మెరెడిత్ మెజ్లర్‌తో మాట్లాడుతున్న బుద్ధప్రకాశ్
వెల్లడించిన అమెరికన్ కాన్సులేట్ అధికారులు
సింగరేణి సీఎండీ బుద్ధప్రకాశ్ జ్యోతితో భేటీ
సాక్షి, హైదరాబాద్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను శోధిస్తున్నామని అమెరికన్ కాన్సులేట్ అధికారులు వెల్లడించారు. తెలంగాణలో సింగరేణి ప్రాంతంలో కూడా వీటి ఏర్పాటుకు సుముఖంగా ఉన్నామన్నారు. కీలక ఖనిజ రంగంలో సాంకేతికత, ఉమ్మడి భాగస్వామ్యం, తదితర అంశాలపై హైదరాబాద్ అమెరికన్ కాన్సులేట్‌కు చెందిన పొలిటికల్, ఎకనమిక్ చీఫ్ మెరెడిత్ మెజ్లర్ సారథ్యంలోని ఉన్నత స్థాయి అధికారుల బృందం శుక్రవారం సింగరేణి భవన్‌లో సంస్థ సీఎండీ బుద్ధప్రకాశ్ జ్యోతితో సమావేశమయ్యారు.
మూతపడిన ఓపెన్ కాస్ట్ గనులను సద్వినియోగం చేసేందుకు సింగరేణి పలు ప్రాంతాల్లో పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని సంస్థ అధికారులు వెల్లడించారు. డేటా సెంటర్లకు పీక్ అవర్స్‌లో నిరంతరాయ విద్యుత్ అందించటం కోసం ఈ ప్లాంట్లు ఉపయోగపడతాయన్నారు. మైనింగ్ రంగంలో అపార అనుభవం గల సింగరేణి కీలక ఖనిజ రంగంలోకి ప్రవేశించిందని, ఇప్పటికే పలు దేశాలతో ఉమ్మడి భాగస్వామ్యం, సాంకేతిక సహకారంపై చర్చిస్తోందని సంస్థ చైర్మన్ వెల్లడించారు.
దీనిపై అమెరికన్ బృందం స్పందిస్తూ తమ దేశంలో కీలక ఖనిజ రంగంలో ఉన్న పలు సంస్థలతో కలిసి పని చేయడానికి అవకాశాలున్నాయని తెలిపారు. సింగరేణి ఇటీవల కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన జియో సైన్స్ లేబొరేటరీలో ఉన్న సౌకర్యాలు, ఓపెన్ కాస్ట్ గనుల ఓవర్ బర్డెన్‌లో దాగి ఉన్న రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ వంటి అంశాలపై కూడా అమెరికన్ బృందం ఆసక్తి చూపించింది. ఏప్రిల్‌లో అమెరికాలో జరిగే కీలక ఖనిజ సదస్సులో పాల్గొనాల్సిందిగా సింగరేణిని ఆహ్వానించారు. సమావేశంలో అమెరికన్ కాన్సులేట్ బృందానికి చెందిన పొలిటికల్, ఎకనమిక్ స్పెషలిస్ట్‌లు శ్రీమలి కరి, శిబా త్రిపాఠి, కమర్షియల్ స్పెషలిస్ట్ సునేల్ కుమ్మర్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: మూసీ కోసం ‘గ్లోబల్’ పోటీ!


