సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ‘అభయ హస్తం’లో ఇచ్చిన హామీల అమలుపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నలు సంధించారు. హైదరాబాద్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీని ఉద్దేశించి సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో పోస్టు చేశారు. 420 హామీలు, 13 డిక్లరేషన్లు, ఆరు గ్యారంటీల అమలు ఏమైందని నిలదీశారు.
అయితే, బీసీలకు రూ.లక్ష కోట్ల బడ్జెట్ కేటాయిస్తామన్న హామీ ఏమైందని కేటీఆర్ ప్రశ్నించారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో బీసీలకు 42 శాతం వాటా కల్పిస్తామన్న హామీని ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు. ఎస్సీ, ఎస్టీ పేద కుటుంబాలకు రూ.12 లక్షల ఆర్థిక సాయం చేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు.
అలాగే, యువతకు 365 రోజుల్లో రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని కేటీఆర్ ప్రస్తావించారు. ఈ హామీల అమలుపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: గిగ్ వర్కర్ల సమస్యలను పరిష్కరిస్తాం: రాహుల్


