ome | Home Minister Amit Shah accuses Rahul Gandhi of defaming India | Sakshi
Sakshi News home page

భారత్‌ను కించపరుస్తున్నారు 

Nov 16 2026 5:44 AM | Updated on Nov 16 2026 5:44 AM

Home Minister Amit Shah accuses Rahul Gandhi of defaming India

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాందీపై అమిత్‌ షా ఆగ్రహం  

అధికారం కావాలంటే గ్రామాలకు వెళ్లాలని హితవు  

పుణే: కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ అంతర్జాతీయ సదస్సుల్లో భారతదేశాన్ని కించపర్చేలా మాట్లాడుతున్నారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలను, ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి రికార్డును అపఖ్యాతి పాలు చేస్తున్నారని ఆరోపించారు. దేశాన్ని తక్కువ చేసి మాట్లాడితే అధికారంలోకి వస్తారా? అని ప్రశ్నించారు. 

అధికారాన్ని పొందాలంటే విదేశాలకు వెళ్లడం మానేసి, స్వదేశంలో గ్రామాలను సందర్శించడం మొదలుపెట్టాలని రాహుల్‌ గాందీకి హితవు పలికారు. గ్రామాలను, క్షేత్రస్థాయిలో ప్రజలను వదిలేసి, విదేశాల్లో తిరిగితే అధికారం ఎప్పటికీ దక్కదన్నారు. ఆదివారం మహారాష్ట్రలోని పుణేలో అమిత్‌ షా పర్యటించారు. నేషనల్‌ హెవీ ఇంజనీరింగ్‌ కో–ఆపరేటివ్‌ పునరుద్ధరణ కార్యక్రమానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడారు. స్వదేశంలో ఎన్నికల్లో వరుసగా ఓడిపోతుండడంతో కాంగ్రెస్‌ పార్టీ తమ నిరాశను అంతర్జాతీయ వేదికలపై వ్యక్తం చేస్తోందని విమర్శించారు.

 దేశాన్ని, దేశ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకొని తప్పుడు ప్రచారం సాగిస్తోందని ధ్వజమెత్తారు. నవంబర్‌ 13, 14 తేదీల్లో హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన భారత్‌ సమ్మిట్‌ గురించి అమిత్‌ షా ప్రస్తావించారు. దేశ విదేశాల నుంచి వామపక్ష భావజాలం కలిగిన వ్యక్తులను ఈ సదస్సుకు ఆహ్వానించారని చెప్పారు. కాంగ్రెస్‌ యువరాజు(రాహుల్‌ గాం«దీ) భారత్‌ సమ్మిట్‌కు హాజరై, భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడారని, తద్వారా అంతర్జాతీయ స్థాయిలో దేశాన్ని అప్రతిష్టపాలు చేశారని మండిపడ్డారు. పార్టీ పనితీరుపై తమ నాయకత్వాన్ని ప్రశ్నించాలని కాంగ్రెస్‌ కార్యకర్తలకు అమిత్‌ షా సూచించారు.

 ఆ పార్టీ నాయకత్వం ఇకనైనా పద్ధతి మార్చుకోకపోతే మరో 30 ఏళ్ల పాటు అధికారానికి దూరంగా ఉంటుందని తేల్చిచెప్పారు. ఎన్నికల్లో గెలుపోటములు రాజకీయ పార్టీల, వాటి నాయకుల పనితీరుపై ఆధారపడి ఉంటాయన్నారు. కాంగ్రెస్‌ 2004 నుంచి 2014 దేశాన్ని పరిపాలించిందని, ఆ సమయంలో రూ.12 లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. అందుకే దేశ ప్రజలు ఆ పార్టీని అధికారంలో నుంచి దించేసి, మోదీకి పట్టంగట్టారన్నారు. మోదీ ప్రభుత్వం గత 12 ఏళ్లుగా అవినీతిరహిత పాలన అందిస్తోందని ప్రకటించారు. ప్రధానిపై చిన్నపాటి ఆరోపణ కూడా రాలేదని పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement