ఔషధాల వ్యాపారంలోని లాభార్జన విధానాల మీద ఇటీవలి కాలంలో భారత అత్యున్నత న్యాయస్థానం చేసిన పరిశీలనా వ్యాఖ్యలు ఆలోచించదగినవి. మందుల తయారీదారు వ్యాపారులకు మందులు సరఫరా చేసే ధర (ప్రైస్ టు రీటైలర్)కు, రీటైల్ వ్యాపారులు రోగులకు విక్రయించే గరిష్ఠ చిల్లర ధరకు (మాక్సిమం రీటైల్ ప్రైస్)కు ఉన్న వ్యత్యాసం చూస్తే సామాన్యుడి జేబు చిల్లిపడే కారణాలు వాటంతటవే బోధపడతాయి. ‘అసలు ధరకు, ఎమ్మార్పీకి మధ్య ఉంటున్న 300– 400% వ్యత్యాసం ఎక్కడికి పోతోంది’ అని ప్రశ్నించింది. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ) క్రియా రహితంగా మారినట్లు ఉందని ఆక్షేపిస్తూ తీర్పును వాయిదా వేసింది. ఈ అసమంజస అనిశ్చిత వ్యవస్థకు దోహదం చేస్తున్నది ఎవరు? వైద్యులా? వ్యాపార వర్గాలా? మందులు తయారీదారులా? లేక ప్రభుత్వమా?
ఏం చర్యలు తీసుకోవాలి?
జరుగుతున్న అన్యాయానికి వైద్యులు ప్రత్యక్ష కారణం కానప్పటికీ పరోక్షంగా కొన్ని చర్యల ద్వారా పరిస్థితిని మెరుగు పరచవచ్చు. వారు రోగికి మందులు రాసేటప్పుడు, అవసరమైన మందులు అవసరమైన మోతాదులలో రాయడం, ఒక ప్రత్యేక కంపెనీ లేక బ్రాండ్ మందులు మాత్రమే వాడాలని చెప్పకుండా ఉండడం, ప్రభుత్వ నిబంధనలను పాటించి తక్కువ ఖర్చుతో కూడిన జనరిక్ మందుల క్వాలిటీ, సేఫ్టీ సంబంధిత అపోహలను దూరం చేసి వాటి వాడకాన్ని ప్రోత్సహించడం లాంటివి చేస్తే వినియోగదారుల సొమ్ము చాలావరకు ఆదా చేసినవారు అవుతారు. వైద్యులు వ్యాపారసంస్థల ద్వారా వచ్చే బహుమతులు, లాభాల్లో వాటాలు, ఇంకా ఇతరత్రా ఉత్తేజ కాలను లక్ష్యపెట్టక వృత్తిపరమైన విలువలను పాటించడం చాలా అవసరం. తయారీ దారులు మందులను ఒక వాణిజ్య ఉత్పత్తిగా మాత్రమే గాక ప్రాణాలను కాపాడే ఔషధంగా భావించి, అమ్మకం ధర నిర్ణయించి, రీటైల్ వ్యాపారులకు ఇచ్చే ధర– వినియోగదారుని ధర మధ్య వ్యత్యాసం సమంజసంగా ఉంచి దీర్ఘకాలంలో వ్యాపారం, లాభాలను పెంచుకునే సాధనాలపై దృష్టి పెట్టాలి. దుకాణ దారులు నియంత్రణ సంస్థల నియమాల ప్రకారం గరిష్ఠ చిల్లర ధర మించకుండా అమ్మకాలు చేయాలి.
వినియోగదారుడి అవగాహనా రాహిత్యాన్ని మితిమీరిన లాభాలకు పెట్టుబడిగా చేసుకొని దోచుకునే వ్యవస్థకు కళ్లెం వేయవలసిన బాధ్యత ముమ్మాటికీ ప్రభుత్వానిదే. అభివృద్ధి చెందిన దేశాలు తమ చట్టాల ద్వారా ఔషధ ధరలను నియంత్రించి వినియోగ దారుడికి అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎవరిది తప్పు అని నిర్ణ యించే బదులు... అనారోగ్య బాధలో ఉన్న రోగికి ఊరట కలిగించే విధంగా ప్రతి వర్గం మార్పులు చేసుకోగలిగితే, ఈ సమస్య పరిష్కారం అవుతుంది. అప్పుడే ఆరోగ్యవంతమైన భారతదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా గుర్తింపు తెచ్చుకోగలదు.
ఇదీ చదవండి: రూ. 7 కోట్లు కట్టండి : కేజ్రీవాల్‌కు, ఆయన కుమార్తెకు బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపు!
– డా.ఎస్.ఎస్. మంథా మాజీ చైర్మన్– ఏఐసీటీఈ; చాన్స్‌లర్– రామ్‌దేవ్ బాబా యూనివర్సిటీ, నాగ్‌పూర్
-డా.రామకుమార్ అంబటిపూడి, వైస్ చాన్సలర్– భగవాన్ మహావీర్ యూనివర్సిటీ, సూరత్


