ఉల్లిపాయ తొక్కల ద్రావణం | Sagubadi: Onion Peels Benefits For Plants | Sakshi
Sakshi News home page

ఉల్లిపాయ తొక్కల ద్రావణం

Nov 20 2026 10:07 AM | Updated on Nov 20 2026 10:08 AM

Sagubadi: Onion Peels Benefits For Plants

మిద్దె/పెరటి తోటల్లో  మొక్కల పెంపకానికి ఉల్లిపాయ తొక్కల ద్రావణం ఒక అద్భుతమైన, ఉచితంగా దొరికే సేంద్రీయ ఎరువు.

1. ఉల్లిపాయ ద్రావణం మొక్కలకు మేలు చేయటమే కాకుండా తెగుళ్ల నివారిణిగా కూడా పనిచేస్తుంది. ఇందులో పొటాషియం, కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, కాపర్‌ పుష్కలంగా ఉంటాయి. పొటాషియం మొక్కల వేర్లను బలోపేతం చేస్తుంది. పూలు, పండ్లు ఎక్కువగా పూయడానికి సహాయపడుతుంది.

2. ఉల్లిపాయలోని ఘాటైన వాసన సహజ కీటక సంహారిణిగా పనిచేస్తుంది. పేనుబంక, నల్లి వంటి పురుగులను రానివ్వదు. మొక్కలకు రోగ నిరోధక శక్తిని పెంచి, వాతావరణ మార్పులను తట్టుకునేలా చేస్తుంది.

3. ఒక లీటరు నీటిలో ఒక గుప్పెడు లేదా రెండు గుప్పెళ్ల ఉల్లిపాయ తొక్కలను ఒక పాత్ర లో వేసి పాత్రపై మూత పెట్టి, నీడ గల ప్రదేశంలో 24 నుంచి 48 గంటల పాటు నానబెట్టాలి. నీరు ముదురు రంగులోకి టీ డికాషన్‌ లాగా మారిన తర్వాత, తొక్కలను వడకట్టాలి. వడకట్టిన ఉల్లిపాయ ద్రావణానికి సమాన పరిమాణంలో సాధారణ నీటిని 1:1 నిష్పత్తి లో కలిపి ఈ మిశ్రమాన్ని నేరుగా మొక్కల మొదళ్లలో మట్టిలో ΄ోయవచ్చు. ఈ ద్రావణాన్ని స్ప్రే బాటిల్‌లో పోసి, ఆకులపై, కాండంపై స్ప్రే చేస్తే కీటకాలను దూరం చేస్తుంది.

4. మిద్దె తోటలోని మొక్కలకు 15 రోజులకు ఒకసారి ఈ ద్రావణాన్ని ఇస్తే సరి΄ోతుంది. ఉల్లిపాయ ద్రావణంలో సల్ఫర్‌ ఉంటుంది. ఉల్లిపాయలు భూమిలో పెరిగేటప్పుడు నేల నుంచి సల్ఫర్‌ను ఎక్కువగా గ్రహిస్తాయి. అందువల్ల ఉల్లిపాయతోపాటు దాని తొక్కల్లో కూడా సల్ఫర్‌ లక్షణాలు సహజంగానే ఉంటాయి.

5. ఉల్లిపాయ ద్రావణానికి ఉండే ఘాటైన వాసనకు కారణం ఈ సల్ఫరే. ఈ వాసన వల్ల మొక్కలకు పట్టే తెగుళ్లు, గులాబీ మొక్కలకు వచ్చే నల్లి, పేనుబంక, తెల్ల దోమలు, పిండినల్లి వంటి కీటకాలు మొక్కల దరిచేరవు.

6. సల్ఫర్‌కు సహజంగానే ఫంగస్, కీటకాలను తట్టుకునే శక్తి ఉంది. ఇది మొక్కలకు వచ్చే బూజు తెగులు (పౌడరీ మిల్‌డ్యూ), తుప్పు తెగులు (రస్ట్‌) వంటి ఫంగస్‌ వ్యాధులను నివారిస్తుంది. ఆకులను ఆశించే నల్లి , పేనుబంక వంటి పురుగులను అదుపులో ఉంచుతుంది.

7. మొక్కలలో పచ్చదనాన్ని పెంచడానికి సల్ఫర్‌ ఎంతో అవసరం. ఇది మొక్కలు ప్రోటీన్లను తయారు చేసుకోవడానికి, వేర్లు బలంగా పెరగడానికి సహాయపడుతుంది. 

8. ఉల్లిపాయ ద్రావణంలో సల్ఫర్, పొటాషియం వంటి పోషకాలు ఉన్నప్పటికీ, దీనిని ఎప్పుడూ నేరుగా చిక్కగా మొక్కలకు పోయకూడదు. తప్పనిసరిగా 1:1 నిష్పత్తిలో సాధారణ నీటిని కలిపి పలుచన చేసి మాత్రమే వాడాలి. ఎక్కువ మోతాదులో ఇస్తే మట్టిలో ఆమ్లతత్వం (అసిడీటీ) పెరిగే అవకాశం ఉంది.

9. మొక్కల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు నత్రజని, భాస్వరం, పొటాషియం ఎంత అవసరమో సల్ఫర్‌ (గంధకం) కూడా అంతే అవసరం. మొక్కలకు కావలసిన నాలుగో ముఖ్యమైన పోషకం సల్ఫర్‌.

10. మొక్కల ఆకులు పచ్చగా ఉండటానికి కారణం క్లోరోఫిల్‌. సల్ఫర్‌ ఈ క్లోరోఫిల్‌ తయారీకి ఎంతో సహాయపడుతుంది. దీనివల్ల మొక్కలు సూర్యరశ్మి ద్వారా ఆహారాన్ని సులభంగా తయారు చేసుకోగలవు.

11. మొక్కల్లో జీవక్రియలు సజావుగా సాగడానికి అవసరమైన అమినో ఆసిడ్స్‌ , ప్రోటీన్లు, విటమిన్ల తయారీకి సల్ఫర్‌ ముఖ్యమైనది. ఆవాలు, వేరుశనగ, పొద్దుతిరుగుడు వంటి పంటల్లో నూనె శాతాన్ని పెంచటానికి సల్ఫర్‌ చాలా ముఖ్యం. ఉల్లిపాయ, వెల్లుల్లి, క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌ వంటి కూరగాయలకు ప్రత్యేకమైన ఘాటు, రుచి మరియు వాసన రావడానికి ఇందులో ఉండే సల్ఫరే కారణం.

12. నైట్రోజెన్‌ లోపం వస్తే కింది ఆకులు పసుపు రంగులోకి మారతాయి. కానీ, సల్ఫర్‌ లోపం వస్తే మొక్క పైభాగంలో ఉండే లేత ఆకులు అంటే కొత్త ఆకులు మొదట పసుపు రంగులోకి మారతాయి. మొక్క కాండం సన్నగా, బలహీనంగా మారుతుంది. మొక్క ఎదుగుదల ఆగిపోతుంది. పూలు, కాయలు సరిగ్గా రావు, వచ్చినవి కూడా త్వరగా రాలిపోతాయి.

13. స్ప్రే చేసిన తర్వాత ఒకటి లేదా రెండు రోజుల పాటు తోటలో ఉల్లిపాయ ఘాటు వాసన వస్తుంది. ఇంటి లోపల పెంచే ఇండోర్‌ మొక్కలకు స్ప్రే చేస్తే ఇల్లంతా వాసన వస్తుంది. తక్కువగా వాడక΄ోతే నేల పాడవుతుంది. 

14. ఆకులపై స్ప్రే చేసినప్పుడు అందులోని పొటాషియం, సల్ఫర్, ఇనుము, కాల్షియంలను ఆకులు నేరుగా గ్రహిస్తాయి. దీనివల్ల ఆకులు త్వరగా పచ్చగా, నిగనిగలాడుతూ మారతాయి.

15. ఈ ద్రావణాన్ని మొగ్గలు తొడిగే సమయంలో స్ప్రే చేస్తే పూత రాలటం తగ్గి, పూలు, కాయలు ఎక్కువగా కాస్తాయి.

16. ఉల్లిపాయ ద్రావణాన్ని నీళ్లు కలపకుండా నేరుగా స్ప్రే చేస్తే, అందులోని ఘాటుకు ఆకులు ముఖ్యంగా లేత ఆకులు  మాడి΄ోతాయి. తీవ్రమైన ఎండ ఉన్న సమయంలో మధ్యాహ్నం పూట స్ప్రే చేస్తే ఆకులపై మచ్చలు పడతాయి లేదా ఆకులు ఎండి΄ోతాయి.

17. ఎప్పుడూ సాయంత్రం వేళల్లో మాత్రమే స్ప్రే చేయాలి. మొదట ఒకే ఒక మొక్కకు స్ప్రే చేసి 24 గంటలు గమనించి ఆకులకు ఏమీ కాకపపోతే, అప్పుడు తోటలోని మిగతా మొక్కలన్నింటికీ వాడవచ్చు. సాయంత్రం 4:30 లేదా 5 గంటల తర్వాత సూర్యరశ్మి తీవ్రత తగ్గిపోతుంది. దీనివల్ల ఆకులు మాడి΄ోయే ప్రమాదం అస్సలు ఉండదు. 

రాత్రంతా సమయం ఉండటం వల్ల మొక్క ఆకులు, కాండం ఈ ద్రావణంలోని పోషకాలను పూర్తిగా పీల్చుకుంటాయి. ద్రావణం త్వరగా ఆరి΄ోకుండా ఎక్కువ సేపు ఆకులపై ఉంటుంది. మొక్కలను ఆశించే చాలా రకాల పురుగులు రాత్రి వేళల్లోనే ఆక్టివ్‌గా మారతాయి. సాయంత్రం స్ప్రే చేయటం వల్ల ఇవి వెంటనే నశిస్తాయి.

18. ఒకవేళ ఉదయం ఎండ వచ్చిన తర్వాత స్ప్రే చేస్తే, ఆకులపై ఉన్న నీటి చుక్కలు లెన్స్‌ లాగా పనిచేసి, సూర్యరశ్మి తీవ్రతకు ఆకులు కాలి΄ోతాయి. కాబట్టి ఉదయం పూట ఎండ వచ్చే అవకాశం ఉన్నందున దీన్ని పగటిపూట స్ప్రే చేయక పోవటం మంచిది. 

19. ఉల్లిపాయ ద్రావణం పోలినేషన్‌కు పరోక్షంగా చాలా బాగా సహాయపడుతుంది. అయితే, ఇది తేనెటీగలను ఆకర్షించటం ద్వారా కాకుండా, మొక్క లోపలి సామర్థ్యాన్ని పెంచడం ద్వారా పనిచేస్తుంది. ఉల్లిపాయ తొక్కలలో పొటాషియం, సల్ఫర్, ఫ్లేవనాయిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల పూలు పెద్ద పరిమాణంలో, ప్రకాశవంతమైన రంగులతో పూస్తాయి. 

ఆకర్షణీయమైన రంగుల వల్ల తేనెటీగలు, సీతాకోకచిలుకలు మొక్కల వైపు ఎక్కువగా ఆకర్షితమవుతాయి. ఇందులో ఉండే పొటాషియం పూలలోని పరాగరేణువులను, మకరందాన్ని బలోపేతం చేస్తుంది. దీనివల్ల పోలినేషన్‌ విజయవంతం అయ్యే అవకాశాలు పెరుగుతాయి.

20. పోలినేషన్‌ జరిగిన తర్వాత కూడా చాలా మందికి పూలు పిందెలుగా మారకుండా రాలిపోతుంటాయి. ఈ ద్రావణాన్ని ఇవ్వడం వల్ల పూల కాడలు బలంగా మారి, పూత రాలకుండా కాయగా మారుతుంది.

21. ఉల్లిపాయ ద్రావణానికి ఉండే ఘాటైన సల్ఫర్‌ వాసన వల్ల కొన్నిసార్లు మేలు చేసే తేనెటీగలు వంటి కీటకాలు కూడా దూరంగా వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి పోలినేషన్‌ సజావుగా సాగాలంటే  మొక్క మొత్తం మొగ్గ దశలో ఉన్నప్పుడు స్ప్రే చేయవచ్చు. కానీ పూలు పూర్తిగా విచ్చుకున్న తర్వాత వాటిపై నేరుగా స్ప్రే చేయకూడదు. 

పువ్వులు విచ్చుకున్న తరువాత అంటే పోలినేషన్‌ సమయంలో ఆకులపై స్ప్రే చేయటం కంటే, ఉల్లిపాయ ద్రావణాన్ని నీటిలో కలిపి నేరుగా మొక్క మొదళ్లలో అంటే మట్టిలో పోయడం చాలా మంచిది.. దీనివల్ల వేర్ల ద్వారా పోషకాలు అందుతాయి, పైగా పూల వాసన దెబ్బతినదు.

కొల్లి కృష్ణ కుమారి,
అడ్మిన్, గుంటూరు జిల్లా 
మిద్దె తోటల బృందం
మొబైల్‌: 94906 02366 

ఇదీ చదవండి: పొలాల్లోనే భారీ ప్లాస్టిక్‌ సంచులు!


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement