కార్మీకులను బానిసలుగా మార్చడమే బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌ లక్ష్యం | Rahul Gandhi Meets Gig Workers in Telangana | Sakshi
Sakshi News home page

కార్మీకులను బానిసలుగా మార్చడమే బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌ లక్ష్యం

Nov 15 2026 5:46 AM | Updated on Nov 15 2026 5:46 AM

Rahul Gandhi Meets Gig Workers in Telangana

గిగ్‌వర్కర్ల సంక్షేమానికి సంబంధించిన నియమావళిని ఆవిష్కరిస్తున్న రాహుల్‌గాంధీ. చిత్రంలో రేవంత్‌రెడ్డి, అనిల్‌ యాదవ్, అరెకపూడి గాంధీ, దామోదర, మహేశ్‌గౌడ్, భట్టి విక్రమార్క, వివేక్, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి, పొంగులేటి, సీతక్క

కార్మీకుల శ్రమతో అంబానీ, అదానీలకు మాత్రమే లాభాలు దక్కుతున్నాయి

కార్మీకుడి శ్రమకు తగిన ఫలితం కల్పించాలనేది కాంగ్రెస్‌ సిద్ధాంతం  

గిగ్‌ కార్మీకుల సభలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ 

గాంధీ కుటుంబం మాట ఇస్తే నిలబెట్టుకుంటుంది:సీఎం రేవంత్‌రెడ్డి 

గిగ్‌ వర్కర్స్‌ సామాజిక భద్రత, సంక్షేమ పథకాల ఆవిష్కరణ  

సాక్షి, హైదరాబాద్‌: కార్మికులను బానిసలుగా మార్చడమే బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌ లక్ష్యమని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. కార్మీకులతో 24 గంటలు పనిచేయించి వారి శ్రమతో అంబానీ, అదానీ వంటివారి సంస్థలకు లాభాలు అందించేలా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. రాహుల్‌ శనివారం జయభేరి గ్రౌండ్స్‌లో జరిగిన గిగ్‌ వర్కర్స్‌ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు.

ముందుగా తెలంగాణ గిగ్‌ వర్కర్స్‌ సామాజిక భద్రత, సంక్షేమ పథకాలను ఆవిష్కరించారు. అనంతరం గిగ్‌ వర్కర్లనుద్దేశించి రాహుల్‌గాంధీ మాట్లాడారు. ‘కార్మికులు ఎండనకా వాననకా చెమటోడ్చి పనిచేస్తున్నారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేస్తున్నప్పటికీ వారి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కడం లేదు. గిగ్‌ కార్మీకులను కేవలం కార్మీకులుగా కాకుండా దేశ నిర్మాణంలో భాగస్వాములుగా గుర్తించాలి.

వారికి భద్రత, సామాజిక రక్షణ కల్పించాలని కాంగ్రెస్‌ గుర్తించింది. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా తెలంగాణ ప్రజాప్రభుత్వం కృషిచేస్తోంది. వారి హక్కుల పరిరక్షణ కోసమే గిగ్‌ పాలసీ తెచ్చింది. 21వ శతాబ్దంలో రెండు భిన్నమైన ఆలోచనా విధానాలు ఉన్నాయి. ఒకటి బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌ ఆలోచన, మరొకటి కాంగ్రెస్‌ ఆలోచన. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ గిగ్‌ కార్మీకులను వెట్టి కార్మికులుగా, సేవకులుగా మార్చేందుకు ప్రయత్నిస్తోంది.

రోజంతా పనిచేయిస్తూ, ప్రమాదాల్లో గాయపడినా, ప్రాణాలు కోల్పోయినా పట్టించుకోకుండా, మొత్తం లాభాలను కార్పొరేట్‌ సంస్థలకు దక్కేలా చేసింది. గిగ్‌ కార్మీకులు దేశానికి పునాది వంటివారని కాంగ్రెస్‌ భావించింది. వారిని భాగస్వాములుగా గుర్తించి, వారికి రక్షణ కల్పించాలన్నదే కాంగ్రెస్‌ విధానం. సీఎం రేవంత్‌రెడ్డితోపాటు తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్‌ పార్టీ గిగ్‌ కార్మీకులకు అండగా ఉంటాయి’అని రాహుల్‌ చెప్పారు.  

కార్మీకుల డేటాపై వారికే హక్కు 
‘ఈ శతాబ్దాన్ని డేటా శతాబ్దమని అంటున్నాం. గూగుల్, ఫేస్‌బుక్, వాట్సాప్, ఉబర్‌ వంటి సంస్థల కార్యకలాపాలన్నీ డేటా ఆధారంగానే సాగుతున్నాయి. అయితే గిగ్‌ కార్మికులు తమ పనికి సంబంధించిన సమాచారాన్ని ఇప్పటివరకు పూర్తిస్థాయిలో తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది. తాము ఎన్ని డెలివరీలు చేశాం.. వాటికి ఎంత సమయం పట్టింది... ఎంత ఆదాయం వచ్చింది.. ఆ డబ్బు ఎప్పుడు చెల్లించారు.. తదితర వివరాలు కార్మీకులకు అందుబాటులో ఉండేవి కావు.

శ్రమ వారిదే, డేటా వారిదే అయినప్పటికీ దానిపై వారికి నియంత్రణ లేకుండా పోయింది. కొత్త చట్టం ద్వారా కార్మీకులకు తమ డేటాపై హక్కు కల్పించాం. ప్రతి పని, ప్రతి డెలివరీ, ప్రతి లావాదేవీకి సంబంధించిన వివరాలను వారి మొబైల్‌ ఫోన్లలోనే చూసుకునే అవకాశం ఉంది. నగరాల్లో ఎండ, వాన తేడా లేకుండా బైక్‌లపై తిరుగుతూ డెలివరీలు చేస్తున్న గిగ్‌ కార్మీకులకు విశ్రాంతి తీసుకునేందుకు హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వైఫై సదుపాయంతో కూడిన విశ్రాంతి కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.

అక్కడ వాహనాలను పార్క్‌ చేసుకోవడంతోపాటు కాసేపు కూర్చుని విశ్రాంతి తీసుకోవచ్చు.. అవసరమైతే సేదతీరేందుకూ వీలుంటుంది. గిగ్‌ కార్మీకులకు ప్రమాదాలు జరిగినా, అనారోగ్యానికి గురైనా వారి కుటుంబాలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రతీ కార్మీకుడికి రూ.5 లక్షల ప్రమాద బీమా, రూ.10 లక్షల ఆరోగ్య బీమాను ఈ చట్టం ద్వారా కల్పించాం. కార్మీకులకు భవిష్యత్తులో ఆర్థిక భద్రత, పింఛను సదుపాయం ఉండాలనే ఉద్దేశంతో ప్రతి లావాదేవీపై ఒక శాతం మొత్తాన్ని వారి సామాజిక భద్రత కోసం ప్రభుత్వం కేటాయించింది.

ఉబర్‌ రైడ్, బ్లింకిట్‌ డెలివరీ సహా ప్రతీ లావాదేవీపై ఈ నిధిని కంపెనీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తం గిగ్‌ కార్మికుల సంక్షేమ బోర్డుకు చేరుతుంది.. అక్కడి నుంచి కార్మీకుల ఖాతాలకు నేరుగా అందుతుంది. పాదయాత్రలో భాగంగా గిగ్‌ కార్మీకులను కలిసినప్పుడు వారి సమస్యలు, బాధలను తెలుసుకున్నా. కాంగ్రెస్‌ పార్టీ, సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీల మేరకు చర్యలు తీసుకుంటున్నాం’అని రాహుల్‌ గాంధీ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement