లక్డీకాపూల్‌‌‌‌ పరిసరాల్లో వన్‌‌‌‌వే..! | Lakdikapul May See One-Way Traffic Soon | Sakshi
Sakshi News home page

లక్డీకాపూల్‌‌‌‌ పరిసరాల్లో వన్‌‌‌‌వే..!

Nov 7 2026 7:34 AM | Updated on Nov 7 2026 7:34 AM

Lakdikapul May See One-Way Traffic Soon

నగరంలోని ముఖ్య కూడళ్లలో ట్రాఫిక్‌ సమస్యలకు చెక్‌ పెట్టేందుకు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. ఈ మేరకు లక్డీకాపూల్‌ చౌరస్తాలో వన్‌వే ఏర్పాటుపై క్షేత్రస్థాయిలో సాధ్యాసాధ్యాలు పరిశీలించేందుకు సీపీ సజ్జనర్‌ స్వయంగా రంగంలోకి దిగారు. శుక్రవారం ఆయన బైకుపై పర్యటించారు. ఇక అతిముఖ్యమైన ఐటీ కారిడార్‌లోనూ వన్‌ వే లూప్‌ను పరిశీలించేందుకు సీపీ రమేశ్‌ కూడా స్వయంగా ఆయా ప్రాంతాల్లో పర్యటించారు.  

సాక్షి, హైదరాబాద్‌: కేబీఆర్‌ పార్కు చుట్టూ వన్‌–వే సత్ఫలితాలు ఇవ్వడంతో ప్రస్తుతం అధికారులు లక్డీకాపూల్‌పై దృష్టిసారించారు.  ఇందులో భాగంగా వన్‌–వే విధానాన్ని ఇక్కడా అమలు చేయాలని భావిస్తున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులు, సాధ్యాసాధ్యాలు, సవాళ్లను పరిశీలించేందుకు నగర కొత్వాల్‌ విశ్వనాథ్‌ చన్నప్ప సజ్జనర్‌ శుక్రవారం బైక్‌పై ఆ ప్రాంతంలో పర్యటించారు. ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ డి.జోయెల్‌ డేవిస్, డీసీపీ–1 అవినాశ్‌ కుమార్‌లతో కలిసి ద్వారకా హోటల్, పాత సైఫాబాద్‌ పీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ, ఇక్బాల్‌ మినార్, రవీంద్రభారతి, లక్డీకాపూల్‌ చౌరస్తా, ఓల్డ్‌ కంట్రోల్‌ రూమ్‌ జంక్షన్‌ పరిధిలోని రహదారుల స్థితిగతులను, వాహనాల రద్దీని సీపీ నిశితంగా పరిశీలించారు. 

ప్రాథమిక ప్రతిపాదన... 
ప్రాథమిక ప్రతిపాదనల ప్రకారం ఓల్డ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి రవీంద్రభారతి మీదుగా ఇక్బాల్‌ మినార్‌ వైపు వెళ్లి సికింద్రాబాద్‌ చేరుకోవాలనుకునే వాహనాలను రవీంద్రభారతి నుంచి నేరుగా అనుమతించకుండా.. హెచ్‌డీఎఫ్‌సీ, పాత సైఫాబాద్‌ పీఎస్, ఇక్బాల్‌ మినార్, సచివాలయం జంక్షన్‌ మీదుగా దారి మళ్లిస్తారు.  

నిరంకారీ జంక్షన్‌ నుంచి ఓల్డ్‌ కంట్రోల్‌ రూమ్‌ వైపు వెళ్లే వాహనాలు నేరుగా హెచ్‌డీఎఫ్‌సీ జంక్షన్‌ వైపు వెళ్లకుండా.. పాత సైఫాబాద్‌ పీఎస్‌ వద్ద ఇక్బాల్‌ మినార్‌ వైపు మళ్లించి ఆపై కుడి వైపు తిరిగి రవీంద్రభారతి మీదుగా ఓల్డ్‌ కంట్రోల్‌ రూమ్‌ వద్దకు పంపనున్నారు.  

సచివాలయం జంక్షన్, తెలంగాణ తల్లి ఫ్లైఓవర్‌ నుంచి పాత సైఫాబాద్‌ పీఎస్‌ వైపు వెళ్లే వాహనాలు నేరుగా కాకుండా.. ఇక్బాల్‌ మినార్‌ నుంచి రవీంద్రభారతి వైపు వెళ్లి, ఓల్డ్‌ కంట్రోల్‌ రూమ్‌ వద్ద యూ–టర్న్‌ తీసుకుని అసెంబ్లీ గేట్‌ నం.3, రవీంద్రభారతిమీదుగా పాత సైఫాబాద్‌ పీఎస్‌ వైపు వెళ్లేలా మార్గాలను ఖరారు చేశారు. 

అనంతరం ఇప్పటికే వన్‌–వే అమల్లో ఉన్న కేబీఆర్‌ పార్క్‌ మార్గాన్ని కొత్వాల్‌ స్వయంగా బైక్‌పై తిరుగుతూ పరిశీలించారు.  

తొలుత ప్రయోగాత్మకంగా 
లక్డీకాపూల్‌లో వన్‌–వే విధానం సజావుగా సాగేందుకు త్వరలోనే జీహెచ్‌ఎంసీ, జలమండలి, విద్యుత్‌ శాఖలతో పాటు ఇతర భాగస్వామ్య విభాగాలతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు నగర సీపీ సజ్జనర్‌ తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మొదట దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేసి, ఆ తర్వాతే శాశ్వత అమలుపై నిర్ణయం ఉంటుందన్నారు. మెరుగైన ట్రాఫిక్‌ నిర్వహణకు వాహనదారులు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కేబీఆర్‌ పార్కు వద్ద ప్రస్తుతం ఉన్న వన్‌–వే మార్గానికి అదనంగా మరో ట్రాఫిక్‌ లైన్‌ అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement