మృత్యు ప్రయాణం | Major Road Accident in Assam | Sakshi
Sakshi News home page

మృత్యు ప్రయాణం

Nov 14 2026 2:05 AM | Updated on Nov 14 2026 2:05 AM

Major Road Accident in Assam

అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం  

కంటైనర్‌ ట్రక్కును ఢీకొట్టిన మినీ బస్సు  

26 మంది దుర్మరణం.. 20 మందికి గాయాలు  

మృతుల్లో ఎక్కువ మంది కళాశాల విద్యార్థులే  

కాజీరంగా: అస్సాంలోని ప్రఖ్యాత కాజీరంగా నేషనల్‌ పార్కు సమీపంలో శుక్రవారం ఘోర ప్రమాదం సంభవించింది. మినీ బస్సు, భారీ కంటైనర్‌ ట్రక్కు పరస్పరం ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది గాయపడ్డారు. మృతుల్లో ఒక మహిళ, 12 ఏళ్ల బాలుడు ఉండగా, మిగిలినవారిలో చాలా మంది కాలేజీ విద్యార్థులే కావడం గమనార్హం. తరగతులకు హాజరై మినీ బస్సులో తిరిగి వస్తుండగా దురదృష్టవశాత్తూ ప్రమాదంలో మృతి చెందారని పోలీసులు చెప్పారు.

జాతీయ రహదారి–175పై కోహోరా రేంజ్‌లోని హత్తీకులీ టీ ఎస్టేట్‌ సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు వెల్లడించారు. ప్రయాణికులతో కూడిన మినీ బస్సు గోలాఘాట్‌ నుంచి నాగావ్‌ వైపు వెళ్తుండగా, కంటైనర్‌ ట్రక్కు అప్పర్‌ అస్సాం వైపు ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని గోలాఘాట్‌ జిల్లా ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ పేర్కొన్నారు. ఇప్పటిదాకా 23 మంది మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారని, మృతుల్లో కొందరిని గుర్తించగా, మిగిలినవారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని తెలియజేశారు.

ప్రమాద సమయంలో బస్సులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారన్నది ఇంకా కచ్చితంగా తెలియరాలేదని, 45 మందికిపైగా ఉండొచ్చని అంచనా వేస్తున్నామని గోలాఘాట్‌ సీనియర్‌ ఎస్పీ స్వప్ననీల్‌ డేకా చెప్పారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అస్సాం పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అతుల్‌ బోరా ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. క్షతగాత్రులను అంబులెన్సుల్లో ఆసుపత్రికి తరలించారు. గాయపడినవారిని కోహోరా ఆసుపత్రిలో చేర్చించారు.

 తీవ్రంగా గాయపడినవారిని మెరుగైన చికిత్స కోసం బోకాఖత్, గోలాఘాట్, జోర్హాట్‌ ఆసుపత్రులకు తరలించారు. మినీ బస్సు కాజీరంగా నేషనల్‌ పార్కు సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా అత్యంత వేగంగా దూసుకెళ్తూ కంటైనర్‌ ట్రక్కును ఢీకొట్టిందని స్థానిక అధికారులు తెలిపారు. డ్రైవర్‌ తన వాహనంపై నియంత్రణ కోల్పోయాడని, ఈ క్రమంలోనే ప్రమాదం జరిగిందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ ఉదంతంపై సమగ్ర దర్యాప్తు నిర్వహించనున్నట్లు స్పష్టంచేశారు. మినీ బస్సు ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వాహనంపై గతంలో 12 చలాన్లు నమోదవ్వగా, వాటికి సంబంధించి రూ.38,500 జరిమానా చెల్లించారు. మరో రూ.4,000 జరిమానా చెల్లించాల్సి ఉంది. 

ఈ వాహనం నాగావ్‌కు చెందిన అంజీర్‌ అలీ పేరు మీద రిజిస్టరై ఉంది. కాజీరంగలో జరిగిన ప్రమాదం గురించి తెలిసి తాను తీవ్ర ఆవేదనకు గురయ్యానని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్టుచేశారు. ఈ దుర్ఘటన తమను కలచివేసిందని ఉద్ఘాటించారు. ఆప్తులను కోల్పోయిన ప్రతి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు వెల్లడించారు.

రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి 
అస్సాంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 26 మంది మరణించడం పట్ల రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రధానమంత్రి వెల్లడించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సైతం తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement