సాక్షి, బెంగళూరు: బంధుమిత్రుల ఆనందోత్సాహాలమధ్య పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ ఇంట తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. చివరి పెళ్లి పత్రిక ఇవ్వడానికి బయటకు వెళ్లిన వధువు అనంత లోకాలకు వెళ్లిపోయింది. రోడ్డు ప్రమాదంలో తన ఒక్కగానొక్క కుమార్తెను కోల్పోయిన ఓ తండ్రి గుండెకోత ఇది. పెళ్లి కావాల్సిన టెకీ, తన సమీప బంధువుతో కలిసి వెళుతుండగా, లారీ ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన హృదయవిదారక ఘటన బెంగళూరులోని దీపాంజలినగర్‌లో చోటుచేసుకుంది. రోడ్డుపై వెడ్డింగ్ కార్డులన్నీ చెల్లాచెదురుగా పడిపోయిన ఘటన పలువుర్ని కలిచి వేసింది.
అసలేం జరిగింది?
బెంగళూరుకు చెందిన ఆటో డ్రైవర్ నంజుండప్ప ఒక్కగానొక్క కుమార్తె సింధుశ్రీ (29) సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది ఆమెకు వివాహం నిశ్చయమైంది. గురువారం 'అరశిన శాస్త్రం (హల్దీ)', 'బాలే శాస్త్రం' వేడుకలతో పెళ్లి సంబరాలు ప్రారంభం కావాల్సి ఉండగా, ఆదివారం రిసెప్షన్‌కు కుటుంబ సభ్యులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. బుధవారం సాయంత్రం, బంధువులకు చివరి పెళ్లి పత్రిక ఇచ్చేందుకు సింధుశ్రీ పక్కింటి వారి ద్విచక్ర వాహనంపై తన అత్త కూతురు, డిప్లొమా ఫైనల్ ఇయర్ విద్యార్థిని విద్య (19)తో కలిసి బయలుదేరారు.
పెళ్లి పత్రిక ఇచ్చి తిరిగి వస్తుండగా, దీపాంజలినగర్ వద్ద వేగంగా వచ్చిన ఒక లారీ వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ లారీ చక్రాల కింద నలిగిపోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ వాహనాన్ని వదిలి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Strong winds scattered a man’s sister’s wedding invitations all over a busy Bengaluru highway. > Complete strangers jumped in, risking the traffic, to help him collect every last invitation❤️ Humanity is not dead....👏🏻 https://t.co/fnaRoHqFnk
— The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer) November 6, 2026
ఇదీ చదవండి: 15 ఏళ్ల కొడుక్కి, రూ. 1.6 కోట్ల కారు గిప్ట్ : ఎందుకో తెలుసా?
తండ్రి కన్నీటి పర్యంతం
గురువారం మార్చురీ వద్ద నంజుండప్ప రోదించిన తీరు అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది. "నేను ఆటో నడుపుతూ నా కూతురిని చదివించుకున్నాను. పెళ్లి కోసం ఎన్నో ఆశలతో అన్నీ కొన్నాను. ఇల్లంతా పెళ్లి పనులతో కళకళలాడుతోంది. కానీ ఈ ప్రమాదం మా జీవితాలను తలకిందులు చేసింది" అంటూ ఆయన బోరున విలపించారు. "ఈరోజు నా కూతురికి హల్దీ వేడుక జరగాల్సి ఉంది. కానీ, ఆమె అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నాను. ఆదివారం రిసెప్షన్ జరగాలి, ఇల్లంతా పెళ్లి సామాన్లతో సందడిగా ఉంది..ఇపుడిక శూన్యమే మిగిలింది" అంటూ సింధుశ్రీ పెళ్లి ఏర్పాట్లకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: రూ. 7 కోట్లు కట్టండి : కేజ్రీవాల్‌కు, ఆయన కుమార్తెకు బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపు!
పోలీసుల నిర్లక్ష్యంపై బంధువుల ఆగ్రహం
ఈ ప్రమాదంపై మృతుల బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నివాస ప్రాంతాల్లోకి భారీ సరుకు రవాణా వాహనాలను అనుమతించడమే ఈ ప్రమాదానికి కారణమని వారు ఆరోపిస్తున్నారు. ఒక్కగానొక్క బిడ్డను కోల్పోయిన ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి అని ఆగ్రహంతో ప్రశ్నిస్తున్నారు. పోలీసులు ఈ రోడ్డులోకి గూడ్స్ వాహనాలను అనుమతించకపోయి ఉంటే రెండు నిండు ప్రాణాలు దక్కేవి. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు?" అని కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు.
ఇదీ చదవండి: కేరళలో విస్తరిస్తున్న ‘షిగెల్లా : ఇప్పటికే 75 కేసులు


