సరికొత్త ‘భూగర్భ బిందు సేద్యం (ఎస్‌ఎస్‌డీఐ)’ సాంకేతికతపై పూసాలోని ఐఏఆర్‌ఐ పరిశోధనలు
నీటి వినియోగ సామర్థ్యం 90 శాతానికి, పోషకాల వినియోగ సామర్థ్యం 80 శాతానికి పెరిగిందంటున్న శాస్త్రవేత్తలు
భూమి పైన వేసే సాధారణ డ్రిప్ జీవితకాలం 6–8 ఏళ్లు మాత్రమే
భూగర్భంలో వేసే ఎస్‌ఎస్‌డీఐ డ్రిప్‌లైన్ 10–15 ఏళ్ల పాటు మన్నికగా పనిచేస్తుంది
తీవ్రమైన వాతావరణ మార్పులు, అడుగంటుతున్న భూగర్భ జలాలు, పెరుగుతున్న సాగు ఖర్చులు నేడు రైతులకు పెను సవాలుగా మారాయి. మన దేశంలో మొత్తం మంచినీటి వినియోగంలో 70 శాతం వ్యవసాయానికే ఖర్చవుతోంది. సంప్రదాయ కాలువ పద్ధతిలో నీటి తడులు పెట్టటం వల్ల సాగునీటి సామర్థ్యం కేవలం 35–40 శాతానికే పరిమితమై, అపారమైన నీరు, ఎరువులు వృథా అవుతున్నాయి. ఈ సమస్యలకు చెక్ పెడుతూ డ్రిప్ సేద్యం ముందుకొచ్చింది. భూమి పైన డ్రిప్ లైన్లు వేసి పొదుపుగా పంటలు, తోటల అవసరం మేరకు నీటి తడులు అందిస్తుండటం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే, భూమి ఉపరితలంలో పడే నీటి చుక్కలు పంటల వేర్లకు అందేటప్పటికి కొంత నీరు వృథా అవుతోంది.
ఈ నేపథ్యంలో మరింత నీటి పొదుపును సాధించే దిశగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టి మరో కొత్త డ్రిప్ వ్యవస్థను రూపొందించారు. సుస్థిర వ్యవసాయానికి బాటలు వేసే ఆ అత్యుత్తమ సాంకేతికతే ‘భూగర్భ బిందు సేద్యం’ (సబ్–సర్ఫేస్ డ్రిప్ ఇరిగేషన్ – ఎస్‌ఎస్‌డీఐ). భూగర్భ డ్రిప్ లైన్ల ద్వారా నేరుగా పంటల వేర్ల దగ్గరకే తేమను, ద్రవ ఎరువులను తీసుకెళ్లి అందించే అధునాతన వ్యవస్థ ఇది. నీటితో పాటే ఎరువుల సరఫరా (ఫెర్టిగేషన్) చేపట్టటం వల్ల నీటి కొరత, పోషకాల లోటును సమర్థంగా పరిష్కరించవచ్చని న్యూఢిల్లీ పూసాలోని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐఏఆర్‌ఐ) శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.
20–70 సెం.మీ. లోతులో డ్రిప్
సాధారణ డ్రిప్ పద్ధతిలో లేటరల్ పైపులు నేలపై ఉంటాయి. కానీ, ఎస్‌ఎస్‌డీఐ పద్ధతిలో నేల స్వభావం, పంటల అవసరాలకు అనుగుణంగా భూమి లోపల డ్రిప్ లేటరల్ పైపులను అమర్చుతారు. పొలంలో సాగు చేసే స్వల్ప కాలిక పంటలు లేదా దీర్ఘకాలిక తోటల్లో ఆయా పంటల వేర్లు ఎంత లోతుకు వెళ్తాయన్న దాన్ని బట్టి 20 నుంచి 70 సెంటీమీటర్ల (4 అంగుళాల నుంచి 28 అంగుళాల) లోతులో భూగర్భ డ్రిప్ లైన్లు వేస్తారు. లోతును బట్టి లేటరల్స్ మందం పెరుగుతుంది. దీనివల్ల నేరుగా పంటల చురుకైన వేరు వ్యవస్థ దగ్గరికే చుక్కచుక్కగా నీరు, పోషకాలు అందుతాయి. అయితే, ఆ మేరకు భూగర్భ డ్రిప్ లైన్ల ఏర్పాటు కోసం రైతులు అదనపు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ పద్ధతిలో నీటి వినియోగ సామర్థ్యం 90 శాతానికి, పోషకాల వినియోగ సామర్థ్యం 80 శాతానికి పెరుగుతుందని ఐఏఆర్‌ఐ శాస్త్రవేత్తలు అంచల్‌దాస్, కే.నితిన్‌కుమార్, అర్జున్‌సింగ్, ఎస్.సుధిశ్రీ, వీకే సింగ్ బృందం పరిశోధనలు నిరూపించాయి.
ఇక్కడా పరిశోధనలు జరగాలి
ప్రారంభ పెట్టుబడి కొంత ఎక్కువగా అనిపించినా, దీర్ఘకాలంలో భూగర్భ డ్రిప్ వ్యవస్థ రైతులకు ఎంతో లాభదాయకమని ఐఏఆర్‌ఐ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే, దక్షిణాదిలో వివిధ పంటలు, పండ్ల తోటల్లో సైతం ప్రత్యేక క్షేత్రస్థాయి అధ్యయనాలు చేపట్టి, ఫలితాలు ప్రకటిస్తే మన రైతులకు మేలు జరుగుతుంది. సాధారణ డ్రిప్‌కు ఇచ్చినట్టే భూగర్భ బిందు సేద్యాన్ని కూడా ప్రభుత్వాలు సబ్సిడీతో ప్రోత్సహిస్తే తీవ్రమైన కరువు, ఎల్‌నినో వంటి కష్టకాలాల్లో పంటలకు మరింత రక్షణ దొరుకుతుంది.
భూగర్భ డ్రిప్‌తో ప్రయోజనాలెన్నో!
→ నేలపై నీరు ఆవిరి కావటం, కలుపు మొక్కల బెడద గణనీయంగా తగ్గుతాయి. మొక్కజొన్న, గోధుమ పంటల్లో సాధారణ పద్ధతి కంటే 54 శాతం నీరు ఆదా అవుతోంది. అలాగే, 20 నుంచి 50 శాతం వరకు నత్రజని ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవచ్చు.
→ వేర్లకు ఎప్పుడూ తగినంత తేమ, పోషకాలు అందటం వల్ల పంటలు ఏపుగా పెరుగుతాయి. మొక్కజొన్నలో 20–25 శాతం, గోధుమలో 28–58 శాతం వరకు అదనపు దిగుబడులు సాధించవచ్చని ఐఏఆర్‌ఐ అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే, వరిలో 40–45% నీరు ఆదా అవుతున్నప్పటికీ.. నీరు నిల్వగట్టే పద్ధతితో పోల్చితే 10–15% దిగుబడి తగ్గే అవకాశం ఉంది.
→ డ్రిప్ పైపులు భూమి లోపల ఉండటం వల్ల ఎండకు పాడుకావు. ఎలుకల బెడద తక్కువ. ప్రతి పంట మార్చినప్పుడల్లా పైపులు తీయటం, మళ్లీ వెయ్యటం వంటి శ్రమ, కూలీల ఖర్చు తప్పుతుంది.
→ సాధారణ డ్రిప్ జీవితకాలం 6–8 ఏళ్లు అయితే, ఎస్‌ఎస్‌డీఐ 10–15 ఏళ్ల పాటు మన్నికగా పనిచేస్తుంది.
ఫెర్టిగేషన్ లో జాగ్రత్తలు
→ భూగర్భ డ్రిప్ పైపుల ద్వారా నీటిలో పూర్తిగా కరిగే (వాటర్ సాల్యుబుల్) ఎరువులను మాత్రమే అందించాలి.
→ యూరియా, అమ్మోనియం నైట్రేట్, కాల్షియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్ వంటివి నీటిలో సులభంగా కరుగుతాయి.
→ సాధారణ భాస్వరం (ఫాస్పరస్) ఎరువులు పైపుల్లో పేరుకుపోయి రంధ్రాలు మూసుకుపోయే ప్రమాదం ఉంది, కాబట్టి తగిన
ద్రవ రూప ఎరువులనే ఎంచుకోవాలి.
→ ప్రతి పంట కాలం పూర్తయిన తర్వాత డ్రిప్ లేటరల్స్‌ను శుభ్రంగా ఫ్లష్ చేయాలి. ఇసుక, స్క్రీన్ ఫిల్టర్లను తరచూ శుభ్రపరుస్తూ, అవసరమైతే యాసిడ్ ట్రీట్‌మెంట్ (హైడ్రోక్లోరిక్/ఫాస్ఫారిక్ ఆమ్లం) చేయటం ద్వారా భూగర్భంలోని డ్రిప్పర్లు మూసుకుపోకుండా కాపాడుకోవచ్చు.


