లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన కీసర ఎస్‌ఐ శ్రీనివాస్
కీసర: మేడ్చల్– మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్‌లో మరో అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. లంచం తీసుకుంటూ ఎస్‌ఐ శ్రీనివాస్ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఓ కేసులో నిందితుడి నుంచి రూ.2 లక్షలు లంచంగా తీసుకుంటూ సోమవారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికిపోయారు. చీటింగ్ కేసుతో పాటు 498ఏ వరకట్న వేధింపుల కేసులో బాధితుడికి అనుకూలంగా చార్జ్‌షీట్ దాఖలు చేయడానికి రూ.5 లక్షలు డిమాండ్ చేసి చివరకు రూ 2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.
ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. సైనిక్‌పురికి చెందిన సంపత్ యాదవ్‌పై కీసర పోలీస్‌స్టేషన్‌లో నాగారం రెవెన్యూ పరిధిలోని రాజ్‌సుఖ్‌నగర్ కాలనీలో గల సుమారు 2 వేల గజాల స్థలానికి సంబంధించి 2025లో పోర్జరీ, చీటింగ్ కేసు నమోదయింది. దీంతో పాటు గత జూలైలో సంపత్ యాదవ్ అన్న భాను ప్రకాష్ యాదవ్ భార్య దుర్గాభవానీ(నాగారం వాసి) భర్తతోపాటు, అత్తమామలు ధర్మెష్ యాదవ్, అర్చితలతోపాటు, మరిది అయిన సంతప్‌యాదవ్‌పై కీసర పోలీస్‌స్టేషన్‌లో గృహహింస కేసు పెట్టింది.
సంపత్ యాదవ్ తనపై నమోదైన కేసుకు సంబంధించి హైకోర్టు నుంచి డెరెక్షన్ ఆర్డర్ తీసుకువచ్చినప్పటికి ఎస్‌ఐ శ్రీనివాస్ ఎఫ్‌ఐఆర్‌లో అదనపు సెక్షన్లు చేర్చి అతడిని అరెస్ట్ చేశారు. కోర్టును ఆశ్రయించడంతో సంపత్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. కోర్టు ఆదేశాల ప్రకారం ప్రతి సోమవారం అతడు కీసర పోలీస్‌స్టేషన్‌లో సంతకం పెట్టడానికి హాజరవుతున్నాడు.
రెడ్‌హ్యాండ్‌గా పట్టివేత
సంపత్ యాదవ్‌పై నమోదైన రెండు కేసులతో పాటు, 498 కేసులో తన కుటుంబ సభ్యులకు అనుకూలంగా చార్జ్‌షీట్ వేసేందుకు ఎస్‌ఐ శ్రీనివాస్ రూ. 5 లక్షలు డిమాండ్ చేశాడు. అంతమొత్తం ఇచ్చుకోలేనని సంపత్ ప్రాధేయపడగా రూ. 2 లక్షలకు ఎస్ఐ అంగీకరించాడు. ఈ విషయాన్ని అతడు ఏసీబీ అధికారులకు చేరవేశాడు. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో కీసర పోలీస్‌స్టేషన్‌కు సంతకం పెట్టేందుకు వచ్చిన సంపత్.. ఎస్‌ఐ శ్రీనివాస్‌కు రూ. 2 లక్షలు లంచం డబ్బులు ఇవ్వబోయాడు. పోలీస్ స్టేషన్‌లో వద్దని నాగారంలోని శిల్పావెంచర్‌కాలనీ వద్ద వేచి ఉండాలని, అక్కడి తాను వస్తానని చెప్పాడు. నాగారం శిల్పా వెంచర్‌లో ఓ అపార్ట్‌మెంట్ వద్ద బాధితుడిని నుంచి ఎస్‌ఐ రూ. 2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండ్‌గా పట్టుకొని కీసర పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఇదీ చదవండి: సింగరేణి ప్రాంతంలో డేటా సెంటర్స్
కీసర పరిధిలో లంచావతారాలు!
ఎస్‌ఐ శ్రీనివాస్‌పై కేసు నమోదు చేశామని, మంగళవారం ఉదయం అతడిని కోర్టులో హజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం కోసం డిమాండ్ చేస్తే బాధితులు ఏసీబీని ఆశ్రయించాలని సూచించారు. అవసరమైతే బాధితుల పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. కీసర పరిధిలో ఇటివల కాలంలో సీఐ ఆంజనేయులు, ఎస్‌ఐ జ్ఙానేందర్‌రెడ్డి, ఓంగార్డు నగేష్, ఎస్‌ఐ శ్రీనివాస్‌తో, ఉపతహాసీల్దార్ సందీప్‌రెడ్డి, వీఆర్‌ఓ విజయ్‌కుమార్‌లు లంచం తీసుకుంటు ఏసీబీ రైడ్‌లో పట్టుపడ్డారని గుర్తు చేశారు. ఇక్కడ వివిధ శాఖల్లో కొనసాగుతున్న అవినీతిని అడ్డుకట్ట వేసేవిధంగా సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలిస్తామన్నారు.


