ఎమ్మెల్సీని డబ్బు డిమాండ్ చేసిన నిందితులు
రూ.10 లక్షలకు బేరం..రూ.4 లక్షలు వసూలు
ఏడుగురిని అరెస్టు చేసిన నార్సింగి పోలీసులు
మణికొండ: మార్పింగ్ ఫొటోలు, డీప్ ఫేక్ వీడియోలతో ఓ ఎమ్మెల్సీని బెదిరించి ఏకంగా రూ.5 కోట్లు డిమాండ్ చేశారు. 14 మంది ఓ ముఠాగా ఏర్పడి బెదిరింపులకు దిగగా, వారిలో ఏడుగురిని నార్సింగి పోలీసులు శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎమ్మెల్సీ మిర్జా రహమత్‌బేగ్ (ఎంఐఎం నుంచి బహిష్కరణ) మార్ఫింగ్ ఫొటోలు, అభ్యంతరకరమైన డీప్ ఫేక్ వీడియోలను చూపి తమకు రూ.5 కోట్లు ఇస్తే వాటిని బయటకు చూపమని, లేదంటే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తామని, ప్రాణాలకు సైతం ముప్పు కలిగిస్తామని బెదిరించారు.

చివరకు రూ. 10 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు.. దీంతో ఈ నెల 5వ తేదీన నిందితులతో కలిసి తన కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఎమ్మెల్సీ నుంచి రూ.4 లక్షలు ఉన్న బాక్స్‌ను తీసుకొని నిందితులు బయలుదేరారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న నార్సింగి పోలీసుల ప్రత్యేక బృందం దాడి చేసి బండ్లగూడకు చెందిన మహ్మద్ మొహసీన్‌ఖాన్, ఫాతిమాబేగం, మహ్మద్ సమీర్, మహ్మద్ జమీర్, సయ్యద్ రెహాన్, బార్కాస్ ఘాస్‌మార్కెట్‌కు చెందిన మహ్మద్ ఇమ్రాన్‌లను అరెస్టు చేశారు. ఆ తర్వాత మహ్మద్ మోసీన్‌ఖాన్‌ను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.4.70 లక్షల నగదు, రెండు ఆటోలు, ఆరు సెల్‌ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్‌ను సీజ్ చేశారు. ఇదే కేసులో మరో 8 మంది నిందితుల కోసం గాలిస్తున్నారు.


