Updated on Nov 20 2026 5:42 AM

APPSC is issuing notifications without even having an understanding of the revised syllabus

అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌లో మారిన విద్యా విధానాలపై అవగాహన లేకుండా నిబంధనలు 

అభ్యర్థులను గందరగోళంలోకి నెడుతూ చర్యలు 

సెమిస్టర్‌ విధానం అమలు చేస్తున్న ఉన్నత విద్యాశాఖ 

దీనిని పట్టించుకోని సర్వీస్‌ కమిషన్‌  

సెమిస్టర్‌ విధానంలో చదివిన వారికి అన్యాయం

సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కనీస జాగ్రత్తలు పాటించకుండా, మారిన సిలబస్‌పై అవగాహన కూడా లేకుండా నోటిఫికేషన్లు ఇస్తోంది. ప్రకటించే పోస్టులకు ఏ తరహా కోర్సులు చేసిన వారు అర్హులో కూడా తెలియని పరిస్థితిని సృష్టించి అభ్యర్థులను గందరగోళంలోకి నెట్టింది. గత నెలలో 196 అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ (ఏఎస్‌వో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చిన కమిషన్‌.. పరీక్షలో ఇచ్చిన స్టాటిస్టిక్స్‌ సిలబస్, కోర్సు పూర్తిచేసిన విధానంపై సరైన స్పష్టత లేకుండా దరఖాస్తులు ఆహ్వానించింది. 

రాష్ట్రంలో ఉన్నత విద్యాశాఖ సెమిస్టర్‌ విధానం అమలు చేస్తున్నా, ఏపీపీఎస్సీ మాత్రం పాతకాలపు జీవోల ఆధారంగా ఇంకా వార్షిక సిలబస్‌ ప్రకారం.. పోస్టుల సిలబస్‌ను రూపొందించింది. దీనిపై వచ్చిన అభ్యర్థనలు, అనుమానాలను సైతం నివృత్తి చేయకుండా ముందుకెళ్లింది. దీనిపై సర్వత్రా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

అంతా మా ఇష్టం
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలను సర్వీస్‌ కమిషన్‌ ద్వారా భర్తీ చేస్తారు. చాలా ఉద్యోగాలకు డిగ్రీ కనీస అర్హతగా ఉంటుంది. ఈ కోర్సు ఆధారంగానే పోటీ పరీక్షల సిలబస్‌ రూపొందించి నోటిఫికేషన్లు ఇస్తారు. ఈ క్రమంలో పరీక్షలకు నిర్దేశించిన సిలబస్‌ అంశంలో ఏమైనా మార్పులు, చేర్పులు జరిగాయా లేదా అన్న విషయాన్ని ఉన్నత విద్య విభాగాన్ని సంప్రదించి అందుకు అనుగుణంగా నోటిఫికేషన్‌లో మార్పులు చేయాలి. అలాగే, ఉద్యోగులను నియమించుకునే ఆయా శాఖల అభిప్రాయం కూడా తీసుకోవాలి. కానీ, ఈ ఏడాది 196 ఏఎస్‌వో పోస్టుల భర్తీకి సెప్టెంబర్‌లో షార్ట్‌ నోటిఫికేషన్, అక్టోబర్‌లో వివరణాత్మక నోటిఫికేషన్‌ను కమిషన్‌ అధికారులు విడుదల చేశారు. 

అయితే, పరీక్షకు నిర్ణయించిన సిలబస్‌ విషయంలో ఉన్నత విద్యాశాఖ అధికారులను సంప్రదించలేదు. అలాగే, ఉద్యోగులను తీసుకునే ఆంధ్రప్రదేశ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌ డైరెక్టరేట్‌ నుంచి కూడా స్పష్టత తీసుకోకుండా 2012 నాటి విధానాలనే అనుసరించారు. వాస్తవానికి రాష్ట్రంలో 2015లో డిగ్రీ కోర్సుల్లో సిలబస్‌ సవరించి, వార్షిక పరీక్షల స్థానంలో సెమిస్టర్‌ విధానం ప్రవేశపెట్టారు. దీంతో చాలా సబ్జెక్టుల్లో వార్షిక సిలబస్‌ మొత్తం ఒకే సెమిస్టర్‌లో చేర్చారు  దీనికి అనుగుణంగా పోటీ పరీక్షల సిలబస్‌ కూడా ఉండాలి. కానీ, ప్రస్తుత ఏఎస్‌వో నోటిఫికేషన్‌లో ‘ఏడాది’ కోర్సు తప్పనిసరి అని ప్రకటించడంతో అభ్యర్థులు గందరగోళంలో పడ్డారు. 

గత నోటిఫికేషన్లలో ‘సెమిస్టర్‌’కు అవకాశం 
నోటిఫికేషన్‌ 03/2019, 12/2024లో బీకామ్‌లో ‘ఎలిమెంట్స్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్, బిజినెస్‌ స్టాటిస్టిక్స్, అలాగే, బీకామ్‌/బీఏలో ‘క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌’ వంటి పేపర్లను ఒక సంవత్సరం లేదా చివరి సంవత్సరంలో చదివిన వారిని అర్హులుగా పరిగణించారు. 2024 నోటిఫికేషన్‌లో బీటెక్‌–కంప్యూటర్‌ సైన్స్‌లో రెండో సంవత్సరం మొదటి సెమిస్టర్‌లో మాత్రమే ‘ప్రోబబిలిటీ అండ్‌ స్టాటిస్టిక్స్‌’ చదివిన అభ్యర్థిని కమిషన్‌ అర్హులుగా ప్రకటించింది. 2024లో అర్హతగా పరిగణించిన విద్యార్హతను, నిబంధనల్లో ఎలాంటి మార్పు లేకుండా తాజా నోటిఫికేషన్‌లో అనర్హతగా ప్రకటించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. 

కమిషన్‌ మౌనంపై అభ్యర్థుల్లో ఆందోళన
» అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ పోస్టులకు సంబంధించి సెమిస్టర్‌ విధానంలో ఒక సెమిస్టర్‌లో ‘స్టాటిస్టిక్స్‌’ పేపర్‌ చదివిన అభ్యర్థుల అర్హతపై నెలకొన్న సందేహాలను నివృత్తి చేయాలని నెలరోజులుగా కమిషన్‌ను అభ్యర్థులు కోరుతున్నా ఎలాంటి స్పష్టతా ఇవ్వడం లేదు. 
» 2012లో జారీ చేసిన జీవో నం.3 ప్రకారం, ఏఎస్‌వో పోస్టుకు దరఖాస్తు చేయాలంటే డిగ్రీలో కామర్స్, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్‌ లేదా కంప్యూటర్‌ సైన్స్‌ ప్రధాన సబ్జెక్టుతో పాటు ఒక సంవత్సరం, రెండు సంవత్సరాలు లేదా మూడు సంవత్సరాలలో స్టాటిస్టిక్స్‌ ‘ఒక పేపర్‌’గా చదివి ఉండాలని నిర్దేశించారు. అప్పటి వార్షిక పరీక్షల విధానానికి అనుగుణంగా ఈ నిబంధన పెట్టారు. 
»  కానీ 2015–16 విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలు సెమిస్టర్‌ విధానంలోకి మారాయి. దీనివల్ల గతంలో ఒక సంవత్సరం పాటు బోధించే స్టాటిస్టిక్స్‌ సిలబస్‌ను, ఇప్పుడు సిలబస్‌లో ఎలాంటి మార్పు లేకుండా ఒకే సెమిస్టర్‌లో ఒక పేపర్‌గా బోధిస్తున్నారు. కానీ, తాజా నోటిఫికేషన్‌లో స్టాటిస్టిక్స్‌ సబ్జెక్టును ‘ఒక సంవత్సరం లేదా రెండు సంవత్సరాలు లేదా మూడు సంవత్సరాలు’ చదివి ఉండాలని పేర్కొన్నారు. ఎక్కడా సెమిస్టర్‌’ అనే ప్రస్తావన లేదు.  
» 2019, 2024లో ఇచ్చిన ఏఎస్‌వో పోస్టుల భర్తీలో సర్వీస్‌ కమిషన్‌ సెమిస్టర్‌/ఒక పేపర్‌ అభ్యర్థులను అనుమతించింది. 
»  తాజా నోటిఫికేషన్‌ ప్రకటించిన 196 పోస్టులకు 2015కి ముందు ఆయా కోర్సుల్లో డిగ్రీలు పూర్తిచేసినవారు అర్హులా?.. తర్వాత సెమిస్టర్‌ విధానంలో చదివినవారు అనర్హులా?అనేదానిపై ప్రతిష్టంభన నెలకొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement