బీసీ స్టడీ సర్కిల్ విద్యార్థుల స్టైపెండ్ పెంపు | Increase in stipend for BC Study Circle students Minister Ponnam | Sakshi
Sakshi News home page

బీసీ స్టడీ సర్కిల్ విద్యార్థుల స్టైపెండ్ పెంపు

Nov 6 2026 9:47 PM | Updated on Nov 6 2026 9:49 PM

Increase in stipend for BC Study Circle students Minister Ponnam

హైదరాబాద్‌:  తెలంగాణలోని చదువుకున్న నిరుద్యోగ యువతలో చాలామందికి కేంద్ర ప్రభుత్వంలో గానీ రాష్ట్ర ప్రభుత్వంలో గానీ ఉద్యోగాలు సాధించాలనేది ఒక చిరకాల స్వప్నం. ఆ స్వప్నాన్ని సాధించే దిశగా తెలంగాణ యువత చేస్తున్న ప్రయత్నాలను  మరింత ప్రోత్సహించే విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12 బీసీ స్టడీ సర్కిల్‌లలో పోటీ పరీక్షలకు కోచింగ్‌ను తీసుకుంటున్న విద్యార్థులకు అందించే స్టైపెండ్ మొత్తాన్ని పెంచామని, ఇది కాంగ్రెస్ నాయకత్వం లోని ప్రజా ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో  నిరుద్యోగ యువతకు అందిస్తున్న ఆర్థిక చేయూత అని రాష్ట్ర బిసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలియచేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 12 బీసీ స్టడీ సర్కిల్ లను నిర్వహిస్తున్నామని వీటి ద్వారా ప్రతి ఏటా ఔత్సాహిక  యువతీయువకులకు మెరిట్ ప్రాతిపదికన పోటీ పరీక్షలకు సంబంధించిన ఉచిత కోచింగ్ సౌకర్యాన్ని అందిస్తున్నామని ఈ స్టడీ సర్కిల్‌లో కోచింగ్ తీసుకుంటున్న యువతీ యువకులకు ప్రభుత్వపరంగా అందజేసే స్టైపెండ్‌ను గతంలో ఎన్నడూ లేనివిధంగా పెంచామని, ఇది నిరుద్యోగ యువతీ యువకులకు ఆర్ధికపరమైన వెసులుబాటుని, పోటీ పరీక్షల సన్నద్ధత కు సంబంధించిన పూర్తి సహకారాన్ని అందిస్తుందని కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని యువత తమ కలల్ని నిజం చేసుకోవాలని  ఆయన  తెలియజేశారు.

యూపీఎస్సీ సివిల్స్ సర్వీసెస్ ఉచిత కోచింగ్ కు ఎంపికైన యువతీయువకుల నెలవారీ స్టైపెండ్ ను ప్రస్తుతం ఉన్న 5 వేల నుంచి 7 వేలకు పెంచామని, బుక్ ఫండ్ పేరిట ప్రతియేటా ఒకసారి ఇస్తున్న మొత్తాన్ని 5 వేల రూపాయల నుంచి 10 వేల రూపాయలకు పెంచామని, ఇక తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహించే గ్రూప్ వన్, టు,  త్రీ, ఫోర్, బ్యాంకింగ్ సర్వీస్,  రైల్వే రిక్రూట్మెంట్, స్టాఫ్ సెలక్షన్ ఉద్యోగాలకు ఉద్దేశించిన ఫౌండేషన్ కోర్సు లో కోచింగ్ తీసుకుంటున్న నిరుద్యోగ యువతీ యువకులకు ఇప్పటివరకూ ఇస్తున్న స్టైపెండ్ నెలకు 1000 రూపాయలను, 1500 రూపాయలకు  ఈ నవంబర్ నెల నుంచి పెంచామని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.

అలాగే, యుపీఎస్సీ సివిల్ సర్వీసు పరీక్ష లలో విజయానికి నిరంతర అధ్యయనం, కొన్ని సంవత్సరాల నిరంతర సాధన అవసరమని, అందుకే బీసీ స్టడీ సర్కిల్ చరిత్ర లో మొదటిసారిగా గత 2సంవత్సరాలలో బీసీ స్టడీ సర్కిల్ లో సివిల్ సర్వీసుల ఫ్రీ కోచింగ్ తీసుకున్న పూర్వ విద్యార్థులకు మరింత పటిష్టమైన ప్రిపరేషన్ అందించేందుకు తాజా అభ్యర్థులతో సమానమైన స్టైపెండ్ ను ఇస్తూ మళ్ళీ ప్రవేశం కల్పిస్తున్నామని, దీని కోసం వారికి యూపీ ఎస్ సీ తరహాలో స్క్రీనింగ్  పరీక్షను నిర్వహించి ఎంపిక చేసామని, ఇది పేద, బలహీన వర్గాల నిరుద్యోగ యువతకు కొండంత ధైర్యాన్ని ఇస్తుందని, వారికి కావాల్సిన కోచింగ్, మెంటర్షిప్ తో పాటు ఆర్ధిక సహాయం అంది, వారు తమ పూర్తి సమయాన్ని పోటీ పరీక్షల పైననే కేటాయించే అవకాశం దొరుకుతుందని ఆయన వివరించారు.

బీసీ స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకుంటున్న యువతీ యువకులలో సివిల్ సర్వీసెస్ సాధించే దిశగా చేయాల్సిన ప్రయత్నాలపై ఇటీవల ఒక నిపుణుల కమిటీని నియమించామని, ఆ కమిటీ బీసీ స్టడీ సర్కిల్ ల అభివృద్ధికి, మెరుగైన సేవలు అందించేందుకు ఎన్నో సూచనలు చేసిందని, వాటిలో ప్రధానమైన సూచన అయిన స్టైపెండ్ పెంపుదలను తక్షణమే అమలు చేసామని,  బీసీ స్టడీ సర్కిల్లో మరిన్ని మెరుగైన సేవలందించేందుకు కమిటీ చేసిన సూచనల అన్నిటినీ పరిశీలించామని, వాటన్నిటినీ అమలు చేసే దిశగా ఆదేశాలు ఇచ్చామని ఆయన అన్నారు.

ప్రతి బిసి స్టడీ సర్కిల్ భవనంలోని గోడలపై  పోటీ పరీక్షలకు సంబంధించిన విజ్ఞాన  విషయాలను, గ్రాఫ్ లు, మ్యాప్ లను  పెయింటింగ్ రూపంలో వేయాలని, హైదరాబాదు బీసీ స్టడీ సర్కిల్లో మెట్ల మీద, గోడలపైన అంతటా పోటీ పరీక్షల్లో సాధారణంగా అడిగే చరిత్ర, జాగ్రఫీ, భారత రాజ్యాంగం, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కి సంబంధించిన ఎన్నో విశేషాలని పెయింటింగ్ రూపంలో గోడలపై అలంకరించి అందంగా ముస్తాబు చేశారని,  దీనివల్ల తరగతి గదిలో లేని ఇతర సమయాల్లో కూడా ఆ పరిసరాల్లో ఉండే ఈ జ్ఞానపరమైన అంశాలను చూడటం ద్వారా విద్యార్థులు జ్ఞానాన్ని ఆర్జిస్తారని, మరింత గుర్తుపెట్టుకుంటారని, ఇలా గోడలు కూడా జ్ఞానాన్ని బోధించే తరహాలో రూపొందించిన విధానాన్ని ఆయన ప్రశంసించారు.

ప్రతి బిసి స్టడీ సర్కిల్ సొంత భవనాలలో స్టడీ రూమ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని, డిజిటల్ లైబ్రరీ ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్  సెక్రెటరీ రాహుల్ బొజ్జా, కమిషనర్ శ్రీమతి బాల మాయా దేవి, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ మామిడి హరికృష్ణ ఇతరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement