మహారాష్ట్రలోని కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయం అత్యం వైభవోపేతంగా విరాజిల్లుతుంది. మొదటిసారి వెళ్లినా ఇక్కడ ఎటువంటి గందరగోళం, హడావిడికి లోనుకాకుండా ఉంటారు. చారిత్రక ఆలయంగా కూడా పేరున్న కొల్హాపూర్‌కు వెళ్లొద్దాం...
ఆలయం చుట్టూ పరిసరాలు చరిత్ర తాలుకూ కథలను చెప్పకనే చెబుతాయి. రాతి శిల్పాలు, చిన్న సందులు, పూలు అమ్మే దుకాణాలు, సందుల్లో టీ కొట్లు, పాత ఇళ్లు అన్నీ సహజంగా అనిపిస్తాయి. గుడిలో గంటల శబ్దం, అగరబత్తి పరిమళం, కర్పూర హారతి వెలుగు, చుట్టూ భక్తి భావంతో నిండిన వాతావరణం భక్తులను బయటి ప్రపంచం టెన్షన్ల నుంచి దూరంగా తీసుకెళ్తుంది.
సందర్శనీయ ప్రదేశాలు: ఆలయం లోపల ప్రధాన మహాలక్ష్మి విగ్రహం నల్లరాయితో చేసిన అద్భుతం. ఆలయం పక్కనే ఉన్న రంకాల చెరువు ప్రాంగణం సాయంత్రం పూట ఆహ్లాదంగా ఉంటుంది, బోటింగ్ సదుపాయం ఉంది. కావాలంటే మీరు ట్రై చేయవచ్చు. కొంచెం దూరంలో ఉన్న పన్హాలా కోట నుండి కొల్హాపూర్ నగర వ్యూ అద్భుతంగా కనిపిస్తుంది. న్యూ ప్యాలెస్ మ్యూజియంలో రాజుల చరిత్రను చూడవచ్చు.
ఏం తినాలి ?: కొల్హాపూర్ ఫుడ్ చాలా ఘాటుగా ఉంటుంది. ఇక్కడి మిసల్ పావ్ కారంగా, చట్పటాగా ఉంటుంది. ఇక్కడి స్పెషల్ తాంబడా రస్సా, పాంఢ్రా రస్సా రుచి విభిన్నంగా, కానీ ఘాటుగా ఉంటుంది. స్వీట్ లో బెల్లంతో చేసే కొల్హాపూరి లడ్డు మెత్తగా నోట్లో కరిగిపోతుంది.
ఎప్పుడు వెళ్లాలి ?: అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు వాతావరణం చల్లగా, ఆహ్లాదంగా ఉంటుంది. గుడికి వెళ్లడానికి ఇదే బెస్ట్ సీజన్. ఈ సమయంలో రద్దీ తక్కువగా ఉండి, క్యూ లైన్లు మేనేజ్ చేయగలిగేలా ఉంటాయి. ఇక్కడి ప్రజలు, ఆటో డ్రైవర్లు, షాప్ కీపర్లు ఫ్రెండ్లీగా ఉంటారు.
హైదరాబాద్ నుంచి:
హైదరాబాద్ నుంచి కొల్హాపూర్ కి డైరెక్ట్ ట్రైన్ ఉంది, దాదాపు 12 గంటలు పడుతుంది. ఫ్లైట్ లో వెళ్లాలంటే వన్ స్టాప్ ఫ్లైట్, 4 నుంచి 5 గంటల్లో చేరుకోవచ్చు. రోడ్ ట్రిప్ అంటే దాదాపు 550 కిలోమీటర్లు, కారులో 10 గంటల జర్నీ చేయాల్సి ఉంటుంది. ఇది కేవలం ఆలయం మాత్రమే కాదు, మనసుకు నచ్చిన చిన్న బ్రేక్ లాంటి ప్రదేశం. వెళ్లే ముందు టికెట్స్, రూమ్ ఇవన్నీ కాస్త అడ్వాన్స్‌గా బుక్ చేసుకుంటే బెటర్.
ఇదీ చదవండి: కార్తీక వెలుగులలో శివయ్య దర్శనం


