ఇంటింటికీ ఇంటర్నెట్‌ విస్తరణకు లైన్‌ క్లియర్‌ | internet connectivity to every household | Sakshi
Sakshi News home page

ఇంటింటికీ ఇంటర్నెట్‌ విస్తరణకు లైన్‌ క్లియర్‌

Nov 7 2026 5:18 AM | Updated on Nov 7 2026 5:18 AM

internet connectivity to every household

రూ.3,185 కోట్లతో సవరించిన భారత్‌నెట్‌ అమలు 

డిజిటల్‌ భారత్‌ నిధితో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం 

12,769 గ్రామ పంచాయతీలకు అత్యాధునిక నెట్‌వర్క్‌ 

2.93 లక్షల గ్రామీణ గృహాలకు ఇంటర్నెట్‌ కనెక్షన్లు 

టీ ఫైబర్, ట్రైసిల్‌ ద్వారా బ్రాడ్‌బ్యాండ్‌ సేవల విస్తరణ

సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఇంటింటికీ ఇంటర్నెట్‌ సేవలను విస్తరించే దిశగా కీలక ముందడుగు పడింది. రాష్ట్రంలో సవరించిన భారత్‌నెట్‌ కార్యక్రమం (ఏబీపీ) అమలుకు కేంద్ర ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ల శాఖ పరిధిలోని డిజిటల్‌ భారత్‌ నిధి (డీబీఎన్‌), తెలంగాణ ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. ఈ కార్యక్రమ అమలుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ.3,185 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ఆమోదం తెలిపింది. ఢిల్లీలోని సంచార్‌ భవన్‌లో శుక్రవారం జరిగిన తెలంగాణ రూరల్‌ ఇంటర్నెట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ (ట్రైసిల్‌) తొలి బోర్డు సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసింది.

డిజిటల్‌ భారత్‌ నిధి నిర్వాహకుడు శ్యామల్‌ మిశ్రా, ఏబీపీ అమలు విభాగ డైరెక్టర్‌ హర్‌‡్ష శర్మ, రాష్ట్ర ప్రభుత్వ ఐటీ సంయుక్త కార్యదర్శి అనుదీప్‌ దురిశెట్టి, ట్రైసిల్‌ సీఈఓ, టీ ఫైబర్‌ ఎండీ పన్నీరు వేణుప్రసాద్, బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రతినిధి జి.రాజారాంమోహన్‌ పాల్గొన్నారు. వికాస్‌రాజ్, నవీన్‌ మిత్తల్, గౌరవ్‌ ఉప్పల్‌ తదితర ఐఏఎస్‌ అధికారులు వర్చువల్‌గా హాజరయ్యారు.  

12,769 గ్రామ పంచాయతీలకు రింగ్‌ టోపాలజీ 
సవరించిన భారత్‌నెట్‌ కార్యక్రమం కింద తెలంగాణ వ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీలను ఇంటర్నెట్‌ నెట్‌వర్క్‌తో అనుసంధానించనున్నారు. ఇందులో ఇప్పటికే రింగ్‌ టోపాలజీ విధానంలో పనిచేస్తున్న 10,787 గ్రామ పంచాయతీలతోపాటు, ప్రస్తుతం లీనియర్‌ విధానంలో ఉన్న 1,946 పంచాయతీలను రింగ్‌ టోపాలజీకి అప్‌గ్రేడ్‌ చేస్తారు. మరో 36 గ్రామ పంచాయతీల్లో కొత్తగా రింగ్‌ టోపాలజీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తారు. సాధారణంగా రింగ్‌ టోపాలజీలో ఒక మార్గంలో అంతరాయం ఏర్పడినా ప్రత్యామ్నాయ మార్గం ద్వారా సమాచార ప్రసారం కొనసాగించే అవకాశం ఉంటుంది.

ఈ కార్యక్రమం ద్వారా గ్రామ పంచాయతీలకు డిమాండ్‌ ఆధారంగా ఆధునిక, భవిష్యత్‌ అవసరాలకు అనుగుణమైన బ్రాడ్‌బ్యాండ్‌ సదుపాయాలు కలి్పంచనున్నారు. ప్రస్తుత ఒప్పందం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సేవలు నేరుగా వినియోగదారుల గృహలకు అందుబాటులోకి వస్తుంది. ఇందులో భాగంగా 2.93 లక్షల గ్రామీణ గృహాలకు బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్లు అందించాలని లక్ష్యంగా నిర్దేశించారు.

ఒక్కో కనెక్షన్‌కు సుమారు రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించే ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఈ ఆర్దిక సహాయానికి దాదాపు రూ.300 కోట్ల నిధులు అవసరమవుతాయని అంచనా వేశారు. మరోవైపు ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో కొత్త ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ (ఓఎఫ్‌సీ) నెట్‌వర్క్‌ నిర్మాణానికి టెండర్లు పిలిచేందుకు బోర్డు అనుమతించింది. ఈ నెట్‌వర్క్‌ నిర్మాణంతోపాటు పదేళ్లపాటు నిర్వహణ బాధ్యతలను కూడా టెండర్ల పరిధిలోకి తీసుకురానున్నారు. 

ట్రైసిల్‌ ద్వారా అమలు.. టీ ఫైబర్‌తో సమన్వయం 
ఈ కార్యక్రమ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం 2026 జూన్‌లో తెలంగాణ రూరల్‌ ఇంటర్నెట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ట్రైసిల్‌)ను ఏర్పాటు చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో ప్రత్యేక ప్రయోజన సంస్థ (ఎస్‌పీవీ)గా ఇది పనిచేయనుంది. సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల శాఖ జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం భారత్‌నెట్‌ నెట్‌వర్క్‌ ప్రణాళిక, నిర్మాణం, అమలు, నిర్వహణ బాధ్యతలను ట్రైసిల్‌ చేపడుతుంది. మండల కేంద్రాల నుంచి గ్రామ పంచాయతీల వరకు నెట్‌వర్క్‌ అనుసంధానం, బ్లాక్‌ స్థాయిలో ఇంటర్నెట్‌ లీజ్డ్‌ లైన్ల (ఐఎల్‌ఎల్‌) ఏర్పాటు, ప్రాజెక్టు అమలు సంస్థల ఎంపిక వంటి బాధ్యతలు కూడా ఈ సంస్థ పరిధిలో ఉంటాయి.

డిజైన్, నిర్మాణం, నిర్వహణ నమూనా (డీబీఓఎం) కింద పోటీ బిడ్డింగ్‌ ద్వారా ప్రాజెక్టు అమలు సంస్థలను ఎంపిక చేయనున్నారు. జిల్లా, మండల కేంద్రాల వరకు ఉన్న నెట్‌వర్క్‌ మౌలిక సదుపాయాలను టీ ఫైబర్‌ నిర్వహిస్తుండగా, ఆ తర్వాత గ్రామ పంచాయతీల వరకు భారత్‌నెట్‌ నెట్‌వర్క్‌ విస్తరణ, నిర్వహణను ట్రైసిల్‌ పర్యవేక్షిస్తుంది. తెలంగాణలో ఈ ప్రాజెక్టు అమలుతో గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో లక్షలాది కుటుంబాలకు ఫైబర్‌ టు ది హోమ్‌ (ఎఫ్‌టీటీహెచ్‌) కనెక్షన్లు అందుబాటులోకి వస్తాయి. ఆన్‌లైన్‌ విద్య, టెలీమెడిసిన్, ఈ–పాలన, రైతు వేదికలు, పౌర సేవలను మరింత విస్తృతంగా ప్రజలకు చేరువ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement