సమావేశంలో మాట్లాడుతున్న ఏలూరి
పీఆర్సీ నివేదిక తెప్పించి 42 శాతం ఫిట్‌మెంట్ అమలు చేయాలి
వారానికి ఐదు రోజుల పనిదినాలు అమలు చేయాలి
టీజీఓ విస్తృత స్థాయి సమావేశంలో అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు డిమాండ్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి బిల్లుల చెల్లింపుల పరిమితిని రూ.వెయ్యి కోట్ల నుంచి రూ.2 వేల కోట్లకు పెంచాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని కోరారు. శనివారంనాడు టీజీఓ భవన్‌లో సంఘ విస్తృత స్థాయి సమావేశం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘రెండో వేతన సవరణ సంఘం(పీఆర్సీ) నివేదికను వెంటనే తెప్పించుకోవాలని, 42 శాతానికి తగ్గకుండా ఫిట్‌మెంట్ అమలు చేయాల’ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. వీటిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందించనున్నారు. ఈ సమావేశంలో టీజీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.శ్యామ్, కేంద్ర సంఘం కార్యవర్గ సభ్యులు, 33 జిల్లాలు, హైదరాబాద్ నగరం, సచివాలయ ప్రతినిధులు, 76 శాఖల ఫోరమ్‌ల నాయకులు, మహిళా విభాగం ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రధాన తీర్మానాలు...
⇒ ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పనిదినాలు – వివిధ శాఖల్లో అధికారిక విధుల కోసం వినియోగిస్తున్న అద్దె వాహనాల నెలవారీ చార్జీలను ప్రస్తుత మార్కెట్ ధరలకు అనుగుణంగా సవరించి కనీసం రూ.60 వేలకు పెంచడం
⇒ అన్ని శాఖల్లో పదోన్నతుల కోసం డీపీసీలను ఏర్పాటు చేసి ప్రమోషన్ల ప్రక్రియను వేగవంతం చేయడం, ఏటా మే నెలలో సాధారణ బదిలీలు
⇒ ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలు, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని శాశ్వత ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వ గుర్తింపు పునరుద్ధరణ
⇒ ఉద్యోగ సంఘాల రాష్ట్ర, జిల్లా ముఖ్య కార్యవర్గ సభ్యులకు సాధారణ బదిలీల నుంచి మినహాయింపు, జిల్లా సంఘాల కార్యవర్గ సభ్యులకు 21 రోజుల ప్రత్యేక సాధారణ సెలవుల పునరుద్ధరణ
⇒ అన్ని జిల్లాల్లో గెజిటెడ్ అధికారుల సంఘాల కార్యాలయ భవనాల నిర్మాణానికి, హౌసింగ్ సొసైటీల ద్వారా ఇళ్ల స్థలాల కేటాయింపునకు ప్రభుత్వ భూమిని కేటాయింపు


