Hyderabad: స్విమ్మింగ్‌ పూల్స్‌ బంద్‌ | Water Crisis In Hyderabad | Sakshi
Sakshi News home page

Hyderabad: స్విమ్మింగ్‌ పూల్స్‌ బంద్‌

Nov 7 2026 1:58 PM | Updated on Nov 7 2026 2:05 PM

Water Crisis In Hyderabad

సాక్షి,హైదరాబాద్‌: మహా నగరానికి ముంచుకొస్తున్న నీటి సంక్షోభాన్ని ముందే పసిగట్టిన గేటెడ్‌ కమ్యూనిటీలు విలాసాలకు కోత పెడుతూ ముందస్తుగా అప్రమత్తమవుతున్నాయి. నీటి పొదుపునకు సిద్ధమవుతున్నాయి. ఈత కొలనులు మూసివేయడంతో పాటు నివాసితుల నీటి వినియోగంపై కఠిన పరిమితులు విధిస్తున్నాయి  

కొలను శుభ్రపర్చేందుకు.. 
సాధారణంగా ఒక ఈత కొలను సామర్థ్యం లక్ష నుంచి లక్షన్నర లీటర్ల వరకు ఉంటుంది. వీటిని క్రమం తప్పకుండా శుభ్రపరిచే ప్రక్రియలో ప్రతిసారీ కనీసం పది నుంచి 15 వేల లీటర్ల తాజా నీరు అవసరమవుతుంది. పైగా ఈ నీటిలో క్లోరిన్‌ కలపడం వల్ల దానిని ఇతర అవసరాలకు గానీ, మొక్కలకు గానీ రీసైకిల్‌ చేసి వాడే వెసులుబాటు ఉండదు. నీటి కటకట తీవ్రంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం వినోదం కోసం పది నుంచి  15 వేల లీటర్ల నీటిని వెచ్చించడం బాధ్యతా రాహిత్యమని అసోసియేషన్లు  భావిస్తున్నాయి. వ్యక్తిగత వినోదం కంటే సామూహిక అవసరాలే ముఖ్యమని భావించి కొంపల్లిలోని భీమా ప్రైడ్‌ అపార్ట్‌మెంట్‌తో పాటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని  2,000 ఫ్లాట్లు ఉన్న మై హోమ్‌ విహంగ కమ్యూనిటీ సైతం తమ ఈత కొలనులను ఇప్పటికే బంద్‌ చేశాయి. నగరంలోని పలు ప్రధాన గేటెడ్‌ కమ్యూనిటీలు స్విమ్మింగ్‌ పూళ్లను తక్షణమే మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నాయి 
    
ఆంక్షల అమలు.. 
ప్రతి కుటుంబం తమ రోజువారీ నీటి వినియోగాన్ని కనీసం 30 శాతం తగ్గించుకోవాలని రెసిడెన్షియల్‌ సొసైటీలు స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించాయి. ఇందులో భాగంగా బోరు బావుల మోటార్ల రన్నింగ్‌ వేళలను రోజుకు కేవలం రెండు విడతలకు మాత్రమే పరిమితం చేశారు. ఉదయం 5 నుంచి 7 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు మాత్రమే బోరు నీటిని ట్యాంకులకు సరఫరా చేస్తున్నారు. నీటి వృథాను అరికట్టేందుకు కుళాయిల్లో నీటి పీడనాన్ని (వాటర్‌ ప్రెజర్‌) సైతం తగ్గించారు. మురుగునీటి శుద్ధి కేంద్రాల (ఎస్‌టీపీ) నుంచి వచ్చే పునరుద్ధిరించిన నీటిని పూర్తి స్థాయిలో వినియోగిస్తున్నారు. ఈ నీటిని పచ్చదనం పరిరక్షణకు, శౌచాలయాల ఫ్లషింగ్‌కు మాత్రమే వాడుతూ తాగునీటిపై ఒత్తిడి తగ్గిస్తున్నారు.    

ఇదీ చదవండి: ప్రేమించలేదని యువతిపై లైంగిక దాడి


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement