అమల్లోకి వచ్చిన కేన్సర్ మందుల ధరల తగ్గుదల
137 మందులపై వ్యాపార మార్జిన్లకు కళ్లెం
679 బ్రాండ్లు సగానికిపైగా చౌక
కొన్ని బ్రాండ్లపై 96% వరకు తగ్గిన ధరలు
సాక్షి, హైదరాబాద్: కేన్సర్ బాధితులకు కేంద్రం ఊరట కల్పించింది. 137 రకాల కేన్సర్ మందులపై వ్యాపార మార్జిన్‌ను 30 శాతానికి పరిమితం చేస్తూ జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ (ఎన్‌పీపీఏ) తీసుకున్న నిర్ణయం సోమవా రం నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో పలు మందుల ధరలు సగానికిపైగా తగ్గాయి. కొన్ని బ్రాండ్ల ధర లు ఏకంగా 96 శాతం వరకు దిగివచ్చాయి. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా కేన్సర్ రోగులకు ఏటా సుమారు రూ. 3,540 కోట్లు ఆదా అవు తుందని కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
1,364 ఫార్ములేషన్లకు సవరించిన ధరలు
కేంద్ర ప్రభుత్వ ధరల నియంత్రణ పరి ధిలో లేని కేన్సర్ మందులపై కంపెనీల నుంచి రిటైల్ దుకాణాల వరకు ఒక్కో దశలో భారీ మార్జిన్లు కలుస్తుండటంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీనికి అడ్డుకట్ట వేసేందుకు డీజీహెచ్‌ఎస్ నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు ఎన్‌పీపీఏ అక్టోబర్ 17న 137 మందులపై మార్జిన్ పరిమితి ప్రకటించింది. నవంబర్ 8 నాటికి 85 కంపెనీలు 121 మందులకు చెందిన 1,364 ఫార్ములేషన్ల సవరించిన ధరలను సమరి్పంచాయి. వాటిలో 679 బ్రాండ్ల ధరలు 50 శాతానికిపైగా తగ్గాయి.
కొరత సృష్టించొద్దు
ధరలు తగ్గించిన నేపథ్యంలో మందుల ఉత్పత్తి, సరఫ రాను తగ్గించకూడదని.. మార్కెట్‌లో కృత్రిమ కొరత సృష్టించరాదని కంపెనీలను ఎన్‌పీపీఏ ఆదేశించింది. జాబి తాలోని కొన్ని మందులు ఇంకా దేశీయ మార్కెట్‌లోకి రాలేదని.. అవి విడుదలైనప్పుడు వాటికీ ఇదే మార్జిన్ పరి మితి వర్తిస్తుందని అధికారులు తెలిపారు. 2019లో ప్రయోగాత్మకంగా 42 కేన్సర్ మందులపై ఇదే తరహాలో మార్జిన్ పరిమితి విధించగా అప్పట్లో 526 బ్రాండ్ల ధరలు 90% వరకు తగ్గాయి. ఆ ప్రయోగం సత్ఫలితాలివ్వడంతో ఈసారి 137 మందులకు విస్తరించారు. రొమ్ము, ప్రోస్టేట్, పెద్దపేగు, అండాశయ, గర్భాశయ ముఖద్వార, రక్త కేన్సర్లతోపాటు 20కిపైగా కేన్సర్లలో వాడే ఇమ్యునోథెరపీ మందులు, కీమోథెరపీ సమయంలో రోగనిరోధక శక్తి పడిపోకుండా ఇచ్చే ఇంజెక్షన్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
భారీ స్థాయిలో ధరల తగ్గుదల
రొమ్ము కేన్సర్‌కు వాడే పాల్బోసిక్లిబ్ క్యాప్సూల్స్ ప్యాక్ ధర రూ. 40,421 నుంచి రూ. 2,720కి తగ్గింది. ప్రోస్టేట్ కేన్సర్‌కు వాడే అబిరాటెరోన్ మాత్రల ప్యాక్ రూ. 41,250 నుంచి రూ. 3,218కి దిగివచ్చింది. అలాగే పెద్దపేగు, అండాశయ కేన్సర్ చికిత్సకు వాడే బెవాసిజుమాబ్ ఇంజెక్షన్ రూ. 21,768 నుంచి రూ.5,930కి, బ్లడ్ కేన్సర్‌కు వాడే అజాసిటిడిన్ ఇంజెక్షన్ రూ. 6,337 నుంచి రూ. 1,495కి తగ్గింది.
ఎక్కువ ధరకు అమ్మితే ఫిర్యాదు చేయండి
మెడికల్ షాపులు, ఆసుపత్రి ఫార్మసీలు కొత్త ధరలకే మందులు అమ్మాలని.. ధరల జాబితాను దుకాణాల్లో ప్రదర్శించాలని ఎన్‌పీపీఏ ఆదేశించింది. పాత ఎంఆర్‌పీ ఉన్న స్టాక్‌ను కూడా కొత్త ధరకే విక్రయించాలని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన పర్యవేక్షణ బాధ్యతను రాష్ట్రాల ఔషధ నియంత్రణ విభాగాలకు అప్పగించింది. రోగులు ఫార్మా సహీ దామ్ యాప్ లేదా nppa.gov.in వెబ్‌సైట్‌లో కొత్త ధరలు చూసుకోవచ్చని సూచించింది. అధిక ధరలు వసూలు చేస్తే టోల్‌ఫ్రీ నంబర్ 1800–111–255కు ఫిర్యాదు చేయాలని పేర్కొంది.


