సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లాలో బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ఉద్దేశించి సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఆమెపై ఆరోపణలు వచ్చాయి. సిమ్లాకు చెందిన అతుల్ శర్మ ఈ వ్యవహారంపై డీజీపీ అశోక్ తివారీకి ఫిర్యాదు చేశారు. కంగనా వ్యాఖ్యలు విద్వేషాలను ప్రోత్సహించేలా, రాజ్యాంగంపై విధేయతను ప్రశ్నించేలా, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేలా ఉన్నాయని ఆరోపించారు. ఇందుకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసి, నిర్ణీత కాలపరిమితిలో విచారణ జరపాలని కోరారు.
కంగనా సోషల్ మీడియా పోస్టుల్లో మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీల మరణాలపై తీవ్రమైన ఆరోపణలు చేసినట్లు ఫిర్యాదుదారు పేర్కొన్నారు. సోనియా గాంధీని అనుమానాస్పద విదేశీయురాలిగా చిత్రీకరించారని ఆరోపించారు. ఆధారాలు లేని ఇటువంటి వ్యాఖ్యలు ప్రజాశాంతికి విఘాతం కలిగించే ప్రమాదం ఉందని ఫిర్యాదులో తెలిపారు.
ఈ ఫిర్యాదు నేపథ్యంలో సిమ్లా పోలీసులు కంగనాపై కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని ఎస్ఎస్పీ గౌరవ్ సింగ్ ధ్రువీకరించారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని సెక్షన్ 353 (తప్పుడు సమాచారం), 356 (పరువునష్టం), 196 (వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం) కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి: 35 మంది హత్య.. ఐదుగురు మాజీ సైనికులకు శిక్ష!


