కరువులో కల్పతరువు ‘తుమ్మచెట్టు’ | sagubadi: Benefits of the Acacia Tree During Drought | Sakshi
Sakshi News home page

కరువులో కల్పతరువు ‘తుమ్మచెట్టు’

Nov 24 2026 3:39 PM | Updated on Nov 24 2026 3:39 PM

sagubadi: Benefits of the Acacia Tree During Drought

కోతులు ఎక్కుతున్నాయని పల్లెల్లో వేప సహా అన్ని చెట్లూ కొట్టేస్తున్నారు వానరాలకు ఆవాసం కానిది... బహుళ ప్రయోజనాలిచ్చేది తుమ్మ చెట్టు గొర్రెలు, మేకలకు కరువు కాలంలో మేతను అందించటంలో తుమ్మ చెట్లదే కీలకపాత్ర వేసవిలో కొమ్మలు నరుక్కున్నందుకు ఒక్కో తుమ్మ చెట్టుకు రూ. వెయ్యి చెల్లిస్తున్న గొర్రెలు, మేకల పెంపకందారులు తుమ్మ చెట్లు పొలంలో పెంచితే మెట్ట రైతులకు ఖర్చు లేని ఆదాయం ఎకరానికి 40 చెట్లు పెంచుకుంటే మెట్ట రైతులకు ఎకరానికి రూ. 40 వేల ఆదాయం జాతీయ జీవవైవిధ్య ప్రాధికార సంస్థ మాజీ చైర్మన్‌ చిర్ర అచలేందర్‌ రెడ్డితో ‘సాక్షి సాగుబడి’ ప్రత్యేక ఇంటర్వ్యూ...

తెలంగాణతో పాటు దక్కన్‌ పీఠభూమి ప్రాంతంలోని మెట్ట సేద్య భూముల్లో సాగు స్వరూపం మారి΄ోయింది. ఒకప్పుడు పశుసంపద ఆధారిత ఆర్థిక వ్యవస్థగా వెలుగొందిన గ్రామీణ ప్రాంతాల్లో, నీటి వసతి పెరగడంతో వరి సాగు విస్తరించింది. మరోవైపు, కోతుల బెడద విపరీతంగా పెరిగి΄ోవడంతో పంటలను కాపాడుకునేందుకు రైతులు పొలాల్లో ఉన్న వేప, కానుగ, ఇతరత్రా చెట్లన్నింటినీ నరికేస్తున్నారు. 

ఈ పరిణామం రాబోయే రోజుల్లో పెను పర్యావరణ విపత్తుకు దారితీయడమే కాకుండా, ఎల్‌ నినో వంటి తీవ్ర కరువు పరిస్థితులు ఎదురైనప్పుడు గొర్రెలు, మేకలకు ఎండుమేత కూడా కరువయ్యే పెను ప్రమాదాన్ని తెచ్చిపెడుతోంది. ఈ బహుముఖ సంక్షోభాలకు జాతీయ జీవవైవిధ్య ప్రాధికార సంస్థ (ఎన్‌బీఏ) పూర్వ అధ్యక్షులు, విశ్రాంత అటవీ శాఖ ఉన్నతాధికారి (ఐఎఫ్‌ఎస్‌) చిర్ర అచలేందర్‌ రెడ్డి ఒక వినూత్న, ఆచరణాత్మక పరిష్కారాన్ని సూచిస్తున్నారు. తీవ్రమైన ఎల్‌నినో నేపథ్యంలో కోతుల సమస్యతో చెట్ల నరికివేత, మేత లేక జీవాల ఇక్కట్లు, మెట్ట రైతులు, గొర్రెలు, మేకల పెంపకందారుల జీవనోపాధి, నాణ్యమైన ప్రోటీన్‌ ఆహార లభ్యత తదితర అంశాలపై ఆయన తన అభిప్రాయాలు చెప్పారు.. 

ఏమన్నారంటే..?  
తుమ్మ చెట్లతోనే జీవాలకు జవజీవాలు తీవ్ర వర్షాభావ పరిస్థితులు, కరువు కాటకాలు, తీవ్ర ఎల్‌నినో ఏర్పడినప్పుడు వేసవిలో నేలపై గడ్డి కూడా దొరకదు. అలాంటి విపత్కర పరిస్థితుల్లో గొర్రెలు, మేకల వంటి జీవాలను ఆకులు, కాయలను అందించి కాపాడేది కేవలం బంజర్లలో పెరిగే తుమ్మ చెట్లు మాత్రమేనని అచలేందర్‌ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. ముళ్లు ఉండటం వల్ల కోతులు తుమ్మ చెట్ల జోలికి వెళ్లవు. పైగా కరువును తట్టుకుని నిలబడే శక్తి ఈ చెట్లకు పుష్కలంగా ఉంటుంది కాబట్టి తీవ్ర ఎల్‌నినో పరిస్థితుల్లోనూ బతుకుతాయి. 

చెట్టుకు రూ. వెయ్యి
సొంత ఊరైన జనగామ జిల్లా ఎర్రగొల్లపహాడ్‌లోని తమ ఆరు ఎకరాల పొలంలో జరిగిన అనుభవాన్ని ఆయన ఉదాహరణగా వివరించారు. మిగతా చెట్లన్నీ కోతుల భయంతో కొట్టేసినా, అక్కడ మిగిలిన పది తుమ్మ చెట్లను గొర్రెల కాపర్లు ఏటా వేసవిలో ఒక్కో చెట్టుకు రూ. 1,000 చొప్పున కొనుగోలు చేసి, కొమ్మలు కత్తిరించి తమ జీవాలకు మేతగా వేస్తున్నారని తెలిపారు. 

తమ చెలకను పాలికి చేసే రైతులు తమ పొలంలోని వేప, కానుగ, ఊడుగ తదితర చెట్లన్నిటినీ కోతుల భయంతో నరికేశారని ఆయన చెప్పారు. బొగ్గు కోసం తుమ్మ చెట్లను కూడా చాలా వరకు కొట్టేస్తున్నా తమ చెలకలోని తుమ్మ చెట్లను మాత్రం 86 ఏళ్ల వయసులోనూ ఊళ్లోనే ఉంటున్న తన తల్లి మాత్రం తుమ్మ చెట్లను నరకనివ్వలేదు. అయితే, విద్యుత్‌ లైన్‌కు దారివ్వటం కోసం 4 చెట్లు కొట్టేశామన్నారు.     

ఎకరానికి 40 చెట్లు.. రూ. 40 వేలు
మెట్ట భూములు కలిగిన రైతులు తమ పొలాల్లో వేరే తోటలు, పంటలకు కౌలుకు ఇచ్చేదానికి బదులు.. ఎకరానికి సగటున 40 తుమ్మ చెట్లను పెంచుకుంటే కరువు కాలంలో తమనే కాకుండా జీవాల పెంపకందారులనూ ఆదుకుంటాయని అచలేందర్‌ రెడ్డి ప్రతిపాదిస్తున్నారు. విత్తనాల ద్వారా పెరిగే తుమ్మ చెట్లు మొదటి 6–7 ఏళ్ల తర్వాత పూర్తిస్థాయిలో జీవాల గ్రాసానికి అందుబాటులోకి వస్తాయి. 

ఎటువంటి ఎరువులు, పురుగుమందులు, నీటి తడుల ఖర్చు ఉండదు. ఏటా ఒక్కో చెట్టు ద్వారా రూ. 1,000 చొప్పున, ఎకరానికి రూ. 40,000 నికరాదాయం లభిస్తుంది. గొర్రెల కాపర్లు చెట్టును పూర్తిగా నరకరు. కేవలం కొమ్మలను మాత్రమే కత్తిరించి (ప్రూనింగ్‌) మేతగా వాడుకుంటారు కాబట్టి, చెట్టు మళ్లీ చిగురించి రైతుకు ఏటా ఆదాయాన్ని ఇస్తూనే ఉంటుంది.  

అంతర పంటలు...
ప్రధానంగా పశువుల మేతనిచ్చే తుమ్మ చెట్లతో కూడిన ఆగ్రోఫారెస్ట్రీ నమూనా సాగు క్షేత్రం అంతర పంటల సాగుకు అనువుగా ఉంటుంది. తుమ్మ చెట్ల ఆకులు చాలా చిన్నవిగా ఉంటాయి, కొమ్మలు కూడా దట్టంగా అల్లుకు΄ోవు. దీనివల్ల సూర్యరశ్మి చాలా వరకు నేలపైకి ప్రసరిస్తుంది. కాబట్టి, ఈ చెట్ల కింద నీడ పడి పంటలు దెబ్బతింటాయన్న భయం రైతులకు అవసరం లేదని అచలేందర్‌రెడ్డి అంటున్నారు. 

వేసవిలో, శీతాకాలంలో వీటి కింద గడ్డి జాతులు, కూరగాయలు, తీగజాతి పంటలు, దుంపలు వంటి అంతర పంటలను సాగు చేసుకోవచ్చు. దీనివల్ల రైతుకు రెండు విధాలా ఆదాయం సమకూరుతుంది. తుమ్మ చెట్లు వేగంగా పెరగాలంటే భూసారం పెంపుదల, నీటి సంరక్షణ చర్యలు తీసుకోవాలి. 

అందరికీ ప్రయోజనం
తుమ్మ చెట్లతో కూడిన ఆగ్రోఫారెస్ట్రీ తోటల పెంపకం వల్ల సమాజంలోని అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని అచలేందర్‌ రెడ్డి విశ్లేషిస్తున్నారు.  

రైతులకు: పెట్టుబడి లేకుండా అదనపు నికరాదాయం వస్తుంది, నేల సారం పెరుగుతుంది.   
పశుపోషకులకు: కరువు కాలంలోనూ నాణ్యమైన పచ్చిమేత (ఆకులు, కాయలు) అందుబాటులో ఉండటం వల్ల జీవాల మరణాలు తగ్గి, వాటి బరువు పెరుగుతుంది.   
వినియోగదారులకు: నాణ్యమైన ప్రోటీన్‌ ఆహారమైన మాంసం తగినంతగా లభిస్తుంది.   
పర్యావరణానికి: ట్రీస్‌ అవుట్‌సైడ్‌ ఫారెస్ట్‌ పెరిగి, పర్యావరణ సమతుల్యత చూకూరుతుంది. నరికిన తుమ్మ కొమ్మలకున్న ఆకులను గొర్రెలు, మేకలు తిన్న తర్వాత కొమ్మలను బొగ్గు లేదా బయోచార్‌ తయారీకి వాడొచ్చు. యంత్రంతో చిన్న ముక్కలు చేసి పండ్ల తోటల్లో పాదుల చుట్టూ ఆచ్ఛాదనగా వెయ్యొచ్చు.

‘ప్రభుత్వం ప్రోత్సహిస్తే రైతులు ముందుకొస్తారు’
తుమ్మ చెట్లతో కూడిన ఆగ్రోఫారెస్ట్రీ సాగుపై ఆసక్తి గల రైతులకు అటవీ శాఖ ద్వారా 6 అడుగుల ఎత్తుండే తుమ్మ మొక్కలను పెద్ద బ్యాగులలో ఉచితంగా సరఫరా చేసి తుమ్మ తోటల పెంపకాన్ని ప్రోత్సహించాలని అచలేందర్‌ రెడ్డి సూచించారు. మండలానికి రెండు, మూడు గ్రామాల్లో రైతుల పొలాల్లోనే ప్రదర్శనా క్షేత్రాల (మోడల్‌ ΄్లాంటేషన్ల)ను అభివృద్ధి చేయాలన్నారు. రైతులకు కళ్లముందే ప్రయోగాత్మకంగా చూపితేనే ఈ విధానంపై నమ్మకం కలిగి రైతులు ముందుకొస్తారని, తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

రైతులకు కలిగే ఆర్థిక లాభాల లెక్క (ఎకరానికి)

నాటాల్సిన చెట్లు: 40 తుమ్మ చెట్లు. విత్తనాల ద్వారా పెంచినవి ఉత్తమం 

నిర్వహణ ఖర్చు: సున్నా. ఎరువులు, పురుగుమందులు,

ప్రత్యేక నీటి వసతి అవసరం లేదు 

ఆదాయం ప్రారంరంభం: 
నాటిన 6 – 7 సంవత్సరాల తర్వాత నుంచి 

వార్షిక ఆదాయం: 
ఒక్కో చెట్టుకు రూ. 1,000 చొప్పున ఏటా రూ. 40,000 నికర ఆదాయం 

అదనపు లాభం: చెట్ల మధ్యలో పశుగ్రాస పంటలు, కూరగాయలు, చిక్కుడు, దుంప జాతి పంటల
సాగు ద్వారా అదనపు రాబడి వస్తుందన్నారు  

తుమ్మ చెట్టు ప్రత్యేకతలు
కోతుల బెడద ఉండదు: చెట్టు కొమ్మలకు నిండా ముళ్లు ఉండటం వల్ల కోతులు చెట్టు ఎక్కలేవు. పంటలకు నష్టం వాటిల్లదు.   

కరువును తట్టుకునే శక్తి: ఎల్‌నినో వంటి తీవ్ర కరువులోనూ పచ్చగా ఉండి మేకలు, గొర్రెలకు బలవర్ధకమైన ఆకులు, కాయలను ఇస్తుంది.   

నిరంతర పెరుగుదల: కొమ్మలను నరికిన  (ప్రూనింగ్‌) కొద్దీ మరుసటి ఏడాదికి మళ్లీ ఏపుగా పెరుగుతుంది.  

నీడ సమస్య లేదు: ఆకులు చిన్నవిగా ఉండటం వల్ల సూర్యరశ్మి నేలకు తాకి, కింద వేసే అంతర పంటలకు ఎటువంటి ఆటంకం కలగదు.

జ్ఞానం కంటే.. సాంప్రదాయ విజ్ఞానమే మిన్న!
‘86 ఏళ్ల మా అమ్మలాంటి గ్రామీణులలో ఉన్న అపారమైన సాంప్రదాయ విజ్ఞానం, యూపీఎస్సీ పరీక్ష పాసై విధానాలు రూపొందించే నావంటి ఉన్నతోద్యోగుల్లో లోపించింది. మాది ఎక్కువ శాతం పుస్తక జ్ఞానం మాత్రమే’ అని అచలేందర్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. బొగ్గు కోసం తమ ఆరు ఎకరాల పొలంలోని తుమ్మ చెట్లను నరికివేయకుండా తల్లి కాపాడుకోవటం వల్లే, అవి నేడు ఎండకాలంలో గొర్రెలకు, మేకలకు ఆధారంగా మారాయని ఆయన వివరించారు. 

మన దేశ జీవవైవిధ్య చట్టం ప్రకారం జీవవైవిధ్య రంగంలో జీవ వనరులు ఎంత ముఖ్యమో సంప్రదాయ విజ్ఞానం కూడా అంతే ముఖ్యం. అందువల్ల, గ్రామీణ సంక్షోభాల పరిష్కారానికి అటవీ, వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోబోయే ముందు రైతులను సంప్రదించి ఆచరణాత్మక వ్యూహాలను రూపొందించాలన్నారు. రైతుల క్షేత్రస్థాయి అనుభవాలను, సాంప్రదాయ జ్ఞానాన్ని విధాన రూపకల్పనలో భాగం చేసినప్పుడే గ్రామీణ సమస్యలకు సరైన, ఆచరణాత్మక పరిష్కారాలు లభిస్తాయని అచలేందర్‌ రెడ్డి స్పష్టం చేశారు. chal.reddy@gmail.com
చిర్ర అచలేందర్‌ రెడ్డి, 
ఎన్‌బీఏ మాజీ చైర్మన్‌  

ఇదీ చదవండి:  నక్కెర పండుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement