గ్యాడ్జెట్స్‌తో  సేఫ్టీ డబుల్‌ | Essential Personal Safety Devices for Womens | Sakshi
Sakshi News home page

గ్యాడ్జెట్స్‌తో  సేఫ్టీ డబుల్‌

Nov 17 2026 4:21 AM | Updated on Nov 17 2026 4:21 AM

Essential Personal Safety Devices for Womens

ఉమెన్‌ సేఫ్టీ

మహిళల భద్రతపై ఆందోళనలు పెరుగుతున్న వేళ... ఆత్మరక్షణ కోసం సరికొత్త సాంకేతిక పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఒకప్పుడు పెప్పర్‌ స్ప్రే, అలారాలకే పరిమితమైన వ్యక్తిగత భద్రతా సాధనాలు ఇప్పుడు ఆధునిక రూపం సంతరించుకుంటున్నాయి. పెన్నులా కనిపించేవి, కీచైన్ లకు వేలాడదీసుకునేవి, ఆభరణాల్లా ధరించేవి... ఇలా చిన్న పరిమాణంలో ఉండే ఈ పరికరాలు అత్యవసర సమయాల్లో మహిళలకు అండగా నిలిచేలా రూపొందిస్తున్నారు.

ఎలక్ట్రిక్‌ స్టన్  పెన్ 
సాధారణ పెన్నులా కనిపించే ఈ పరికరం ప్రమాదం వచ్చినప్పుడు షాక్‌లను కూడా ఇస్తుంది. దాడి చేసేవారిని తాత్కాలికంగా నిలువరించి తప్పించుకునేందుకు అవకాశం కల్పిస్తుంది.

హై డెసిబెల్‌ కీచైన్  అలారం
కీచైన్  రూపంలో ఉండే ఈ పరికరాన్ని నొక్కగానే పెద్ద శబ్దం వస్తుంది. చుట్టుపక్కలవారి దృష్టిని ఆకర్షించడంతో పాటు ప్రమాదంలో ఉన్నట్లు ఇతరులకు తెలియజేస్తుంది.కొన్ని అలారాలు 130 డెసిబుల్స్‌ వరకు శబ్దం చేస్తాయి.

విండో బ్రేకింగ్‌ హ్యామర్‌
అత్యవసర పరిస్థితుల్లో కారులో చిక్కుకున్నప్పుడు అద్దాలను పగలగొట్టి బయటపడేందుకు ఉపయోగపడుతుంది. చిన్న పరిమాణంలో ఉండడంతో కారులో లేదా బ్యాగులో ఉంచుకోవచ్చు.

పవర్‌ఫుల్‌ టార్చ్‌
చీకటి ప్రదేశాల్లో ప్రయాణించేటప్పుడు పరిసరాలను పరిశీలించేందుకు, ప్రమాదాన్ని ముందుగానే గుర్తించేందుకు ఉపయోగపడుతుంది. అవసరమైనప్పుడు దాడి చేసేవారి దృష్టిని మళ్లించేందుకు కూడా తోడ్పడుతుంది.

ఎస్‌ఓఎస్‌ జ్యువెలరీ 
ఆభరణంలా కనిపించే ఈ పరికరంలో అత్యవసర అలర్ట్‌ వంటి ఫీచర్‌ ఉంటుంది. ఆపద సమయంలో సహాయం కోరేందుకు, ముందుగా నిర్ణయించుకున్న వ్యక్తులకు సమాచారం చేరవేసేందుకు వీలుంటుంది.

పెప్పర్‌ స్ప్రే సేఫ్టీ షీల్డ్‌
పెప్పర్‌ స్ప్రేను సులభంగా అందుబాటులో ఉంచుకునేందుకు ప్రత్యేక హోల్డర్లు, సేఫ్టీ పరికరాలు రూపొందిస్తున్నారు. వీటివల్ల అవసరమైనప్పుడు స్ప్రేను త్వరగా బయటకు తీసి ఉపయోగించుకోవచ్చు.

సీఓ2 ఎయిర్‌ పిస్టల్‌
గ్యాస్‌ ఒత్తిడితో పనిచేసే ఈ పిస్టల్‌ చూడటానికి నిజమైన తుపాకీలా ఉంటుంది. అయితే దీని వినియోగం, కొనుగోలుకు సంబంధించిన చట్టపరమైన నిబంధనలను తెలుసుకోవడం తప్పనిసరి.

అవగాహనే అసలైన రక్షణ!
ఇలాంటి పరికరాలు వెంట ఉంచుకోవడం ఒక్కటే భద్రతకు హామీ కాదు. వాటిని ఉపయోగించే విధానం, చట్టపరమైన పరిమితులపై అవగాహన కూడా అవసరం. ఆపదలో చిక్కుకున్నప్పుడు పోరాడటమే కాదు..సురక్షితంగా బయటపడేందుకు అవసరమైన సమయాన్ని సంపాదించుకోవడం కూడా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement